కలానికి వేవిళ్ళు


ఊహలతో ఊసులే చెప్పి వలచేవట
అందుకే నిన్ను వేదనే వరించానంది
ఉబుసుపోక వేసే వేషాలని వదిలేవా
వయసు మారాంచేస్తూ విరబూస్తుంది!

కోరికలే గుర్రాలై ఉరకలేయబోయెనట
అందుకే ఆశయమే కాలుజారిపడింది
ముక్కలైన మనసు అతికించబోతివా
మరపు లేపనమై గతం జ్ఞాపికౌతుంది!

బ్రతుకు ఆశతో ఏడడుగులు వేసెనట
అందుకే నిరీక్షణయే కౌగిలి కావాలంది
తమకానికి తలపుల్ని కాపలా పెడితివా
రెప్పలమాటున భావమై మిగిలిపోతుంది!

భావాలు కలలతో కాపురం చేసెనంట
అందుకే కామోసు కలమే కక్కుకుంది
కలాన్ని సిరా వేవిళ్ళంటూ వెక్కిరించబోవ
కవితలే పుట్టునని కాలం కబురుపంపింది!



అస్థిర జీవం

తటస్థంగా ఉండలేనన్న అసంతృప్తి ఆత్మను అనలేక
నిరాశ ఆమ్లక్షారాలని గొంతులో పోసుకుని గోలచేస్తూ
కళ్ళనే చెమ్మచేసె, ఆవేదనపు సాంద్రతను తెలుపలేక
మస్తిష్కమే వేదనతో పొంగ, మోమేమో ముసురుపట్టె!

రంగులేని వర్ణం లోలోన చిగురాశ స్పటికంగా జనించి
కనిష్టమైన కోర్కెలు గరిష్టమై జ్ఞాపకాల పరిభ్రమణంలో
ఆటపాటలకి దూరంగా ఆవేశపు ఆలోచనలలో అలసి
పాలపుంతలాంటి శరీరం అగ్నిగోళమై భగభగా మండె!

వెలుగు చూడలేని హృదయ దర్పణం పారదర్శకమై
కాలానికి వ్రేలాడదీయబడ్డ నిర్లిప్తత ఆశలవైపు చూడ,
ఒంటరితనంతో స్నేహం చేయనన్న జీవితం డోలకమై
బ్రతుక్కీ చావుకీ మధ్య ఊగిసలాడే యంత్రంగా మారె!!!

జలపాతమంటి జోరు..

కుదురుగా కూర్చుంటే చూసి కుర్తాలం జలపాతమని
కూనీరాగం తీస్తూ కల్లబొల్లి కబుర్లు ఎన్నో చెప్పబోతివి

తడి తనువు చూసి తబ్బిబై తలకోన జలపాతమని
మాడిపోయిన మోముని మంచుశిఖరంతో పోల్చితివి

నడిరేతిరి నడుముచూసి నయాగరా జలపాతమని
మనసు చూడకనే మహాలోతైన సముద్రం అంటివి

కారుచీకటిలో కురులు చూసి కుంట్ల జలపాతమని
కళ్ళకాటుకని మనసుకి పూసి మాయచేసి పోతివి

ఏవంకనో ఎక్కడెక్కడో చూసి ఎత్తిపోతల జలపాతమని
ఎదను దోచకనే ఏదో కావాలంటూ ఇంకేదో అడగబోతివి

జారినపైట చూసి జోరుగా ఈలవేసి జోగ్ జలపాతమని
తాళి కట్టినాకనే సరసమంటే జామురేతిరి జారుకుంటివి



నీదినాది


రాయలసీమ రాటుతనమేమో నీది
కోనసీమ కోమలత్వం అంతా నాది..
ఛల్ మోహనరంగా...జోడు కుదిరింది!


మొగలిపొదల మొరటుతనం నీది
బొండుమల్లెపూల పరిమళమే నాది..
పద పదరా...పండువెన్నెలే రమ్మంది!


గట్టి గడ్డపెరుగులాంటి కఠినత్వం నీది
పాల పొంగులాంటి పరువమేమో నాది..
కలసి తోడుకడదాం...ఈడు పిలుస్తుంది!


అంబరాన్ని తాకాలన్న ఆవేశమే నీది
అగాధాన్ని చూడరాదన్న ఆలోచనే నాది..

ఆచి తూచి అడుగేద్దాం..ఆనందమే నీదినాది!

తెల్లకాగితం

ఈ మనసే ఒక తెల్లని కాగితం...
దానిపై ఏం వ్రాయకనే వదిలేయ్
ఏ వ్యధలు, వేదనలు వ్రాయొద్దు
ఎటువంటి పిర్యాదులు, పితూరీలొద్దు!

ఏవో గుర్తులు, పాత విషయాలు...
ప్రేమ పలుకులు, గడిచిన రాత్రులు
దగ్గర దూరమని అనుభూతులు వ్రాసి
ఊపిరి పోస్తున్నానంటూ ఊపిరితీయొద్దు!

గుండె సవ్వడులను ప్రశ్నించవద్దు...
వేగంగానో నిదానంగానో కొట్టుకోనీయ్
నేడు వ్రాసిన రాతలు రేపటికి జ్ఞాపకాలని
అందమైన చెరుపలేని అక్షరాలని చెప్పొద్దు!

