నీ అచ్చట్లు ముచ్చట్లు కరువైనాయంటూ
ఎద ఎగిరెగిరి ఆగలేక కొట్టుకుంటుందయ్యో
ఏడనున్నా వచ్చి సందిట్లో సవ్వడే చేసిపో!
నీ సురుక్కు చూపులే నన్ను కానలేదంటూ
నల్లమబ్బు కాటుకెట్టిన కళ్ళు మండెనయ్యో
వరదలా వడివడిగా వచ్చి నన్ను వాటేసుకో!
నీ లేత ముళ్ళ మీసాలు చెవి నిమరలేదంటూ
రవిక బిగువై రాగాలు శృతి తప్పి పాడెనయ్యో
పరువపు శంఖాన్ని తమకమే తగ్గేలా ఊదిపో!
నీ తుంటరి సైగలు కసితో కవ్వించ లేదంటూ
నారుమల్ల చీర నడుముజారి గోలచేసెనయ్యో
బుట్టెడు మల్లెలతో వచ్చి బాగా బుజ్జగించుకో!
నీ బెరుకుతనమేదో బిడియాన్ని బంధించెనంటూ
పెదవులే విరహవయ్యారంతో వంపు తిరిగెనయ్యో
మదనుడి కైవసపు మంత్రాలు వచ్చి వల్లించిపో!
పొంగేటి పరువాల పట్టా చేతబట్టుకుని
మిడిసిపాటు వయ్యారంతో ప్రేమించబోతే
వలపుల ఓనమాలు చేయిపట్టి దిద్దించి
ఒడిలోన వేడి సెగరేగితే నిగ్రహమంటావు!
మురిపాల ఈడు కంటపడనీయక దాచి
ఆశలే అణచి అలరించక అత్తర్లే చల్లబోతే
సరసాక్షరాలు సరిగ్గా వ్రాయమని సైగచేసి
కుసుమించే గంధమని తనువు తడిమేవు!
వయసు వసంతం వలపు బాణం వేయ
అందాలు హారతై నీకు దాసోహమనబోతే
అధరపు అంకెలతో ఎక్కాలు వల్లించమని
ఎడబాటులో ఏబీసీడీలు నేర్పుతానంటావు!
అవునంటే కాదనే భోధనలతో తికమకపడి
పదాలు పైటజార్చి నిన్ను పెనవేసుకోబోతే
హద్దులు అన్నీ చెరిపేసి ముద్దులెన్నో ఇచ్చి
మొత్తానికి ప్రేమలో పీ.హెచ్.డీ చేయించావు!
గాజులు తొడుక్కుని గదిలోన కూర్చో అంటూ
గలగలా వాగేసి స్త్రీని బలహీనురాలంటే ఎలా?
చిన్నప్పుడు విన్న తల్లి చేతి గాజుల సవ్వడి
ఉదయాన్న లేలెమ్మంటూ మేల్కొల్పిన ధ్వని
గోరుముద్దలు తినిపిస్తూ బుజ్జగింపులా రాగం
నిన్ను జోలపాడి నిద్ర పుచ్చుతూ చేసే శబ్ధం
అమ్మ చేతి గాజులు దీవించు నిన్ను అలా..
తల్లిచేతి గాజులు ఎప్పుడూ మ్రోగాలని కోరుకో
అవి మ్రోగినంత కాలం తండ్రిప్రేమకి కొదవులేదు
తల్లితండ్రులు ఆశీర్వాదం లేనిదే నీవు ఎదగవు!
భార్యా చేతిగాజుల సవ్వడి గురించి ఏం చెప్పేది
వేచిన చేతులు తలుపు తీసును చిలిపి సడితో
వేడి కాఫీ చేతికి అందిస్తూ మనసున ఒదిగేను
వంటింటి నుండి ఘుమఘుమలాడు గలగలలు
రాత్రివేళ మ్రోగు కొంటెగా కవ్వించు మువ్వలా..
భార్యచేతి గాజులను బహుగట్టిగా ఉండాలనుకో
అవి మ్రోగినంత కాలం నీ ఉనికికి ఢోకా లేదు
చేతిగాజులు పగిలి మౌనమే రోధిస్తే నీవుండవు!
సోదరిగాజుల ధ్వనిలో ఉన్నాయి వాదోపవాదాలు
నీ నుదుటిపై బొట్టుపెట్టి కట్టును రక్షాబంధనాలు
కూతురి చేతిగాజులు నాన్నా అంటూ మదినితాకి
అత్తారింటికి వెళుతూ కంటనీరు పెట్టించి తడిమేను
కోడలి గాజులే కొడుకు పెదవిపై విరిసె నవ్వులా..
సోదరి గాజుల సవ్వడితో రక్తసంబంధాన్ని పెంచుకో
కూతురు కోడలి సడి విననిదే అనుబంధమే లేదు
ఈ గాజుల సవ్వడి లేక నీవు నిరాధారమయ్యేవు!
చిరుగాలీ తుంటరి చిగురాకులా సడి చేయకే
నునుసిగ్గుతో తలవాల్చిన నా కనుదోయలకు
తెలియని ఆశలేవో చూపి ధైర్యాన్ని ఎర వేసి
నగుమోము పై ముంగురులను కదలనీయకే!
చలివెన్నెల జాబిలీ ఎదనుతట్టి నిదుర లేపకే
తారలతో నీవు తాళలేక విరహం నాలో రేపి
ఎదురు చూసిన గుండె గుబులుగున్న వేళ
మేఘాల్ని తరిమి నన్ను వీధి పాలు చేయకే!
చలువ చందన పరిమళం చిలిపిగా పూయకే
ఏకాంతం కోరుకునే ఇరువురి హృదయాలకు
కనులవిందు చేస్తానని కల్లబొల్లి కబుర్లు చెప్పి
కలవర కలువ నయనాల కునుకు దోచేసుకోకే!
మేను హొయలు వన్నెల బిగువులు చూడకే
నిండైన నా వయ్యారాలని నీ వర్ణనలో చూపి
కలలను కనుల ముందుంచి అతనిలో కసిరేపి
కవ్వించింది నేనంటూ నిందను నా పై మోపకే!