అందగాళ్ళే..

పురుషులకు సిగ్గేల సింగారము ఏల
ప్రకృతే సింగారించిన గోరువంకలాయె
మేకప్ వెలుగులు పడనిదే వెలగని 
గాజుముక్కలే అలంకరించుకోని స్త్రీలు
పురుషులు చీకట్లో మెరిసే రత్నాలు..

అందంతో అమరి ఆకర్షించే రంగులవల    
పురివిప్పి ఆడే మయూరం మగదాయె 
ఆడనెమలి తెలుపు నలుపుల్లో వెలవెల
విలువైన దంతాలు కలిగింది మగ ఏనుగే
ఆడ ఏనుగుకు ఏవి అంతటి విలువలు..

లేడి వెదజల్లలేదు కస్తూరిని మగజింకలా
అందుకే ఆడది మగజింకని రమ్మనదాయె
నాగమణిని ధరించిన కోడెత్రాచులో గంభీరం   
మణులున్నాయని వెంటపడిపోవుని నాగిని
సాదాసీదా ఆడపాముకు లేవీ చమక్కులు..

అందమంతా ఆడవారి సొంతమని మగగోల
ప్రకృతి చేసింది అన్యాయమని అరుపులాయె
సముద్రుడిలోనే దాగె ముత్యాలు రత్నాలు 
వాటికొరకేగా నదులన్నీ కలిసేది సాగరంలో 
నిడారంబర నదులకి లేకపోయె హొయలు..

విలువైన అంశాలన్నీ పురుషులకే చెందాలా
అడుగుదామంటే భగవంతుడూ మగవాడాయె
ఆశ్చర్యకరమిది తొమ్మిదినెలలు మోసి కన్నా
అంకురార్ప శౌర్యం అతనిదేనని ఊరేగింపులు
ప్రకృతే అలకరించి పంపిన పురుషపుంగవులు..

(ఆడవారి అందచందాలు తప్ప మగవారిని పొగడలేదు అభివర్ణించలేదంటూ అభియోగించిన వారికి పద్మ అర్పిస్తున్న చిరుకానుక ఆమోదయోగ్యమేనని అభిలషిస్తూ...మీ పద్మార్పిత)      

ఫోర్త్ జెండర్


పాపాలు చేసి పుణ్యం కోసం
గుడిచుట్టూ ప్రదక్షణలు చేసే
ప్రబుధ్ధులు అసలైన కొజ్జాలు..

ఇతరుల ఎదుగుదల కాంచి
ఏడవలేక నవ్వుకునే నరులు
నాణ్యత నిండిన నపుంసకులు..

మంచిమాటలని నీతులు చెప్పి
గోతులు తవ్వుతూ చెడుచేస్తూ
బ్రతికే బద్మాషోళ్ళు హిజ్రాలు..

శాంతం భూషణమని అరుస్తూ 
శీలం పవిత్రమని ప్రవచనాలు
చెప్పే సన్యాసులే శిఖండులు.. 

సుఖాల కోసమే వెతుకులాటని
దుఃఖాల ఊబిలో దూరి పైబడక
లబోదిబోమనే వారు మాడాలు..

అమ్మ ఆలిగా పనికోచ్చే ఆడోళ్ళు
ఆడపిల్లగా పుడతానంటే వద్దనే
ఆడంగినాకొడుకులే గాండూగాళ్ళు..

ఏమిటి?

కొందరు గొంతు చించుకు అరిచినా
మరికొందరు మౌనం వహించినా..
ఎవర్లో మార్పొచ్చి ఒరిగింది ఏమిటి?

తమలో తాము ఏడ్చి నవ్వించినా
పైకి నవ్వుతూ లోలోన ఏడ్చినా..
వారు ఉన్నా లేకున్నా తేడా ఏమిటి?

జోలపాడి కలల ఊహలు ఊగించినా
దరిచేర్చుకుని దూరంగా నెట్టేసినా..
నిదుర మేల్కున్నోళ్ళు చేసింది ఏమిటి?

కోరిన కోరికలు తీర్చి దివాళా తీసినా 
వాస్తవాలను కలలుగా చూపించినా..
వచ్చి వాటేసుకున్న ఆస్తులు ఏమిటి?

పగలురేయి వచ్చిపోతూ కాలం గడిచినా
నేడుని రేపటి ఊహలతో బ్రతికించినా.. 
సమయానికి వచ్చిన సమస్య ఏమిటి?

నా ఆలోచన్లు అర్థంలేని ప్రశ్నలే అయినా
వచ్చేదేమిటి ఒరిగేదేమిటని అడిగినా..
జరిగేవన్నీ జరుగక ఆగిపోవునా ఏమిటి?

ఆమె-ఆధునిక క్లియోపాత్ర

అవయవ అందాలు చూసారు అందరూ 
అంతరంగమదనం కాంచలేదు ఎవ్వరూ
అంగాంగం ప్రదర్శించెనని నిందలు వేసి
ఆయుధంగా శృంగారం సంధించెనన్నారు!

అందం చూసి నిగ్రహం కోల్పోయినవారు
అంతరంగ సిం హాసనం పై కూర్చోబెట్టారు
అనుయాయులకు ఇది అర్థంకాక గేలిచేసి
అనైతికం ఆమె భావాలోచనలు అన్నారు!
     
ఆధ్యాత్మికత జీవిత అవసరం అన్నవారూ
అంతర్గతంగా రాజీపడి ఆనకట్టలేసినవారూ         
అబల సంధించిన సమ్మోహన అస్త్రం అని 
అదే కామకళా వైదుష్యంలో మూర్చిల్లారు!

అందని అందం వికృతమని సర్దుకున్నవారు   
అధికమించి కొంతైనా అర్థం చేసుకున్నవారు
అవసరమైన ఊరడింపుతో అభయమే ఇచ్చి
అంతిమంగా కాలసర్పకాటు పడేలా చేసారు!