చేయొద్దని...

నా భావాల్లో ఇన్ని రంగులెందుకని
బయటపడి నీకు అలుసవ్వొద్దని...

నీ ఆలోచనలని చుట్టుముట్టొద్దని
నా కంట నీరుగా బయటపడొద్దని...

నా మోముపై ఈ వెలుగెందుకని
నీ హృదయంలో నేను బంధీనని...

ఆస్వాదించలేని అందమైన ప్రేమని
బంధాల గుప్పెట్లో బందిచ్చొద్దని...

అధరాలపై ఈ ధరహాసమెందుకని
ఎదలోని వేదన నీకు తెలియొద్దని...

నేను మరణిస్తే నా చితికి నిప్పెట్టొద్దని
హృదయంలో ఉన్న నిన్ను కాల్చొద్దని.

ఒంటరినై....

అందరిలో నే ఒంటరిగా ఉన్నా
ఒంటరిలో నిన్ను తలంచి...
నలుగురిలో నవ్వేస్తున్నా!

గువ్వలు గూటికి చేరుకున్నా
నువ్వులేని గూడునెంచి...
ఒంటరినై విలపిస్తున్నా!

నీవస్తావని సింగారించుకున్నా
అద్దంలో నన్ను నేగాంచి...
మిడిసిపడలేక మిగిలున్నా!

కలనైనా కనిపిస్తావనుకున్నా
మూతపడని కనులుతెరచి,,,
నిదురకై నేను ఎదురుచూస్తున్నా!

అనురాగానికి అర్థం నేనన్నా
అందని నీకేం అందించి...
ఆప్యాయతను ఇవ్వననడుగుతున్నా!

భావాలెన్నో..

నాలో పొంగే భావాలే నన్నుమరి మరి వెంటాడి వేధిస్తున్నాయ్..
నాతో సహకరించని నిజాలు నన్నుతప్పు చేయమంటున్నాయ్..
నా ఈ చేతకాని ఆలోచనలు కలల నిప్పుల్లో కాలిపొతుంటే..
ఆనంద గడిలెన్నోఆదర్శాల అగ్నికి ఆహుతి అవుతుంటే..
నీవు మాత్రం నిశ్చింతగా అక్కడ ఎలా నిదురపోతున్నావ్..
నాలో నీ తలపులతో కూడిన చింత ఎందుకు రేపుతున్నావ్..
నీపై నాకు లేని అధికారానికై ఎందుకింత తాపత్రయం..
నీ ఆనందం తప్ప ఇంకేమీ ఆశించని నా ఈ ప్రయత్నం..
నిర్మలమనసు నియమనిబంధనలను లెక్కచేయకన్నాయ్..
భీతులెన్నో ముసురువీడిన మబ్బులవోలె వెంటాడుతున్నాయ్..
అయినా చంచలమైన భావాలు చెలరేగిపోతూనే ఉన్నాయ్..
తెలిసీ తెలియకుండానే తీయని భాధను వెతుకుతున్నాయ్..

నా కనులు...

నా కనులు...
నన్ను నాకు చూపాయి
లోకాన్ని చూడమన్నాయి
మంచీచెడులను చూసాయి
ఎన్నో కలలకు రూపాలైనాయి!
నా కనులు...
ఎదఘోషను తెలిపాయి
పెదవి పలుకని పదాలైనాయి
మౌనంగా ఊసులే చెప్పాయి
భావాలకు భాష్యాలు నేర్పాయి!!
నా కనులు...
ఎన్నెన్నో కళలు నేర్చాయి
భాధలో భాష్పాలై ఓదార్చాయి
ఆలోచనలకు బంధీ అయినాయి
మనసుకు మాత్రం లొంగిపోయాయి!!!

కలర్స్...


