ఆలుగడ్డ (బంగాళాదుంప) ఒకరోజు బెండకాయకి ఫోన్ చేసి "ఐ లవ్ యు" అంది.
ఇది విని బెరుకులేని బెండకాయ....అబ్బో! నీకు అంత సీన్ లేదు, ఒక ఫిగర్ లేదు, బండలా గుండ్రంగా ఉంటావు. అందరికీ అందుబాటులో దొరికే చౌకరకం నీవు. నీకు నాలాంటి నాజూకుదే కావాల్సి వచ్చిందా అంటూ చెడామడా తిట్టేసింది.
ఆలుగడ్డ అహం దెబ్బతిని, మనసు గట్టిచేసుకుని మెత్తని మాటలతో కనబడిన కూరగాయని పలకరించి మచ్చిక చేసుకుని కలిసి మెలగసాగింది.
దీని పర్యవసానమేంటో ప్రస్తుతం మనం కలిపి వండుకుని తింటున్న కూరల కాంబినేషన్ చూస్తే తెలుస్తుంది.
ఇవి కొన్ని:-
ఆలు-కాలీప్లవర్
ఆలు-మటర్(బఠాణీ)
ఆలు-మెంతికూర
ఆలు-వంకాయ
ఆలు- టమాటా
ఆలు-పాలకూర
ఇలా ఆలుగడ్డ కూరగాలన్నింటికీ చేదోడుగా కలిసి తల్లో నాలుకలా మెలుగుతూ ఆలు లేని ఆహారం అంధకారం అన్నట్లుగా పేరు తెచ్చుకుంది.
బెండకాయ సంగతి ఏంటి అని మీరు అడగక పోయినా విషయాన్ని పూర్తిగా చెప్పాలి కనుక చెబుతున్నాను....ఏముంది నాజుకు నయగారం కూరగారాల బెండకాయ ఏది కలిసినా జిగురు అంటి...ఛీ ఛీ అంటూ చీదరించుకునేలా మారి ఒంటిగానే మిగిలిపోయింది....ఇదీ సంగతి! :-)
మరి నీతి సంగతి :-).....వద్దు...వద్దు ...వద్దంటారా!
వద్దనుకునే వాళ్ళు చదవకండి....ప్లీజ్ ప్లీజ్!
బెండకాయ నీతి:-
1. ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి
2. అందముందని అహంకారానికి పోరాదు.
ఆలుగడ్డ నీతి :-
1. నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది.


