నా తలపులలో...

చిరుగాలులు నీకు చింతనిస్తున్నాయా!
నా తలపులు నీలో తబ్బిబౌతున్నాయా!
నా ఊసులేమైనా నీకు ఊరటనిస్తున్నాయా!
నీ కనులు స్వప్న లోకాలలో విహరిస్తున్నాయా!
తొలిపొద్దు కిరణాలు నిన్ను తట్టిలేపుతున్నాయా!
ప్రతి పనిలో మన హృదయాలు ప్రతిబింబిస్తున్నాయా!
ఋతువులు నన్ను చేరమని నిన్ను అల్లరి పెడుతున్నాయా!
నా ఉనికిని నీతో ఊహించి నీ పెదవులు విచ్చుకుంటున్నాయా!
విచ్చుకున్న పెదవులను చూసి నీ కళ్ళు చెమ్మగిల్లుతున్నాయా!
ఎడబాటెన్నాళ్ళని తనువులోని అణువణువులు ప్రశ్నిస్తున్నాయా!
నీ ఆలోచనలు నిన్ను నా దరి చేరమంటూ ఆరాట పెడుతున్నాయా!
నీ రాకతో నా సందేహాలు తీరతాయని అనుకుంటాను ప్రియా!!!
నీ కొరకై వేయి కన్నులతో ఎదురు చూస్తుంటాను ప్రియా!!!!

ఏం చేయమంటావు??

గాయం మానలేదనుకుంటే
మరో గాయానికి గురి చేస్తున్నావు.
కన్నుల నిండా నీరుంటే
నవ్వుతూ వుండమని మారం చేస్తున్నావు.
హృదయం దహించి వేస్తుంటే
వెలుగుకోసమై వెతకమంటున్నావు.
నిజాలే భయపెడుతుంటే
నిందలని ఎలా నమ్మమని అంటావు.

కంటికి కునుకే రాకుంటే

కమ్మని కలలు ఎలా కనమంటావు.

నీడైనా నాకు దక్కలేదంటే

తోడుకోసమై ఎదురు చూడమంటావు.

చుట్టూ పొగ కమ్మి ఉంటే

మంచు జల్లు కురియబోతుందని అంటావు.
బ్రతుకే భారమైనది అనుకుంటే

ఇదే జీవితం ఇలాగే సాగిపోవాలంటున్నావు.

నీరాకతో.....

నీవు వస్తున్నావని చిరుగాలి కబురు తెచ్చింది
అది విన్న నా మనసు నాట్యమాడింది
ఇప్పుడే నా చుట్టూ వెన్నెల విరబూసింది
నీవు లేక నా కంటి కాటుక కరిగింది
ప్రతిరోజు నా కన్నీరే నాకు తోడైంది
నేను వద్దన్నా నా మనసు నీ వెంటవచ్చింది
ఇంతవరకు పెదవులపై చిరునవ్వు కరువైంది
నీవు వచ్చాకే నాకు తెలిసి వచ్చింది
వెన్నెలకూడా నాపై ఇన్నాళ్ళు అలిగింది
నీ అండతో నా మనసు నామాట వినను అంటుంది
ఇప్పుడు గుర్తొచ్చానా అని అద్దం నన్ను ప్రశ్నించింది
ఆ ప్రశ్నకి నా సిగలోని ఎర్ర గులాబి పక్కున నవ్వింది
ఇది చూసిన నా హృదయం కొంగుచాటున దాగింది
నీలా నేను దాగలేనంటూ నా ముఖం విప్పారింది
నీవే నా ఆనందాన్ని తిరిగి తీసుకుని వచ్చింది....

పరుగుల జీవనం!

