"మినరల్ వాటర్"

కార్తీకమాస వనభోజనాలంటూ అతిరథమహారధులంతా బ్రహ్మాండంగా రుచికరమైన వంటలతో అధరగొట్టేస్తుంటే నేను మాత్రం చదివి ఆహా! ఓహో! అంటే ఏం బాగుంటుంది చెప్పండి???
ఇలా అనడం సులువే కాని ఏంచేయాలో తెలియడం లేదు!!!!
పోనీ ఏమైనా వండేదామా అంటే అది చేయడమే ఒక సాహాసం అనుకుంటే .....జ్యోతిగారు చాన్స్ ఇస్తేగా, షడ్రుచులతో వడ్డించాక ఇంకేం మిగిలిందని???? దానికి తోడు యజమానిచేతితో చేసిన టమాటాపచ్చడి అడిష్నల్ అట్రాక్షన్.... ఫోటోనే యమరంజుగా ఉందికదా! దాన్ని ఇన్స్ఫిరేషన్ గా తీసుకుని పచ్చడిని ప్రెజెంట్ చేద్దాం అనుకుంటే.... మాలాకుమార్ గారు కంది పచ్చడితోనే అందరి కడుపులూ నింపేసారు, జయగారు ముందుగానే డబ్బాలు డబ్బాలు మోసుకొచ్చి ముందుంచారు, మధురవాణీగారు మాఇంటబ్బాయి వంట అంటూ మరో వెరైటీలో కోడిగుడ్డు పొరటో అట్టో అనిచెప్పి ముందుంచారు. వీటితో పాటు అరిసెలు, లడ్డూలు, బూందీ, కారప్పూస..ఇంకా ఇలాంటివి ఎన్నో...జ్ఞాన ప్రసూన గారి పూర్ణాలు, స్వప్నగారి పాలక్ పన్నీర్, హు...ఇంక నేస్తంగారు సరే సరి....ఉలవచారుతో ఒక ఊపు ఊపేసారు. మంచుగారు మార్చికూర్చి పేరేదైనా పాయసమో పరమాన్నమో కాని స్వీట్ విత్ డ్రై ఫ్రూట్స్ తో పసందుగా అందించారు. కృస్ణప్రియగారు టల్లోస్... అనే పేరుతో పెరుగు వంటకాన్ని డ్డించారు. నెమలికన్ను మురళీగారు నేనేం తీసిపోనంటూ నూడిల్స్ ఇన్ న్యూ స్టైల్ అన్నమాట:).
జేబిగారు తక్కువ తిన్నారా ఏంటి పెసరట్టు+అల్లంపచ్చడితో పాటు కాఫీని కూడా పొద్దున్నే వేడివేడిగా అందించారు. శ్రీలలితగారు ఉసిరి, అనాస ప్రిపరేషన్స్ తో, లతగారు మేతీ చమన్, బ్రెడ్ బాసుందితో, హనుమంతరావుగారు వెరైటీ వంకాయకూరతో రెడీ. రాధిక(నాని)గారు ఆకాకరకాయ కూరతో వచ్చారు. వేణు శ్రీకాంత్ గారు దోసలతో పాటు వెండి పళ్ళాలని...చెంచాలని కూడా అందించారు:) ఇలా ఎన్నెన్నో రకాల రకరకాల వంటలతో వచ్చి వడ్డించిన బ్లాగ్ విస్తరిలో నా వంటకి చోటెలాగో లేదని అయినా ఏదో ఒకటి చేయాలని థింకింగ్....... థింకింగ్......??????

ఐడియా వచ్చిందిగా:):):).....
అన్నీ ఆరగించాక బుక్తాయసంగా ఉందికదండి!!!.....ఇంకెందుకు ఆలస్యం అందుకోండి....
మినరల్ వాటర్ బై మీ... ఓన్లీ సప్లైంగ్ నాట్ ప్రిపేర్డ్:):) (మిగిలింది అదేగా ... ఆలస్యం అయితే అదికూడా ఎవరైనా తెచ్చేస్తారేమో.....)
"అందమైన మట్టి కుండలో
స్వచ్చమైన త్రాగునీరు
అభిమానంతో కలగలిపి
అందిస్తున్నాను... పద్మార్పిత!"
(సరదాకే కాని ఎవరినీ సతాయించాలని కాదని మనవి....
మన్నించండి "మినరల్ వాటర్" ని ఎవరి మనసునైనా నొప్పిస్తే!)

