ఏదో చేయమాకు

నా మదిలోని భావాలను లూటీ చేసేసి
మౌనమనే లాటీతో కొట్టి లాలించమాకు
నాపై నీ భావాలని మనసులోనే దాచేసి
మాయమాటలతో మదిని మభ్యపెట్టకు!

నా గుండెసడికి నీ గుండెలయ శృతిచేసి
ఆశలే రేపి ప్రణయమని రాగాలు తీయకు
మనసిచ్చానన్న మిడిసిపాటుతో చిందేసి
తనువునే కోరి తైతక్కలాడి అలుసైపోకు!

నా మనసుని నీ అనురాగంతో పెనవేసి
ఒక పోగు నీవు మరొకటి నేనని వేరవకు
ప్రేమతో ఆడిన దాగుడుమూతల్లో అలసి
సొమ్మసిల్లినాక తనువులు వేరని అనకు!

నా చెలిమి నీ ఎదలోయలో ప్రవహింపజేసి
వలపునదై పొంగి పొర్లిపోతే ఘనీభవించకు
నా మనసు నిన్ను నమ్మినవేళ కాపుకాసి
ప్రేమపై నాకున్న ప్రేమను వమ్ముకానీయకు!

ఏం అడిగేవు!


 ఎగిరిన భ్రమరాన్ని ఏం అడిగేవు
రాలిన పువ్వులోని పుప్పొడేదని!

నుదుటి ముడతల్ని ఏం అడిగేవు
బ్రతుకుబాటలో వంకర్లు ఎందుకని!

వెలుగుతున్న వత్తిని ఏం అడిగేవు
ప్రమిదలోని చమురు ఎంతుందని!

పీలుస్తున్న ఊపిరిని ఏం అడిగేవు
ఎన్నాళ్ళు ఎడతెరపిలేని ప్రక్రియని!

పాతిపెట్టిన శవాన్ని ఏం అడిగేవు
సమాధిలో నిశ్చింత నచ్చిందా అని!




సరసమెరుగని సంసారి

పొద్దుటేల లేచి సద్దికూడు నేను తిని
మినప ఆవిరి కుడుములు ఎందుకని
నా మనసంటి ఇడ్లీలు వేసి వెన్నరాసిస్తే
మాడిన అలసంద అట్టులా ముఖం పెట్టి
పెసరట్టంటే ప్రాణమని ప్రేమగా అడిగావు!
పోనిమ్మని సందేల పెసలు నానబోస్తుంటే
జారిన పైటమాటు దాగిన అందాలు చూసి
సజ్జ కూడు చాలు సరసానికి రమ్మన్నావు!
సిగ్గుపడి సగ్గుబియ్యం జావతో కవ్వించబోతే
జున్నుపాలేవని జావకారి జాలిగా చూసావు!

మరుసటేల మురుమరాల ఉగ్గానీ నే తిని
ఉప్మా చేతికందిస్తే ఉరుమురిమి చూస్తావని
ఉల్లిదోశనే దోరగా కాల్చి ఊరగాయతో అందిస్తే
ఉలిక్కిపడి ఊరడించమాకని మీసం మెలిపెట్టి
రాగిసంకటి ముద్ద ఏదని ముద్దుగా అడిగావు!
రాకపోయినా రాగమే రంగరించి వండబోతుంటే
వేడి పుట్టిస్తున్న వాడిచూపులకి ఒళ్ళు విరిచేసి
మజ్జిగ తాగి మరిగే నీళ్ళ స్నానమాడాలన్నావు!
పొంగే పరువమాపి పొంగడాలో బజ్జీలో వేయబోతే
గారెలేవి గృహలక్ష్మీ అంటూ గారాలు బోతున్నావు!

వింత వ్యసనం

ఎప్పుడు తలపుల్లో తడిమేస్తావు
ఇదే మాయరోగమో ఏమో నీకు
నీకంటూ నివాసమే ఏదీ లేదా!?
నా మదిలోనే నిదురిస్తుంటావు..



నిటారుగా నిలబడ లేక తిరిగేవు
కాళ్ళకి చక్రాలు ఉన్నాయా నీకు
నిబ్బరంలేని నికార్సైన వాడివా!?
నా చుట్టూనే పరిభ్రమిస్తున్నావు..



నిషాలో ఉన్న త్రాగుబోతువి నీవు
కల్తీలేని నాప్రేమ కిక్ ఎక్కింది నీకు
ఈ వ్యసనం నుండి బయటకురా!?
నాశ్వాసలో చేరి మత్తెక్కిస్తున్నావు.

ఓ నా ఆత్మా!

ఆత్మా! ఓ నా ఆరో ప్రాణమా
ఆలోచిస్తూ అడుగులో అడుగేయకు
ఆవహానమని అరిచి అక్కున చేర్చుకో...
ఆలోచనలు కుళ్ళిపోకుండా ఆనందించనీ
ఆవేశమే అణగారి నీలో నన్ను ఏకమైపోనీ
ఆపేక్షలనే పాడు ఆత్మల్ని అసహ్యించుకోనివ్వు
ఆడంబరాల బానిసత్వం నుండి విముక్తి పొందనివ్వు!