ఈ ఉరుకుల పరుగుల జీవనంలో పరుగిడి చేసేదేముంది
చంద్రున్ని చేతపట్టి రేయిని ఆపి ప్రయోజనమేముంది

సూర్యోదయం ఎప్పుడౌతుందో తెలియదు
సూర్యాస్తమయం అస్సలు గుర్తుకే రాదు

సెల్ ఫోన్, టెలిఫోన్ పలకరింపులే అందరు
ప్రేమాభిమానాలతో పలకరించే వారెందరు

ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలో అందరితో ఉంది టచ్
పక్కింట్లో ఏమి జరుగుతున్నా పట్టించుకోము మనం మచ్

ఏయే ఛానల్ లో ఏ కార్యక్రమాలో తెలుసు అందరికి
తల్లిదండ్రులని పరామర్శించే సమయం లేదు ఎవ్వరికి

మనశ్శాంతితో మనిషి జీవించ లేకపోతున్నాడు ఎందుకని
108 ఛానల్స్ లో ఒక్కటి కూడా ఆకట్టుకోలేక పోతుందెందుకని

ఇటువంటి ఉరుకుల పరుగుల జీవనంలో పరుగిడి చేసేదేముంది
ఇలాగే జీవించాలి అనుకున్నప్పుడు మరణించి లాభమేముంది!!!!

సులభమైన కష్టం...

స్నేహం చేయడం సులభం
నిలబెట్టుకోవడమే కష్టం...
ప్రేమించడం సులభం
ప్రేమించబడడం కష్టం...
నమ్మడం సులభం
నమ్మించడం కష్టం...
గుర్తుంచుకోవడం సులభం
మరచి పోవడం కష్టం....
అసత్యమాడడం సులభం
నిజం ఒప్పుకోవడం కష్టం...
ఏడిపించడం సులభం
నవ్వించడం కష్టం...
ఇలా కవిత వ్రాసేయడం సులభం
అది అందరిని మెప్పించడం కష్టం...

ప్రేమించాకే తెలిసింది....

ఓ అమ్మాయి మనసివ్వాలని ఆరాటపడింది
ప్రతిక్షణం తనలో తనే తర్జన బర్జన పడింది

ప్రపంచమంతా తనలాగే స్వచ్చమైనదనుకుంది

అందమైన లోకమని భ్రమపడింది

ప్రేమే లోకమనుకుని ప్రేమలో పడింది..


ప్రేమించాకే తెలిసింది....


ఆ అమ్మాయి ఇప్పుడు ఆలోచిస్తుంది

లోకం రంగులమయం అనితెలుసుకుంది

అమాయకత్వంతో మోసపోకూడదనుకుంది

ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమేనంటుంది

స్థిరమైన గమ్యంతో ముందుకి సాగిపోతుంది..

ఓ నా కవిత ఎక్కడున్నావమ్మా???

నా చిట్టి కవిత ఎక్కడ తప్పిపోయావమ్మా
నా తలపుల నుండి ఎటు వెళ్ళిపోయావమ్మా
ఈ జనసమూహంలో ఎక్కడ చిక్కుకున్నావమ్మా
నిన్ను ఇందరిలో ఎక్కడని వెతుకనమ్మా
నలుగురి పెదవులపై నవ్వైనావామ్మా
నా చిట్టి కవిత ఎక్కడ తప్పిపోయావమ్మా?

ప్రతి ఒక్కరూ నీకై వెతుకుతున్నారమ్మా
ఎందరి కనుసైగలనుండి నీవు తప్పించుకోగలవమ్మా
ఆకాశంలోని తారలను అడిగానమ్మా
ఎవరి హృదయంలోనైనా చిక్కుకున్నావామ్మా
పూలలోని సుగంధంలో దాగున్నావామ్మా
నా చిట్టి కవిత ఎక్కడ తప్పిపోయావమ్మా?

ప్రేమలో అంతరం!!!

ప్రేమకి మరణం లేదంట!
అందుకే మరల మరల ప్రేమిస్తారంట!

ఒకరు మనసు విరిస్తే వేరొకరు అతికిస్తారంట!
ఇదీ నేటితరం ప్రేమికుల మాట!!!


ముందు ప్రేమనేది ఒకరికే అయేది సొంతం!

అందుకే అప్పుడు దేవదాసు పార్వతీలు అయ్యారు అంతం
!
ఇప్పుడు చూడు ప్రేమకి మారింది అర్ధం
!
మునుపటిలా ఎవరూ ప్రేమను చేయడంలేదు వ్యర్ధం!!!

దేవదాసుకి పార్వతి కనిపిస్తుంది అందరిలో!

పార్వతి చూస్తుంది దేవదాసుని కొందరిలో!

ఏది ఏమైనా ప్రేమనేది వుంది ప్రతి ఒక్కరిలో!
మార్పు వచ్చింది మానవుని ఆలోచనా సరళిలో!!!