తెలిసిందిలే....

కరిగిన కలలతో కనులు చెమ్మగిల్లాయి
ఆశల ఎడారిలో ఆశ్రువులు రాల్చాయి

జీవించడానికి కావలసినవన్నీ వున్నాయి
మనసుభారమై అవి దూరమౌతున్నాయి

ఆశలసౌధాలు ఆనందాన్ని ఏమిస్తాయి
ఆనందానికి కలలు కైవసం కానన్నాయి

ఒక్కరికై మరొకరి మనుగడ ఆగకున్నాయి
నలుగురిలో నన్నునన్నే వెతుక్కోమన్నాయి

కల్మషంలేని హృదయాలు హాయిగా నవ్వుతాయి
మంచి మాటలు మనిషిలో తప్పక మార్పునిస్తాయి

నాది నాది అన్న పదాలతో పెదవులు దూరమైనాయి
మనం మనది అన్న మాటలతో అధరాలు ఒకటైనాయి

చివరికి మిగిలింది!!

నిన్ను చూడకనే నీ చిత్రాన్ని వేయగలను
నిన్ను కలవకనే నీ మదిని చదవగలను
నీ భాధని నా కంటనీరుగా కురిపించగలను
నిన్ను మరువమని నామదికి ఎలా చెప్పను!

అద్దం నన్ను అదే పనిగా అడిగెను
నా పాత రూపం తనకి కావాలి అనెను
పగిలిన మనసుని అయితే అతికించాను
అతుకుని కనపడనీయకుండా ఎలా దాచను!

నిన్ను మరువని మదిని నేనేమి చేయను
ప్రతి కదలికలో నీవే అయితే నేనేమైపోతాను
కునుకు రాని కంట నేను కలలు ఎలా కనను
కలనైనా నిన్నుగానక నేను ఎలా జీవించను!

భారమైన హృదయాన్ని భాధగా నేచూడలేను
భాధకి బానిసనై నన్నునే ఎలా బంధించుకోను
భాధకి కూడా ప్రేమే మందని నాకు తెలుసును
ఎందుకంటే! ప్రేమిస్తే చివరికి భాధే మిగిలేను!

గమనిక:- భగ్న ప్రేమికులకి మాత్రమే.......

విజయీభవ!

బ్లాగ్మిత్రులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు!

మార్పు...

జీవన విధానమే మారిందో????
ఆలోచనా సరళిలో లోపమే ఉందో!
నేను అడుగులు చిన్నిగా వేసినప్పుడు
లోకం బహుపెద్దగా కనపడిందప్పుడు
బడికి వెళ్ళేదారిలో మిఠాయిల బండి
ఇప్పుడక్కడ వెలసింది ఒక పెద్ద మండి

జీవన విధానమే మారిందో????
ఆలోచనా సరళిలో లోపమే ఉందో!
సంధ్యవేళ ఆటపాటలతో గడచిన బాల్యం
పగలు రాత్రులతో అంతమౌతున్న దినం
ఇంటికి రాగానే చేరేదాన్ని అమ్మఒడి
వారానికి ఒక్కసారైందిప్పుడా ఒరవడి

జీవన విధానమే మారిందో????
ఆలోచనా సరళిలో లోపమే ఉందో!
సావాసంలో పెల్లుబికేది స్నేహమాధుర్యం
ఇప్పుడది 'హాయ్''బాయ్'లకే అంకితం
యాంత్రికంగా మారిన మానవ జీవితాలు
పండుగనాడు అందుకుంటున్నాము సందేశాలు

జీవన విధానమే మారిందో????
ఆలోచనా సరళిలో లోపమే ఉందో!
రేపటి కొరకై ఎవరికీ చింతలేదు
ప్రస్తుతం మన అందుబాటులో లేదు
ఆశలు, ఆశయాలు జీవితంలో భాగమైపోగా...
వాటిని కప్పిపుచ్చి బ్రతికేస్తున్నాము ఎంతో హుందాగా!

