నలుగురితో పంచుకోలేనంటూ లోలోన ఇమడలేక మండుతూ
కాలరాయలేని కలవర కలలను తైలంగా ఒంటిపైన వేసుకుని
మంటల్లోనైనా మరుగున పడమని మర్మాలను మసిచేస్తుంది!
నాలో మాత్రమే రగిలే కోరికల జ్వాల భగ్గున మండి ఎగసింది
నాసిరకం వలపులో చిక్కుకున్న చంచల మనసును తిడుతూ
పోయేకాలానికి వచ్చిన పుట్టెడు బుద్ధుల్ని పిడకల్లో కాల్చమని
గతజ్ఞాపకాలను గుర్తు రావద్దని సంస్కారం మరచి తిడుతుంది!
నాకు నేనుగా నిర్మించుకున్న అందమైన ఆశలసౌధం కూలింది
నిరసన తెలుపని నిస్సహాయ ఆలోచనలు మైనంలా కరుగుతూ
గతకాలజ్ఞాపకాలను చల్లార్చలేని వేడి కన్నీటిని ఆవిరై పొమ్మని
నివురుగప్పిన నిజాల్ని నిద్రలేపి గాలితో జతై కాలిపొమ్మంటుంది!
నాలో నిండిన ఆత్మస్థైర్యం నిలువున కాలుతూ బేలగా చూసింది
నీరసించిన అప్పటి నన్ను ఇప్పటి నాతో పోల్చలేక గల్లంతౌతూ
ముఖం చాటేసిన మైకపు మోహాలను మంటల్లో కాల్చివేయమని
ఆత్మను వదలి సెగల్లో కాలిన ఆశయం బూడిదై గాల్లో కలిసింది!