గుప్పెడంత గుండెకి ఏమైందో పడిపోయింది
ఎంత వెతికినా సరే ఆచూకీనే తెలియకుంది
అదేమని అర్థం చేసుకుని నిర్ణయించుకుందో
ఏ అవసరం లేదనుకుని వదిలేసిపోయింది!
ఎక్కడ ఎలాగుంటుందో ఏమోనని బెంగగుంది
ఆకలేసినా అడగలేని అమాయక అల్పప్రాణది
ఎండావాన తట్టుకోలేనిది ఒంటిరిగా ఎలాఉందో
హఠాత్తుగా వెళ్ళాలి అనుకుంది వెళ్ళిపోయింది!
ఊపిరే నాకది ఎవరినెలా అడిగి తెలుసుకునేది
చితికిందో చిరిగిందో చిల్లుపడిందో తెలియకుంది
ఎక్కడెక్కడ తిరిగి ఎన్ని అవస్థలు పడుతుందో
నలుపురంగు నచ్చక రంగుల్లో కలిసిపోయింది!
ఆశలు ఆశయాలని అణచివేసుకున్న ప్రాణమిది
గతంలో నన్ను ఒదిలేసి భవిష్యత్తు వెతుక్కుంది
ముతకదారంకన్నా పట్టుకుచ్చు మోజనిపించిందో
విసుగని వేసారిపోయి నిశ్శబ్దంగా నిష్క్రమించింది!
చిన్నిగుండెకేం తెలుసునని భావవలలో నేచిక్కింది
వడగాలికొదిలి వయసుగాలి దొంతర్లో దొర్లిపోయింది
నాజూకు గుండె నన్ను నమ్మి లాభంలేదనుకుందో
గుణపాఠం వల్లిస్తూ జీవితమే జీవచ్ఛవమయ్యింది!