మది తేలికంటూ మరక చేయొద్దు...
నాలుగరల్లో ఏ మూలో ఆడే శ్వాసల్ని
పదధూళిలో ఊపిరాడనీయక బంధించొద్దు
ఇది ఒక తెల్లకాగితం దానిపై ఏం లిఖించొద్దు!

ప్రయత్నించు

 ప్రయత్నించు, ప్రయత్నిస్తూనే ఉండు..
ఊపిరి ఉన్నంత వరకూ ప్రయత్నించు
ఓడిపోక, ఆగిపోక అలసట అన్నదే లేక
ఆశ తీరేదాక గెలుపు కోసం ప్రయత్నించు!

విశ్వాసాన్ని విరిచేసే కష్టాలు ఎదురైనా..
ఇబ్బందులన్నీ ఏకమై ధైర్యాన్ని వెలివేసి
జీవితానికే విశ్రాంతని రెచ్చగొట్టినా, బెదరక
తుదిశ్వాస వరకూ గమ్యానికై ప్రయత్నించు!

నిబ్బరాన్ని నీలో నిండుగా నింపుకుని..
ఎందరో మహానుభావులను తలచి కొలచి
స్వార్థం వీడి, పేరు ప్రతిష్టల కొరకు ఆశించక
ప్రాణం పోయే వరకూ తప్పక ప్రయత్నించు!

దారిలో విఛ్ఛిన్నం చేసే విభేధాలని వీడి..
గాఢనిద్ర నుండి మేల్కొని, బద్ధకాన్ని బలిచ్చి
సంఘర్షణలని గెలిచి, ఆకర్షణలకి అంతుచిక్కక
అపజయంలోని జయం దక్కేలా ప్రయత్నించు!

మారిపోయాయి



మేఘం నేలని తాకి రూపం మార్చింది
నీరెండకు నీడ కూడా రూపుమార్చింది
అద్దంలో చూసుకుంటే మోమే మారింది
చూస్తుండగానే అన్నీ మారిపోయాయి!!


వాధించలేనన్న మనసు మారిపోయింది
ప్రశ్నించుకుంటే జీవితమే మారిపోయింది
ఊహలనే వలచిన నిద్ర నడిరేతిరి పట్టింది
కునుకు పట్టగానే కలలే మారిపోయాయి!!


బంధీ అయిన ఆశేమో ఆకారం మార్చింది
అనుగుణంగా కాలం వేషాన్ని మార్చింది
గెలుపు స్థితి పై అలిగి, ఓటమిగా మారింది
సంతోషమే కన్నీళ్ళుగా మారిపోయాయి!!


సర్దుబాటు కాలేక సమస్యే మారిపోయింది
గమ్యం దరికి చేరబోవ దారి మారిపోయింది
అలవాటుపడ్డ జీవితం చివరికి రాజీ పడింది
అలసిన అనుభవాలు ముడతలై మిగిలాయి!!

అసాధ్యం!


  నీకు దూరమై నిన్ను మరువడం.....
నా మనసు నీవు అర్థం చేసుకోవడం
సులభం అనుకున్నా, కానది అసాధ్యం!


అనాదిగా ప్రేమ అన్నదే ఒక పెద్ద నేరం
ప్రపంచాన్ని ఎదిరించి నిన్ను పొందడం
సాధ్యం అనుకున్నా, కానది అసాధ్యం!


ప్రేమ గుడ్డిది అన్న లోకంలో జీవించడం
అంధుల మధ్య అంధురాలిగా బ్రతకడం
సులభం అనుకున్నా, కానది అసాధ్యం!


ఎంతకాలమని ఈ ఎదురీతలో పోరాటం
ఓడిపోయిన నన్నే మళ్ళీ ఓడిపోమనడం
సాధ్యం అనుకున్నా, కానది అసాధ్యం!


మనిద్దరి నడుమ దూరాన్ని తగ్గించడం
ఏర్పడ్డ వలపు గోడల్ని కూల్చివేయడం
సులభం అనుకున్నా, కానది అసాధ్యం!

కావాలి!

పగటిపలక పై దిద్దిన ఆశల అక్షరాలని
చీకట్లో తనివితీరగా తలచుకుని రోధించి
రాసుకోవడానికి కొన్ని రాత్రులు కావాలి!

పెనుగాలికి ఎగిరిపోయిన కోర్కెల రెక్కల్ని
ఏరి తీసుకొచ్చి అందంగా పేర్చి బ్రతకమని
బరోసా ఇచ్చే మృదువైన చేతులు కావాలి!

బురదలో దొర్లి పొర్లే ఆలోచనలని వడపోసి
మట్టికొట్టుకొని పోయిన మనసులను కడిగి
హత్తుకుని ముద్దాడే మనిషి తోడు కావాలి!

వానకురిసి రాలి నలిగిన జ్ఞాపకాల పూలని
పాడు పరిమళం అంటించుకోక కుప్ప చేసి
ఎత్తేసి శుభ్రపరిచే నిశ్చల నైపుణ్యం కావాలి!

నీరెండలాటి మాటలకు వ్యధల కన్నీరే ఎండి
ఆర్ద్రత తొణికిసలాడే అమృత స్పర్శగా మారి
మరో కొత్త జీవితానికి ఈ ఆశే ఊపిరి కావాలి!