కిలకిలారావం.

నెమలి కాళ్ళకే గజ్జలు కట్టి నాట్యమే నేర్పాలని
నేర్చిన భంగిమలనే వయ్యారంగా చేసి చూపితే
బ్రతుకుబాటలో నర్తించక చూసి అడుగేయమంది!

కోయిల గొంతుకే గాననిధిని బహూకరించాలని
సరిగమలనే సాధన చేసి శృతిలయలతో పాడితే
జీవనపయనంలో శృతితప్పినా గతి తప్పవద్దంది! 

హంసకి పాలునీళ్ళని వేరుచేసే విద్యనొసగాలని
నైపుణ్యమంతా రంగరించి నాణ్యతనే తెలుపబోతే
మనుషుల్లో మంచిచెడులెంచి  మసులుకోమంది!

కోడిపుంజు తురాయినే మెలిపెట్టి తెల్లవారిందని
చెప్పి, నిదురలేపి బధ్ధకం వీడమని భయపెడితే
ప్రణాలికలు పద్ధతులు ప్రజలకే తప్ప పక్షులకేలంది!

చిలుక ఎరుగని పంచదార పలుకులే చెప్పాలని
నోటికి వచ్చిరాని మాటలన్నీ వక్కాణించి పలికితే
మనిషికి వరం మాటలే ఆచితూచి మాట్లాడమంది!

పావురాలు ఎరుగని ప్రేమపాఠాలు వివరించాలని
ఆరిందానై అనురాగబంధాల గురించి చెప్పబోతే
నేటి లోకం తీరుతెన్నులు తెలుపుతూ ప్రేమేలేదంది!

చూపొకటే


నా కళ్ళు నిన్ను చూసినంతనే..
కలలకి ప్రతిరూపమే కనపడింది!

సరిహద్దులు దాటిన ఆనందమే..
శ్వాసను సువాసనతో నింపింది! 

అలలే మైమరచి తెమ్మెరై ఎగసే..
వాలుజడ నల్లనికురులే విప్పింది!

ఆగలేనన్న జవ్వని యవ్వనమే..
కౌగిలిలో ఒదిగిపోయి మురిసింది!
 సిగ్గుతో గుండె చెప్పలేని ఊసులే..
సడిచేయని కంటిభాషగా మారింది!

నింగి సంబరంతో నేలనే తడిమేసె..
ఇరువురొకటై సాక్ష్యం చెబుతామంది!

చేతులే కలిసి మనసులు బాసచేసె...
రెండుకళ్ళే అయినా చూపొకటేనంది!

అంతిమతీర్పు...


అవసరాలు తీర్చుకోవడానికి ఆసరా ఏమో!
అబద్ధపు స్నేహం అత్యవసరమని అన్నావు..

అనవసరం అని చెప్పే ధైర్యము లేక ఏమో!
ఆవేశాన్నే అణచివేసానని అలుగుతున్నావు..

అనునయించడం నీకసలు చేతకాకనో ఏమో!
అనురాగమని అక్కడక్కడా తాకుతున్నావు..

అధముడివైనావు నీకదేమి జాడ్యమో ఏమో!
అణువణువూ కొవ్వెక్కి ఆబగా చూస్తున్నావు..

అందిన అందమే జుర్రుకుని అలసినావో ఏమో!
ఆశ్రయించి అరచి గోల ఏలని అణచివేసినావు..

అబలకి దక్కిన వరం శాపంగా మారెను ఏమో!
అబాసుపాలైనావని అంతిమతీర్పు ఇచ్చినావు..

చావుగడియ

ఆత్మలన్నీ ఏకమై అనందంగా నర్తించమంటూ
ఆశలనే అణచివేయమంటూ అర్తనాదమేచేస్తూ
తీరనికోరికలు ఎందుకే నీకు కొరివిదెయ్యమంటే
తీరికేలేదని తెగ నీలిగి తిట్టుకున్నాను అప్పుడు!


