అనురాగాలమూటకి శ్రీకారమీ బంధం ఒకరినొకరు పెనవేసుకునేదే ఈ బంధం ఒకరికొకరి నిరీక్షణలో పెరుగుతుందా బంధం సాగరానికి కెరటానికి ఉన్నది ఈ సంబంధం జాబిలికి వెన్నెలతో ఉన్నది ఇదే అనుబంధం అనుమానాలకి చోటివ్వని బంధం నమ్మకంతో బలపడితే ఈ రాగబంధం కలకాలం నిలుస్తుందదే అనురాగబంధం
గత సంవత్సరం నవంబర్ 24న రాత్రి 8గంటల 15నిమిషాలకి మౌనం గా ఒక గాజుబొమ్మలాలింపుల మేలు కలయికకై కలలు కంటూ కూర్చుంటే ఆవేదనే తప్ప ఆలోచనలు రావని.... తన మనసులోని మాటను చిరుభావాల రూపంలో వ్యక్తపరచి, తన వలపుల తలపులనే కాదు ఎడబాటులోని మాధుర్యాన్ని సైతం నివేదనగా ప్రేమ ఉనికిని తన మాటగా చెబుతూ కుర్రకారు కాస్త ఆలోచించండి అంటూ వారి వెన్నుతట్టి మనకేల మృతిచింత ధైర్యముతో సాగిపోదాం ముందుకని తన పయనాన్ని సాగించింది....
ఇదండీ సంగతి అని రాసి మౌనంగానే ఉండేదాన్ని.... నీ తలపులలోని మార్పుతో ఆలోచించమని ఇద్దరు కలసి జీవించనప్పుడు ప్రేమ/స్నేహంఅనేమాటలెందుకని,నీలోమార్పుకై ప్రయత్నించి ఓటమిలో గెలుపుని చూడమని నా ఆలోచనలు నన్ను తట్టకపోయి వుంటే....
వక్రించిన విధిని కూడా నిస్వార్ధమైన ప్రేమతో నిదురలేపి ఓ...ప్రేమ నీకు కొత్త సంవత్సరంలో స్వాగతం పలుకుతూ నీ ప్రేమని కలసికట్టుగా అందరికీ పంచుతూ....ఎందుకు? ప్రాప్తం ఉన్నవారికే ఆమె(ప్రేమ) దక్కాలి,ప్రేమ/దోమ అన్నవారికి కూడా ఓ ప్రియతమా! నీకు అక్కరకురాని దానను కానని ఎలా తెలిపేది అని నాలో నీవు చేరి గుస గుసలాడిన ఆ తరుణం నాకు ఇప్పటికీ శిల్పి చెక్కిన సూక్తిగా గుర్తున్నది, అది నేను ఎలామరిచేది ప్రియతమా!(ప్రేమ భావాన్ని).... నీలో నేను ఎప్పటికీ ఉన్న్నానని, అందరూ మెచ్చిన జంటగా ప్రేమ పయనం చేస్తూ ప్రేమ జల్లులలో తడసిన నిన్ను కాంచిన వేళ నా వ్రాతలు(కవితలు) మీ తలపులు ఒకటవ్వాలని ఆశిస్తాను.... అతని రాకకై(నా టపా) ఎదురుచూసిన వారికి శుభాకాంక్షలు అంటూ నీ పిలుపుతో(నా కవితతో) అతడు/ఆమె నే కాక ఏడువింతల లోకంలోని ప్రతి మనసుని ఎలాచేరుకోను అని ఆలోచిస్తాను....
మనమెవరో తెలిపే ఈ రంగుల జీవితం గూర్చి తెలుసుకునే చిరుప్రయత్నంలో ప్రేమ ఎవరికైనా ప్రియమేనని నాడు-నేడుప్రేమలో అంతరం ఉందని తెలిపిన ఓ నా కవితా ఎక్కడున్నావమ్మ అంటూ వెదికిన నాకు ప్రేమించాకే తెలిసింది(కవిత రాసాక) అది ఎంత సులభమైన కష్టమో కదా ఈ పరుగుల జీవనంలో అని....
నీ రాకకై(మీ వ్యాఖ్యకై) ఎదురు చూసే నాకు మీ ప్రోత్సాహం ఏమి చేయమంటావు(ఏమి రాయాలో)అంటూ నాతలపులను తట్టి లేపుతాయని....