ఎందుకిలా...???

మట్టితో చేయబడ్డ మనం నీటమునిగి తేలుతున్నాం...

చావే చివరి మజిలీ అని తెలిసికూడా పయనిస్తున్నాం...

కట్టెలపై కాలే శరీరాన్ని సింగారించి మరీ మురుస్తున్నాం...

వెంటరాదని తెలిసికూడా ధనార్జనకై రేయింబగలు శ్రమిస్తున్నాం...

చెడుకి దరిచేరిన మనం మంచిని మంచువలే కరిగిస్తున్నాం...

నలుగురిలో రానినవ్వుని పెదవులపై రంగరించుకుని రాణిస్తున్నాం...

కృత్రిమత్వంతో కరుణను సైతం కఠినంగా కాళ్ళరాచేస్తున్నాం...

ప్రతిరోజు పడిలేస్తూ ఎందుకిలా చచ్చి బ్రతికేస్తున్నాం...?????

ఒక కల...

ఒక కల...అధ్భుతమైన చిత్రాన్ని గీయాలని
ఆ చిత్రంలో జీవకళ ఉట్టిపడాలని!!!

ఒక కల...మంచి కవిత వ్రాయాలని
నా భావాలన్నీ అందులో పొందుపరచాలని!!!

ఒక కల...మధురమైన గేయం రచించాలని
ఆ పాటతో అందరూ పరవశించిపోవాలని!!!

ఒక కల...ఎంతో ఉన్నతంగా జీవించాలని
నా జీవితం అందరికీ ఆదర్శం కావాలని!!!

ఒక కల... అజ్ఞాతంగా అంతమైపోవాలని
అంతమై అందరిలో జీవించాలని!!!

వినాయకుడికి దండాలు!

అమ్మచేతితో మలచబడ్డ అద్వితీయుడు

పదునాలుగు భువనాలకు పరమాప్తుడు

మనందరి మ్రొక్కులలో ముందుంటాడు

విఘ్నాలను తొలగించే వినాయకుడు

కొలచిన ప్రతిమదిలో కొలువుండేవాడు

కలిమిని బలిమిని కలిగించువాడు

శక్తిని యుక్తిగా చూపే స్కందాగ్రజుడు

యఙ్జాలపతిగా నిలచే యశస్కందరుడు

సర్వజనులను రక్షించే సర్వరాయుడు

స్వీట్స్ ప్రపోసల్కి హాట్ ఆన్సర్!

ఓయ్...కుర్రాడా!
నువ్వే నా ఆవడా
నీ దొంగ లుక్స్...
వేడి వేడి ఆలుచిప్స్!
నీ హెయిర్ స్టైల్...
విడివడిన మాగీనూడిల్!
నీ రెండు నయనాలు...
గుర్తొస్తున్నాయి చిట్టిచెకోడీలు!
నీ మీసకట్టు...
మాడిన పెసరట్టు!
మొటిమలతో నీ చెంపలు...
తలపిస్తున్నాయి శెనగపప్పుచెక్కలు!
నీలో ఏముందో నాకు తెలియకుంది...
అయినా నువ్వే నాకిష్టమైన కారప్బూంది!
నీపై ఆలోచనలు సన్నకారప్పూస...
నీ మనసు మాత్రం వెన్నపూస!
నచ్చింది నాపై నీకున్న ఆశ...
అది కమ్మని మసాలాదోశ!
సై అంటున్నాను నీ స్వీట్స్ ప్రపోసల్ కోయ్...
తిందాం చిన్ని ఉల్లి సమోసాలు పదవోయ్!:)