 
జీవిత అంతరార్థమే భోధపడినాక బోరుమంటూ
జీవంలేని నికార్సైన నిండుచీకటినే నే ప్రేమిస్తూ
పిశాచాలనే పీడకలలో పండువెన్నెలై రమ్మంటే
పిచ్చని ప్రేతాత్మలే పగలబడి నవ్వాయి ఇప్పుడు!


సమస్త బంధాల్ని కాల్చి బూడిదచేసి వీడ్కోలంటూ
సమాధిలోపల స్వఛ్ఛమైన మనసునే పూడుస్తూ
గంపెడు ఆశతో చావునే చెలికాడుగా మారమంటే
గడియవస్తే గొంతు నులుముతాననె అది ఎప్పుడు!



రా...

బూటకపు ఎత్తుగడల పొగమంచు శిఖరాన్ని తాకి రా

మది వైశాల్యాన్ని కొలవాలంటే తలదించి కొలుచుకో రా

తప్పొప్పుల ఆటుపోట్లలో ఒప్పుల్ని మచ్చిక చేసుకుని రా

వెన్నెలే కాదు సూర్యకాంతికి మాడి మసి పూసుకుని రా

వీధినేం వెలగబెడతావు ఇంట్లో దీపం ఉందో లేదో చూసి రా

ఆనంద అలలతీరం తాకాలి అంటే కష్టాల కడలిని దాటి రా

పసిడిరధం పేదవాని గుడిసెచేరదు నడిచి లోపలికివెళ్ళి రా

నిచ్చెనెక్కే ప్రయత్నమేం చేయకనే నింగిని నింధించకు రా

ఎదుటివాడ్ని ఎత్తిచూపాలంటే నిన్నునీవు తెలుసుకుని రా

అన్నీ తెలిసి కూడా ఏమీ చేయలేని వాడు చేతకాని వాడే రా!



నమ్మకం

నా మనసుని మళ్ళీ మళ్ళీ
తూట్లు చేస్తూనే ఉంటావు
నేను నవ్వుతూ నవ్విస్తూ
పెదవులకి కుట్లు వేస్తుంటాను.


నా దారిలో అడుగడుగునా
నీవు వదిలి వెళ్ళిపోతుంటావు
నేను స్నేహ హస్తం అందిస్తూ
హితుల జాబితాలో జోడిస్తుంటాను.


నాది నాదన్న స్వార్థంతో
అబధ్ధాన్ని ఆసరా కోరుతుంటావు
నేను మాత్రం నిజమని నమ్మేస్తూ
ఆశల వంతెననే నిర్మిస్తుంటాను.


నా నిర్మల మదిని తిట్టుకుంటూ
నిన్ను నీవు మెచ్చుకుని మురుస్తావు
నేను నీలోని మంచితనాన్ని చూస్తూ
కానరాకపోయినా ఉందనే నమ్ముతాను.

మార్పు

జీవితం దిశమార్చిందే కాని నేను కాదు మారింది
నిన్నలా నేడు అస్తమిస్తున్నా సంధ్యవేళతోపాటుగా
కాలం మారిందన్న ఆత్మవంచన చీకట్లో రంగుమార్చి
చంద్రుడిలోని బూటకపు నల్లని మచ్చ పెరుగుతుంది!

హింసలో మరిగెడి వెన్నెల వేడిరక్తపు స్నానమంటూ
పనికిరాని ఆవేశపు మాటలు వల్లెవేస్తూ నిద్రపోయింది
ఆశా ఉషోదయ కిరణాలు నిగ్రహమనే గోడపై నిటారుగా
దురాశచేసే అనాలోచిత కుయెత్తులనో చూపుచూస్తుంది!

నేను మాత్రం దశతిరిగిందని ఆనందానుభూతిని పొంది
మానవభూతమే మహనీయుడిగా మారెనని ఈలవేసేసి
సగం మారినా సరే మనిషి స్వఛ్ఛదవళమని నమ్మబోతే
నపుంసకతనరం వలలో చిక్కినా నరుమారడని నవ్వింది!