ఎందుకనో మీ అందరినీ నాకు దరిచేర్చాయి ఈ విన్నవించవా అంటూ నేను చేసిన ప్రేమపోరాటాలు(రాసిన టపాలు), కన్నీటి వేడుకోలులు(కవితలు) ఎవరికి చెప్పాలి ఈ విన్నపాలు(నా భావాలు), నాలో ఈ ఆనంద ఊయల లూగించిన ఈ కలువ రాసిన కవితలు....
నా ఈ వినతిని(రచనలని) పద్మార్పితా! ఓ పుష్పమా అని పువ్వుని పలుకరిస్తే(ఆత్మీయంగా) పులకరించమని జీవితం నాకు నేర్పింది,కాయగూరలతో కబుర్లు చెప్పినా స్నేహమంటే ప్రేమని కొలచిచూడు అని అన్నా నీవుకావు రావు అంటూ ప్రేమ ఒక స్వప్నం అని రాసినా ప్రోత్సహించి సహకరించిన వారెల్లరికీ ధన్యవాదాలు....
జై భారత్ మాత అని నినాదంతో పాటు పెళ్ళిపందిరిలో ప్రకటనని సైతం మెచ్చి నా బ్లాగ్ పుట్టుకకి ఒక సార్ధకతని చేకూర్చి మీ అభిమానాన్ని నాకు బహుమానంగా ఇచ్చినది ఎప్పటికీ అందిస్తే ఎంతో బాగుంటుంది....మీ అభిమానాన్ని నేను ఎన్నడూ చెదిరిన కల కానీయక ఎదురీతతోనైనా దాన్ని నిలబెట్టుకోవడానికి నా ప్రతి పదం ప్రయత్నిస్తానంటుంది....
ప్రేమంటేనే కాదు కృష్ణమ్మ కరుణించవమ్మ అని ప్రార్ధించినా జలపుష్పాలని గాలించినా మేకింగ్ ఆఫ్ మానవా గురించి శోధించినా అంతా మీ అభిమానం....
వేచివున్నా....నా నూరు టపాలని పూర్తిచేసిన ఓ నా జీవితమా నీవు తెలుసుకో సంపాదించుకో అందరి మనసులలో స్థానం....అదే నా ఈ మాటల మర్మం....
నా చిట్టి బ్లాగ్ బంగారం...
ఇదే నీ మొదటి జన్మదినం....
చేయి అందరికీ వందనం....
పొందు ఆశ్శీసులందరివి ఈదినం!
నీలిరంగులోని పదాలు ఈ సంవత్సరం వ్రాసిన నా టపాల సూచికగా గుర్తించండి... వాటిని క్రమబద్దీకరణ చేయడంలో భావ ప్రకటనలోని లోపాలని మన్నించండి...
ఇసుకలో రాతలను నేను రాయను అవి నిలకడలేనివని నాకు తెలుసును బండబారిన హృదయం నాదని నీవంటే రాతిపై వ్రాసిన రాతలను చెరపలేవంటాను!
తపించి చూడు ఎదుటివారి తలపులలో తెలుస్తుంది నీకు ప్రేమంటే ఏమిటో అన్నిటిలా ప్రేమ అమ్ముడుపోతే అంగట్లో ఎలా తెలుస్తుంది నీకు ఎదురుచూపు ఏమిటో!
నిన్ను చూసే నా కళ్ళు తమని తాము చూసుకోలేవు మాటవినని మనసుని మందలిద్దామంటే అది నా చెంతలేదు నా నీడలో, శ్వాసలో నీవున్నప్పుడు నన్ను వీడి నీవు పోలేవు మనసు పొరల్లో దాగిన మమతకు ప్రేమమాధుర్యమే తెలియదు!
నీ ఎదుట నా మనసుని తెరచి ఉంచినానంట నీకై మరణించి కూడా కనులు తెరచినానంట నీవు ఇంకా వేచి చూడమనడంలో అర్థమేలేదంట!!
వినమ్రతతో.....
నా టపాలని ఇష్టంగా చదివినవారు.. అయిష్టంగా భృకుటిని ముడివేసినవారు.. ఆహా! ఓహో అని పొగిడినవారు.. వ్యాఖ్యలతో వెన్నుతట్టినవారు.. అర్థం కాక చదవక వదిలేసినవారు.. తప్పులను ఒప్పులుగా సరిచేసినవారు.. ప్రేమా పైత్యమా అని అనుకున్నవారు.. పిచ్చిరాతలు మనకేల అని తలచినవారు.. ఎవరైనా అంతా నావారు.....ఈ బ్లాగ్ మిత్రులు.. మీ అందరికీ నా అభివందనాలు... అర్పిస్తున్నది నూరవటపాతో హరిచందనములు... పద్మ ఆశిస్తున్నది మీ మన్ననలతో కూడిన దీవెనలు...
