విన్నపాలు!!!

భగవంతుడా!
అందమైన రూపాన్ని ప్రసాదించవేల?

నిర్మలత్వాన్ని మించిన నిగారింపు నీకేల!!!


ఆనంద ఢోలికలలో ఊగించవేల?

తృప్తిని మించి ఆనందము ఉన్నదందువా బాల!!!


అష్ట ఐశ్వర్యాలను ఒసగరాదటేల?

ఆశాసౌధాలకి అంతమే లేదేల!!!

ప్రేమానురాగాలను అందించరావేల?

ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోమని వేరే చెప్పాల!!!


ఇందరిలో నాకే ఇన్ని కష్టాలేల?

మెరిసేదంతా పుత్తడి కాదు తెలుసుకోవేల!!!


మనశ్శాంతిని కలుగచేయ రావేల?

రాగద్వేషాలలో నీవు బంధీవైనావేల!!!

ఎదుటి వారికొరకై నే ప్రార్ధన చేయనేల?

చేయూతనీయని చేతలులేని ప్రార్ధన చేయు పెదవులేల!!!

ఎవరికి చెప్పాలి?

మిత్రులే కదా అని పదిమందితో చర్చించకు.
నీ ప్రేమను గూర్చి నలుగురితో మాట్లాడకు..

వాళ్ళు నిన్ను హేళన చేస్తారేమో!!!


సూర్యచంద్రులకి నీ వేదనను వివరించకు
పరిష్కారం కొరకై వాళ్ళని ప్రాధేయపడకు..

విశ్వమంతా వారై విసిగి వేసారినారేమో!!!


చీకటికి నీ గోడుని వెళ్ళబుచ్చకు

అంధకారమేదో దారి చూపుతుందనుకోకు..
రేయికి తన వెలుగే తనకి కరువైందేమో!!!

సాగర కెరటాలని పలకరించకు

ఆలోచనా తరంగాలలో విహరించకు..

సుడిగుండాల్లో నిన్ను చుట్టేస్తాడేమో!!!


ఆకాశంవైపు ఆశగా చూడకు

ప్రేమలో సహాయ పడమని కోరకు..

చిరాకుతో నిన్ను ఉరిమి చూస్తాడేమో!!!


చెలియ కంటపడిన వేళ మౌనం వహించకు
మౌనంతో తనని వేధించకు..
నిజమైన ప్రేమైతే నీకే దక్కుతుందేమో!!!

కన్నీటి వేడుకోలు!!

మబ్బులా కమ్ముకుంటాయి...
ఏకధాటిగా కురుస్తాయి...
నదీ ప్రవాహంలా ప్రవహిస్తాయి...

తడిసిన మల్లెలౌతాయి...

జ్ఞాపకాలన్ని గుర్తుకొస్తాయి...
నీవు గుర్తుకొస్తే నా కళ్ళు ఇలా వర్షిస్తాయి!

కంటి నిండా కలలున్నాయి...

అవి ఎప్పటికి తీరుతాయి...
గొంతులోని మాటలు పెదవి దాటనంటున్నాయి...
చేతులు చిత్రాన్ని గీయాలని ప్రయత్నిస్తున్నాయి...

కుంచె ఉంది, రంగులూ ఉన్నాయి...

నీ చిత్రాన్ని గీయాలంటే కన్నీటి పొరలు అడ్డొస్తున్నాయి...


నా గుండెను రాతి బండను చేయి...

పగిలి పోయిందనుకో ఆ రాయి...

నన్ను మట్టిలో కలిపి వేసేయి...

భగవంతుడా! నీవు నాకు ఈ ఒక్క సహాయము చేయి...

ప్రేమ పోరాటం...

ప్రేమని పొందాలని నా మనసు చేస్తుంది పోరాటం
నీ హృదయంలో స్థానానికై పడుతుందది ఆరాటం

కనులు గాయ పరుస్తున్నాయి కంటిచూపునే
పలు ప్రశ్నలతో నామనసు వేధిస్తోంది నన్నే

కనులు చీకట్లో కారుస్తున్నాయి కన్నీరు

వాటికి ఇంకా అలవాటు కాలేదు వెలుతురు

ఎంతో మంది మేధావులకే దక్కలేదు ప్రేమనేది

ప్రేమించి శిక్షను అనుభవిస్తుంది నా మనసనేది

ఒకరోజు నీవు పంపిస్తావు నీ ప్రేమ పుష్పాలని
చూస్తావప్పుడు నా హృదయానికైన గాయాలని

కన్నీళ్ళు కూడా నీ మనసుకి అమ్ముడు పోతాయి

మౌనంగానే మన హృదయాలు రెండూ రోధిస్తాయి


నిన్ను నేను తప్పక గెలుస్తాను వేచియుండు

నీ నుండే నిన్ను లాక్కుని పోతాను చూస్తుండు!

విన్నవించవా!!!

ఓ చందమామ.... నాపై వెన్నెలని కురిపించవా
మదిలోని వేదనని మరిపించి మురిపించవా
ఇరువురి నడుమ ఉన్న ఎడబాటుని దూరంచేయవా
సుందర స్వప్నాలలో మమ్ము విహరించ నీయవా!

నేనొక స్వప్నాన్ని నన్ను ప్రేమించమనకు
ప్రేమిస్తే ఇంక నన్ను మరువమని అనకు
గాలితెమ్మెరలు వచ్చిపోతుంటాయని చెప్పకు
కలువకు నీకు నడుమ ఉన్న ఎడబాటుని గుర్తుచేయకు!

పగలు రాత్రి కూడా కలిసే అవకాశముందని చెప్పు
కొమ్మ నుండి వేరైన రెమ్మ కూడా విరబూస్తుందని చెప్పు
వెన్నెలంటి మనస్సుందని నన్ను నీతో పోల్చి చెప్పు
నా పిచ్చి కాని...ఏం చెప్పాలో నీకు తెలియదా చెప్పు!!!

ఎందుకని!


ప్రియా! తారలను కన్నీటితో చూస్తే మెరుస్తాయి ఎందుకని!
విరహములో వర్షించే ఆశువులకి రంగులేలా? అందుకని...

నీవు లేకపోతే మేఘాలు వర్షించవు ఎందుకని!
నాలోనే థూఃఖాన్ని దిగమింగుకున్నాను అందుకని...

పలుకని పెదవులు పరిభాషలాడుతున్నాయి ఎందుకని!
మనస్సులోని భావాలకి ఏ భాష అడ్డుగోడలు కావు అందుకని...

చలికాలంలో వడగాల్పులే వీచవు ఎందుకని!
ప్రేమలో అనుమానాలకి తావేలేదు అందుకని!

వెతుకుతున్నా వియోగాన్ని మించిన భారమేదైనా ఉందేమోనని!
మౌనంగా ఉన్నా దీనికి నాదగ్గర సమాధనం లేదు అందుకని....