రాయి కరిగి శిల్పమైతే పాషాణమే తరిగి నెచ్చెలౌతుంది
మారాలన్న సంకల్పం ముందు నవ్విన నాపచేనే పండి
వంగి మానవత్వానికి సలాములే చేసి గులాము అంటే
మనుగడే ప్రకాశవంతమై జీవితం స్పటికమై మెరుస్తుంది!

నేను నేనే


నేనో కలని, కవ్వించి ప్రేమించకు
ప్రేమిస్తే పలకరించి ప్రస్తావించకు
ప్రణయవీచికలు వచ్చి పోతాయి
నిశ్చలం అని చెప్పి నమ్మించకు!

నేనో పువ్వుని, మురిసి తృంచకు
తృంచి హారమని నీవు ధరించకు
పరిమళంలేని పూలు వాడతాయి
కాగితం పువ్వేనని విసిరివేయకు!

నేనో జ్వాలని, వింజామరై వీయకు
వీచి వలపుసెగలు రేపి జ్వలించకు
రగులుతున్న కోర్కెలని ఆర్పివేయి
నివురుగప్పిన నిప్పును రాజేయకు!


నేనో కన్నీటిని, జాలిపడి తుడవకు
తుడిచి పవిత్రతను పొందాలనుకోకు
పాపపుణ్యాలు పకపకా నవ్వుతాయి
స్వచ్ఛమైన ఆరాధానని ప్రేమనుకోకు!

నేనో తెల్లకాగితాన్ని, పిచ్చిగా రాయకు
రాసి నిఘంటువులో అర్థాలు వెతుకకు
మసిబారిన మనసుకి సున్నం పూయి
నీ నిర్లజ్జ వైఖరిని వేరొకరి పై నెట్టేయకు!

ఏది ఏమిటో!


అక్షరాలకీ ఆలోచలకీ లింకు దొరక్క లంగరువేసి
అంతరంగాన్ని అదిమేసి సంబరమే చేసుకోబోతే
పదానికీ పద్యానికీ వ్యత్యాసమడిగితే ఏంచెప్పేది?
అక్షరాలనే అందంగా అమర్చి పదమని పలకనా
పదాల సమూహాన్నే మాటల మూటలని చెప్పేసి
మదిమాటల్ని పదిలంగా పోగుచేసి పద్యమననా!!

ఊహలకీ ఉధ్వేగాలకీ పొత్తు కుదరదని వదిలివేసి
మంచీ చెడని మనసునే మధించి మచ్చిక కోరితే
బంధమే పెనవేసి మదిని బంధించబోతే ఏంచేసేది?
పైకి కనబడేది శిల్పమైనా లోన కరిగేది వెన్నకాదా
కలనైనా చెప్పలేని ఊసుల రంగుల చిత్రమే గీసేసి
భావాలకే అక్షర రూపమిచ్చి కవిత్వమంటే కాదా!!

ఆశలకీ ఆశయాలకీ సాంగత్యమే లేక సంకెళ్ళువేసి
బ్రతుకున సంకల్పమే లేదని సంఘర్షణే చేయబోతే
నీట ప్రతిబింబమే చూపి నింగినని పొగడ ఏంకోరేది?
సరదాగా తాకి సాన్నిత్యమే చూపితే స్నేహమననా
కలిసి చెలిమని చేతులు నలుపుతూ కబుర్లే చెప్పేసి
వ్యంగ్యంగా వరుసలే కలిపేసి రాస్తే సాహిత్యమగునా!


(బ్లాగ్ లో 400 పోస్ట్లని రాసి మీ అభిమానాన్ని పొందాలని నేను చేసిన ప్రయత్నంలో మీరు ఇబ్బంది పడి నన్ను సంబరపెట్టిన మీ అందరికీ అంజలి ఘటిస్తూ పద్మ అర్పిస్తున్న చిరు చందన కుసుమాలే ఈ వందనాలు_/\_ _/\__/\_ )