అవి బ్రహ్మ సృష్టికర్తగా కొత్తగా ఉద్యోగంలో చేరిన రోజులు...... మొదటి రోజు శుభసూచకంగా గోవుని సృష్టించి, నీకు అరవై ఏళ్ళ ఆయువుని ప్రసాదిస్తున్నాను. ఎండని వానని చూడక కష్టపడి రైతుకి అండగా వుండి అవసరానికి అతని ఆకలిని నీ క్షీరముతో తీర్చు అని సెలవిచ్చాడు. ఆవు అయ్యా! ఇలా గొడ్డు చాకిరీ చేస్తూ అరవై ఏళ్ళు బ్రతకాల? నాకు ఇరవై ఏళ్ళు చాలు భగవంతుడా, మిగిలిన నలభై ఏళ్ళని నీవే తీసుకోమని మనవి చేసుకున్నది. బ్రహ్మ సరే అన్నారు. రెండవరోజు శునకాన్ని సృష్టించాడు, దానికి ఇరవై ఏళ్ళ ఆయువుని ప్రసాదించి నీవు ఇంటి ద్వారానికి కాపలా కాస్తు వచ్చే పోయేవారిని చూసి మొరగమని సలహా ఇచ్చారు. కుక్క, మహాప్రభో! ఈ కాపలా ఉద్యోగం ఇరవై ఏళ్ళెందుకు పదేళ్ళకి కుదించమని మొరపెట్టుకుని మిగిలిన పదేళ్ళు తిరిగి ఇచ్చేసింది. బ్రహ్మ సై అన్నారు. మూడవరోజు మర్కటాన్ని మహా మోజుతో మలచి నీకు ఇరవై ఏళ్ళ ఆయువుని ఇస్తాను నీ కోతి చేష్టలతో అందరినీ అలరించమన్నాడు ఆ బ్రహ్మ. కోతి తన కోతిబుర్రతో ఆలోచించి, అయ్యా నాపై మీకు ఇంత అభిమానము వద్దు కాని నాకు కూడా కుక్కకి ఇచ్చినంత ఆయువునే ప్రసాదించండి. మిగిలిన పదేళ్ళు నేను కూడా మీకే ఇచ్చేస్తున్నానంది. బ్రహ్మ వలదు అనలేక ఔను అన్నారు. నాల్గవరోజు నవ్వుతూ నరుడిని రూపొందించాడు. ఈసారి నరుడి నోట "నో" అనిపించుకోరాదని, నరుడా నీవు ఏపని చేయకు హాయిగా తిని, ఆటలాడుకుని ఆనందించి నిద్రించు, నీకు ఇరవై ఏళ్ళు ఆయువుని ప్రసాదిస్తున్నాను పండగ చేసుకో! అని అలసి కాస్త విశ్రాంతికై ఒరిగిన వేళ......మానవుడు మాహా మేధావి, బ్రహ్మాజీ! ఒక విన్నపము ఈ జీవితానికి ఇరవై ఏళ్ళు ఏం సరిపోతాయి చెప్పండి? తమరు కాస్త పెద్దమనసుతో నా ఇరవైకి గోవుగారి నలభై, శునకానివి పది, కోతివి పది కలిపితే మొత్తం ఎనభై ఏళ్ళు మీ పేరు చెప్పుకుని బ్రతికేస్తాను అన్నాడు. బ్రహ్మగారు మానవుని మర్యాదకి మెలికలు తిరిగి తధాస్తు అన్నారు. అదండీ అప్పటి నుండి మానవుడు.....మొదటి తన ఇరవై ఏళ్ళు ఏపని చేయకుండా తిని తొంగుని తరువాత నలభై ఏళ్ళు గొడ్డు చాకిరీ చేసి పదేళ్ళ తన కోతి చేష్టలతో మనవళ్ళని మనవరాళ్ళని నవ్వించి మిగిలిన పదేళ్ళు ఇంటికి కాపలా కాస్తున్నాడన్నమాట! (ఇది సరదాగా నవ్వుకోవడానికి చేసిన ప్రయత్నమే కాని ఎవ్వరినీ భాధ పెట్టాలని మాత్రం కాదని మనవండి... చిత్తగించవలెను)
జలకన్యపై కవితాస్త్రము సంధించ నేనెంతటిదానను! ఉషగారి కోరికను నేను ఎటుల కాదని అందును! మరువపు సువాసనలతో నేను మరులుగొలుపలేను! స్వీకరించుము పద్మ అర్పిస్తున్న జలపుష్పమును!
