పరాయి వాళ్ళనే శ్రోతలుగా చేసి వినిపించేలా కలిగెనే నా భాగ్యం!
కన్నీటిదారాలు పెనవేసి గుండె గాయాలను కుట్టాను వచ్చి చూసి
పరామర్శించే నెపముతోనైనా పలుకరించి పోరాదా ఓ నా అదృష్టం!
నచ్చిన లోగిలినే అందంగా ఊహించుకుని ఎదశ్వాసనే ఊపిరి చేసి
అదృష్టాన్ని అంచనా వేయక ఆనందాన్ని పందెమేసి ఆడితి జూదం!
ఏరి కోరి అంగట్లో ఎడబాటు వ్యధలను లాభం కోసమని వేలం వేసి
లోకాన్ని జయించి నీ ముందు ఓడిపోయా ఎందుకని చెప్పు నేస్తం!
నా వలపు సాంద్రతను కొలవడం రాక నీలో ఉన్న నన్ను చంపేసి
నమ్మకాన్ని సజీవంగా ఉండమని చెప్పడం ఎంత వరకూ న్యాయం!
ప్రేమన్నది ఆటవస్తువు కాదు ఆడుకున్నంతసేపు ఆడుకుని విసిరేసి
క్రొత్తబొమ్మ కొనుక్కుని మురిపెంగా దానితో కొన్నాళ్ళు ఆడుకోవడం!
నాలాగే జీవితాంతం ప్రేమకోసమే అల్లాడి అప్పుడు దరిచేరి జతచేసి
పద్మను రమ్మని పిలిస్తే నేను పోయినా నా ప్రేమ నీపైనే ఇది సత్యం!