ఎప్పుడో సమయం దొరికినప్పుడు
ఎలా ఉన్నావంటూ పలుకరిస్తావు
గుర్తుకు రాకపోయినా ఏదోలే..
ఒక్కసారి పలుకరిస్తే పనైపోతుంది కదా
అనుకుంటూ పనిలా మాటముగిస్తావు!
నీకై కొట్టుకునే నా ప్రాణం ఎక్కడున్నాడో
ఏం చేస్తున్నాడో అనుకుంటూ తపిస్తుంది
నీకది చాదస్తంగా అనిపించి కసురుతావు!
నిన్నే ప్రేమించిన మనసేమో..
ఏవో ఆకృతుల్లోనో ఆలోచనాక్షరాల్లోనో
గాత్రంలోనో గానంలోనో దాగున్నావనుకుంటూ
తైలవర్ణ చిత్రాలు గీస్తూ నిన్నే తలుస్తుంది
వలపు వెర్రిగా మారెనని ఎగతాళి చేస్తావు!
ఎక్కడో కలలో లీలగా కనబడుతూ
అందీఅందనట్లుగా అగుపడి కలవరపరుస్తూ
సెలయేరులా రమ్మంటే జలపాతమై వెళతావు!