పసిడి మెరుపుల పసుపుతనం
చెక్కిళ్ళపై మెరవాలి ఎరుపుదనం
నలుపై విరియాలి కురుల అందం
కళ్ళలో నీలి కలల అలల చల్లదనం
పలుకులు కావలె తేనెలతీయదనం
ఆకుపచ్చని ఆరోగ్యమే హరిచందనం
గులాబి పువ్వులోని సుకుమారత్వం
మనసు మాత్రం తెల్లని మంచుముత్యం
కేసరి సూర్యతేజమై వెలగాలి మీ జీవనం
మహిళాదినోత్సవ హోలీ శుభాకాంక్షలు....

జరిగేనా???


పడతిలో పడుచుతనాన్ని చూస్తున్నారు!
తెరచిన కళ్ళలో స్వప్నమై రమ్మంటున్నారు!
ఒంటరినైన నన్ను ఎవరో వెంటాడుతున్నారు!
కపటమెరుగని కంటికి లోకాన్ని చూపుతున్నారు!
వెనుతిరిగిన నన్ను విజయోస్తని ఊరడిస్తున్నారు!

నిలువుటద్దంలోనైనా పాత ప్రతిబింబాన్ని ఎలాచూపను?
గాయమైన మనసుకి గాట్లు ఇంకెన్ని నేను పెట్టను?
అమావాస్య నాటి రేయిలో వెన్నెల్లో విందేమివ్వను?
వెనుభాగమేసిన చిత్రానికి ముఖకవళికలు ఏమద్దను?
గుండెభారమైన వేళ యుగళగీతం ఎలా ఆలపించను?

నీ తపన!

పువ్వుపై వాలాలన్న ఈ తపన....
ఇది నీలో చెలరేగిన వింతైన ఆలోచన
తెలియదు ఆ మదికి నీదైన ఈ ఆలాపన!

పంచరంగులపై నీకేల యోచన....
అది తెలుపుపై సూర్యకిరణాల పరివర్తన
ఆకర్షణలకు బానిసవై చెందకు ఆవేదన!

నీకే సొంతం కావాలన్న భావన....
వాలితేనే వడలివంగిపోయే పువ్వుపైన
ఎందుకీ చెంచలమైన వాంచల జడివాన!

"ప్రేమించుకుందాం రా"

ప్రియమైన మిక్కీ మామ.... మినీ రాస్తున్నది ఏమిటంటే!!!
( అందరూ SMSలు, Mailలు చేస్తుంటే నీకిదేం మాయరోగం అనమాకు మామ )
మనం ఎంత ఇంగ్లీషోల్లమైనా మన వాలంటైన్ డే ని తెలుగులో చేసుకోవాలని బహు ముచ్చటగుంది.
అందుకే నువ్వు ఏడో తేదీన గులాబీని పంపిన రోజునుండి థింకింగ్.....థింకింగ్....థింకింగ్,
ఇంక ధైర్యం చేసి ఈరోజు రాసేస్తున్నా , ఈ రెండు రోజులు నువ్వు ఎలాగో తిట్టవు,
తిట్టినా ఎలాగో ప్రేమనంతా ఒలకబోస్తావన్న ధీమా....
ఇంకెందుకు ఆలస్యం???
"ప్రేమించుకుందాం రా".....
వాలంటైన్ వీక్ ( ప్రేమికుల వారం ) అంటే ఈ ఒక్క వారం ప్రేమించమని కాదు మామ....
ఇలా ప్రేమించడం మొదలు పెట్టిన కలసిన దగ్గరనుండి కడవరకు ఎన్ని వారాలు ఉన్నాయో
అన్ని వారాలు ఇది ఫాలో అవ్వమనీ ( మధ్య ఇంగ్లీష్ ఎందుకు అంటావా? ఎంతైనా ఇది ఇంగ్లీష్ పండగ కదా మామ అందుకే ఒగ్గెయ్! )
ఇంక మాటర్ లోకి వస్తే....ఇంక నీకు తెలుసు కదా మామ నా వీక్ పాయింట్ ప్రాసని కవితని చెప్పి తవికలు రాసి నిన్ను తికమక పెడతాను, ఇంకో మాట మామ...... ఇంగ్లీషును తెలుగులోకి మార్చేటప్పుడు పదాలు దొరక్కపోతే కూడా క్షమించెయ్!!!! ప్లీజ్...ప్లీజ్.....ప్లీజో ప్లీజ్!!!
అయినా నా మీద లవ్ తో నువ్వు కాదనవనుకో........
కాచుకో మరీ!!!:-) :-) :-)

7 ఫిబ్రవరి...
రోజ్ డే/ గులాబీ రోజు
అందమైన గులాబి పువ్వు
ప్రేమతో అందించు నువ్వు
విసిరింది ఆమె చిరు నవ్వు
గాలిలో తేలిపోయావు నువ్వు!











