నా అవగాహనే ఏదో అంతంత మాత్రం
మనఃస్థితినిబట్టి అదీ మారుతుంటుంది
ప్రశ్నించినప్పుడు జవాబు చెప్పకుండా
జవాబు దొరికినప్పుడు ప్రశ్నిస్తుంటుంది!
నిన్ను నీవు నిజాయితీగా ప్రశ్నించుకో
సమాధానం నీలోనే దాగుంటుంది అంది
మనఃసాక్షికి జవాబు చెప్పడం కష్టమని
ఎవరికి వారే శోధించి సాధించాలంటుంది!
చెప్పమంటూ ఒత్తిడిచేసి ప్రశ్నిస్తే మాత్రం
మూతిముడిచి అలిగి దూరమైపోతుంది
బ్రతిమిలాడి బుజ్జగించితే చెబుతానంటూ
తానుచెప్పే సత్యాలు నేనొల్లను అంటుంది!
తెలియని ప్రక్రియని ధ్యానంతో సాధించుకో
తెలిసిన తరువాత సరిదిద్దుకోమని చెప్పింది
అంతర్గత సంఘర్షణల పై పట్టు విడువబోకని
పరిష్కరించలేని సమస్య సమస్యే కాదనంది!