నీటిలో ఏమున్నది నీలి రంగు తప్ప అనుకున్నది ఆ మీన ఒడ్డున ఉన్న నీటి బుడగపై రంగుల తళుకులు చూసి మురిసినది జాణ తీరము చేరిన మీన ఎటుల జీవించునో ఈ ప్రపంచాన్న!
ఇసుక రేణువుల తాకిడికి పగిలిన బుడగను చూసి భోధపడినది క్షణాల్లోన ఉషాకిరణాలతోనే దానికి అన్ని రంగుల హంగులని తెలుసుకున్నది జాణ స్వచ్ఛమైన స్వాతిముత్యములెన్నో కదా మీనపు సామ్రాజ్యాన్న!
దూరపుకొండలు నునుపులే అని తలచినది మదిన ఉక్కిరి బిక్కిరై సాగరము వైపునకు ఉరికినది జాణ ముత్యమును మించిన రంగేలననుకున్నది మీన తన అంతరంగాన్న!
కష్టానష్టాలు పడుతున్న మీ పిల్లలమమ్మ! కరుణాకటాక్షాలని మా పై చూపించవమ్మ! శాంతించిన నీ కౌగిలిలో కాస్త సేదతీరనీయవమ్మ! కరకట్ట బిడ్డలమైన మాకు కన్నీళ్ళనే మిగల్చకమ్మ! పరవళ్ళు చూసి మురిసే మాపై ఉరవళ్ళు వద్దమ్మ! ఆగ్రహిస్తే నీ పైనే ఆక్రోశించే అభాగ్యులమమ్మ! ఆలంబనకై మరల నీ దరిచేరే ఆశాజీవులమ్మ!
పుస్తకంలోని పుటలన్నీ వెనక్కి తిప్పినట్లు జీవితాన్ని తిప్పితే ఎంత బాగుంటుంది! నిదురలోని ఊహా పుష్పాలు నిజ జీవితంలో విరబూస్తే విడ్డూరమౌతుంది! హృదయాలు రెండుండీ, ఒకటి విరిగినా మరొకటి మనదైతే మరింత బాగుంటుంది!
మనసుకి ముసుగు వేయక మమతలని పంచే తోడుంటే ఎంత బాగుంటుంది! ఆలోచనలని ఆచరణలో పెడితే చేరవలసిన గమ్యం చేరువౌతుంది! మనకి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరచుకుంటే మరింత బాగుంటుంది!
ఆశించి ఆదరించక, అభిమానంతో ఎవరైనా అక్కున చేర్చుకుంటే ఎంత బాగుంటుంది! మంచితనాన్ని మాటల్లో కాక చేతల్లో చూపిస్తే మక్కువౌతుంది! జీవించినప్పుడే కాదు నిర్జీవివై నలుగురి మనసులో జీవిస్తే మరింత బాగుంటుంది!
పెళ్ళిపందిరిలో వధువు కావలెను అనే ప్రకటనని ఎవరెవరు ఎలాఇచ్చారో ఒక్క లుక్ వేయండి:)...:)
డాక్టర్....కొద్దిరోజుల క్రితమే నాకు ప్రేమ అనే బాక్టీరియా సోకి పెళ్ళి అనే రోగానికి దారితీసింది. కావున అందమైన రోగిణులు మందు మాకు గురించి తెలిసిన వారు ముందుగా రిసెప్షన్ లో అపాయింట్మెంట్ తీసుకుని నన్ను సంప్రదించవలసిందిగా ప్రార్ధన. రోగనిర్ధారణ(అన్ని అభిప్రాయాలు కలిస్తే) జరిగిన పిమ్మట నేను ఒక మంచి వైద్యునిగా(భర్తగా) సేవలందిస్తానని వాగ్ధానం చేస్తున్నాను!!!
లాయరు(న్యాయవాది).... నేను భర్తగా ఆమోద యోగ్యతను పొంది, వివాహమాడ తలచినాను కావున అవివాహితల నుండి ధరఖాస్తులను కోరడమైనది. ఆమె తన పరిధిలో నాకు మనసావాచా అర్పితమవ్వాలి. ఎటువంటి అభ్యంతరమున్నా ఓవర్ రూల్డ్ కావించబడుతుంది, సస్టండ్ చేయబడదు!!!