ఆత్మా! ఓ నా అంతర్మధనమా
ఆలాపించి అలసినానని ఆగమనకు
ఆదరించి నీవు నా ఊపిరినే పీల్చేసుకో...
ఆశ్రయించిన నన్ను ఆత్మలకే అధినేతనవనీ
ఆడిపాడి నీ లోకంలో అంచెలంచెలుగా ఎదిగిపోనీ
ఆశల ఆకలితో చచ్చిన నాకు అమరత్వాన్నివ్వు
ఆగిపోయిన జీవగుండెకాయ కొట్టుకోకనే బ్రతకనివ్వు!

ఏం తెలుసు!

సర్వసంగపరిత్యాగైన సన్యాసికేం తెలుసు
సరసం తెలిసిన జవ్వని సొగసు ఎక్కడుందో

రాతిగుండె వంటి రాక్షసుడికేం తెలుసు
రసికత ఎరిగిన రాగిణి ఆలాపించే రాగమేదో

వరాలు ఇచ్చి వచ్చిన విటుడికేం తెలుసు
వన్నెలాడి వయసు చేసే వింతవిన్యాసమేదో

మొద్దులా మారిన మొరటోడికేం తెలుసు
మొగ్గై ముడుచుకున్న ముదిత మురిపమేదో

పొగరు పొరగప్పిన పోటుగాడికేం తెలుసు
పొగడపువ్వులా పొదవిన పడతి పరిమళమేదో

దొరవోలెకాక దొంగై దోచుకొనేవాడికేం తెలుసు
దోబూచులాడాలనుకున్న దొరసాని సిగ్గుదొంతరేదో

మాయదారి మగాడి మనుగడకేం తెలుసు
మారామంటున్న మగువ మనసులో మర్మమేదో

నేనూ...పతివ్రతనే!

అడుగడుగునా ఆశలే అణగారిపోయి
అంచెలంచెలుగా ఆశయాలే కూలిపోతే
అడ్డుకున్న వారినే అక్కున చేర్చుకుని
ఆహా! ఓహో అన్న నేనూ...పతివ్రతనే!



అడ్డమైన ప్రశ్నలకీ కాదంటూ అవునని
అర్థమైనా కానట్లు అమాయకంగా నవ్వి
అడ్డంగా నిలువుగా తలూపి తైతెక్కలాడి
అబ్బో అమ్మో అంటున్న నేనూ...పతివ్రతనే!



అలై ఎగసిపడుతున్న కోర్కెలకి ఆనకట్టేసి
అనురాగాన్ని కలలోనే కామించి రమించి
అలుసైపోయి అరచేతిలో వైకుంటమే చూసి
అమాయకంగా అవునన్న నేనూ...పతివ్రతనే!



అవసరాల్ని ఆసరాచేసి అందాలని పొగిడి
అదును చూసేసి అదుపు తప్పినవారిని
అతిమంచివారంటూ అందరినీ ప్రేమించిన
అసలుసిసలైన అబలనైన నేనూ...పతివ్రతనే!

అంతరాత్మా..."ఐ లవ్ యూ"

నాలోనే దాగిన స్వార్థ ప్రలోభ ప్రేతాత్మా
నా నుండి నన్ను లాక్కున్న భూతమా
మంత్రమేసి మాయచేసిన మార్జాలమా
పుర్రెలో గుజ్జునే పీక్కుతినెడి పిశాచమా!


నా ఆలోచల్ని ఆత్మలకిచ్చి ఆడుకోమని
నాదేహం పరులకై ప్రేతాత్మగా మారమని
మట్టిలో కలిసి పిండమై కాకినే తినమని
నన్నే మార్చిన నువ్వే ప్రియదెయ్యమని!


నా ఆత్మవే అయినా నిన్ను ఆలింగనమిడి
అసలుసిసలు అందవికారివైనా నే ముద్దిడి
ఆత్మలో ఆత్మనై ఆత్మల నడుమ అడుగిడి
ఎలుగెత్తి అరుస్తా అంతరాత్మా ఐ లవ్ యూ!

సరాగాల వంట

ముద్దుల ముద్దకూర మురిపాలవేపుడు
కమ్మగావండి వయ్యారంతో వేడిగా వడ్డిస్తే..
ఒళ్ళువేడెక్కి జ్వరమొచ్చింది అన్నావురా!

కౌగిళ్ళనే కొనగోటితో కోసి కలగూరగా కలిపి
కడుపసందుగా కవ్వింతలతో అందించబోతే..
కళ్ళున దగ్గితే కంగారులో పొలమారె కదరా!

వలపు వగలనే వడగాచి మసాల దట్టించి
ఇగురు కూరను ఇంపుగా ఆరగించమంటే..
అరగదని చెప్పి ఆయాసపడతావు ఏందిరా!

పులుపు పరువాన్ని పప్పుపులుసుగా పోపేసి
నాజూకు చేతులతో నెయ్యివేసి తినిపించబోతే..
వికారమని వింతాకారాలే చూపుతున్నావురా!

చిక్కటిపాల మదినే గడ్డపెరుగుగా తోడుపెట్టి
అల్లరి ఆవకాయనే నంజుగా అద్దుకోమంటే..
పడిసెమంటూ పట్టెమంచం ఎక్కినావేందిరా!

ఈ విచిత్ర విన్యాసాల చోద్యమేమని ఆరాతీస్తే
వలచినవాడి మనసుదోచ వంటావార్పులేల..
కలువభామను చూసి కడుపునిండెనన్నావురా!