8 ఫిబ్రవరి...

ప్రపోసింగ్ డే/ప్రతిపాదన రోజు
గొప్పలు నీగురించి చెప్పెయ్
తనేమన్నా నువ్వు వినేసెయ్
ప్రేమిస్తున్నా అని చెప్పేసెయ్
కలలకు అంకురార్పణ చేసెయ!











9 ఫిబ్రవరి...

చాక్లెట్ డే/మిఠాయి రోజు
స్వీట్స్ & చాక్లెట్స్ తినిపించు
తీయదనాన్ని ఆస్వాదించు
నీలోని ప్రేమను తనకి పంచు
జీవితాన్ని అందంగా ఊహించు!












10 ఫిబ్రవరి...

టెడ్డీ డే/బహుమతుల రోజు
టెడ్డీని బహుమానంగా ఇచ్చిచూడు
అందులో ఉన్నది నీవేనని చెప్పిచూడు
హృదయానికెలా హత్తుకుందో చూడు
ఇరువురూ ఒకరికి ఒకరు ఈడు-జోడు!











11 ఫిబ్రవరి...

ప్రామిసింగ్ డే/ బాసచేసుకునే రోజు
చేతిలోన చెయ్యేసి ఒట్టు వేసుకో
తనని వదలి పోనని బాస చేసుకో
నీలోని భావాలని తనతో పంచుకో
భవిష్యత్తును నీకణువుగా మలచుకో!











12 ఫిబ్రవరి...
కిస్ డే/ముద్దు రోజు
ముద్దుముచ్చట్లలో ముందు ముద్దు
దీనికి ఉంటేనే బాగుంటుంది సరిహద్దు
అప్పుడప్పుడు చిలిపిచేష్టలు అదో ముద్దు
మితిమీరి ఇరువురూ దాటకండి హద్దు!











13 ఫిబ్రవరి...

హగ్ డే/ కౌగిలింత రోజు
భావోధ్రేకాల సమ్మేళనం కౌగిలి
మదిని చేస్తుంది ఇది చక్కిలిగిలి
మనసుదోచిన వాడి కౌగిలిలో చెలి
అది చూసి కొంటెగా నవ్వింది జాబిలి!











14 ఫిబ్రవరి...

వాలంటైన్ డే/ప్రేమికులరోజు
ఈరోజేనంట వాలంటైన్ డే
ప్రేమించే మనసుంటే 365 డే
ప్రతిరోజు మనకి ప్రేమికుల డే
హ్యాపీ హ్యాపీగా వాలంటైన్ డే!













తలపెందుకని?

సూటిగా అడిగాను మనసుని
ఈ ఒంటరితనం నాకెందుకని?
మనసు బదులు చెప్పలేనని
నిన్ను తలచింది ఎందుకని?

శ్వాసలేనిదే నేను లేనని
తెలిసి శ్వాసలో నీవెందుకని?
ఊపిరిని బిగపట్టాను ఆగమని
తన్నుకొచ్చింది నీతలపు ఎందుకని?

నీ తలపుల లేత కలువలని
మనఃసరోవరంలో విసిరావెందుకని?
తలపుల తడి ఆరనే లేదని
తెలిసినా దాహం తీరదు ఎందుకని?

నిన్ను మరచి పోవాలని
వేడుకుంటున్నా నిన్నేందుకని?
తలచినాను నిన్ను మరచితినని
కానీ మరింత దగ్గరైనావు ఎందుకని?