బిక్షగాడు....అయ్యా దేవుని పేరుపై నాకు ఒక సహధర్మచారిణిని దానం చేయండి. వేరొకరి పత్ని కాకపోయినా మీపత్ని అయినా పర్వాలేదండి. మీరు ఒకళ్ళని దానం చేస్తే మీకు భగవంతుడు నలుగురిని ప్రసాదిస్తాడు. అయ్యా ఆలోచించక దానం చేయండి బాబయ్యా!!!
బ్యాంకర్....వధువు కావలెను, ఎవరైతే వారి ఆస్తిని జమా చేసి చక్రవడ్డీ లాంటి సేవలతో లాభాలని అందించగలరో అటువంటి అమ్మాయిల నుండి నెలలోపు ధరకాస్తులను కోరడమైనది. గడువు తరువాత అయినచో ఆలస్య రుసుముతో స్వయముగా సంప్రదించ గలరని ప్రార్ధన!!!
కవి....బహుకాలానికి నాకొక కోరిక కలిగినది, పెళ్ళికై నా మనసు ఉవ్విళ్ళూరుతున్నది, ఇన్నాళ్ళు పెళ్ళితో నాకేమీ పనిలేదన్నది, ఇప్పుడిక ఇంటపని బయటపని నాతో కాకున్నది. అందుకే సరి అయిన జోడీ కొరకు వెతుకుతున్నది!!!
కారు మెకానిక్....పాతదైనా కొత్తమోడల్ గా కనబడే వధువు కావలెను. మంచి కండిషన్ లో ఉండి తక్కువ సొమ్ముతో ఎక్కువ హంగూ ఆర్భాటాలు చేయగలిగి, సంవత్సరంలో రెండు సర్వీసులు( సినిమాలు) మాత్రమే కోరుకునే 362436 మోడల్ వధువునకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. బ్రోకర్లను వదలి పార్టీ డైరెక్టుగా సంప్రదించవలసిందిగా కోరుతున్నాము!!!
తాగుబోతు....నాకు పెళ్ళాం కావాలి. పిల్ల తండ్రికి తప్పక సోడా ఫ్యాక్టరీఉండి తీరాలి. నేను ప్రతిరోజూ కాకుండా వారానికి ఏడు రోజులు మాత్రమే తాగుతాను. ఇంటి వద్ద కాదంటే బార్ లో సరిపెట్టుకుంటాను. బార్ నుండి నన్ను ఇంటికి మోసుకెళ్ళే అమ్మాయిలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సోడాని సాంపుల్ గా పంపి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి!!!
గమనిక:- ఇప్పటి వరకు పై వ్యక్తుల ఆలోచనల మేరకు ప్రకటనలను ఇవ్వడం జరిగినది. ఎవరైనా ఆశక్తిగలగిన వారు తమకి తోచిన విధముగా ప్రకటనలు ఇవ్వదలచిన వ్యాఖ్యల రూపంలో ప్రకటించమని అభ్యర్ధన!!!
బ్లాగ్ మిత్రులారా! ఇది కేవలం హాయిగా నవ్వుకోవడానికి చేసిన చిరు చిలిపి ప్రయత్నమే కాని ఎవ్వరి మనసునీ నొప్పించాలని మాత్రం కాదని మనవి....
ప్రేమకి కొలమానం నీవడిగిన వేళ నా గుండె గొంతు విప్పి చెబుతున్నానీవేళ నీపై నాకున్న ప్రేమను హృదయకవాటాలని తెరచిచూడు నమ్మకపోతే నా హృదయంతో నీ హృదయాన్ని మార్చిచూడు.
నా ప్రతిశ్వాసపై నీపేరే లిఖించాను నీకై నా అస్థిత్వాన్నే నేను మరిచాను నీవుకూడా ప్రేమలో హద్దులు దాటి చూడు నా నిద్రలేని రాత్రులతో నీ రాత్రుల్ని మార్చిచూడు.
నా ప్రేమ కన్నీరై ప్రవహించినవేళ ఆనీరే నీ హౄదయాన్ని కడిగి వేస్తుందావేళ ఆరోజు కుడా నా పెదవి నీపేరే పలుకుతుంది చూడు ఆ పలుకులకి ప్రతిస్పందనగా నీవేమైనా పలికి చూడు.
నీకై నా జీవితాన్నే అర్పిస్తాను నీప్రేమకై నేను ప్రపంచాన్నే వెలివేస్తాను అప్పుడు నీ హృదయమెలా ఘోషిస్తుందో చూడు నా ప్రేమని నీ ప్రేమతో కొలచివెల కట్టలేవు చూడు.