గులాబీలమై మనం...


అందమైన గులాబీ మొక్కనొకటి నాటాను
ప్రతిరోజూ నీరుపోసి దాన్ని పెంచాను
పెరుగుతున్న మొక్కని చూసి మురిసాను
మొగ్గ తొడిగినవేళ మదిన ఇట్లు యోచించాను!

అందమైన గులాబీమొగ్గ చుట్టూ ముళ్ళేల
పువ్వు కొరకై ముళ్ళని పోషించనేల??
తలచినదే తడవు నీరుపోయక వదిలేసానల
గులాబీ వికసించకనే నేలవాడుతూ అందిలా!

అందరిలో మంచిని నాతో పోల్చి చూడండి
ప్రేమనే నీరుపోసి మొక్కని పెరగనీయండి
మొక్క మొక్కకూ మొగ్గలు తొడగనీయండి
తప్పులనేవి ముళ్ళై పట్టుకుని వుంటాయండి
ముళ్ళని చూసి మొగ్గలని వాడనీయకండి
అందమైన గులాబీల కొరకై ఎదురుచూడండి
ముళ్ళు గుచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండండి
గులాబీల తోటలో పూలని విరగబూయించండి
అందరి ముఖాల్లో ఆనందాన్ని వికసించనీయండి!

గెలుపు నాదే!

జీవితంలో ముందుకి సాగాలన్న యత్నం
ప్రతిసారీ వెనుకబడిపోయె నా ప్రయత్నం
ఒక్క అడుగు వేయబోయింది నా పాదం
నాలుగడుగులు ముందుకి సాగె జీవనం!

జీవితందే ప్రతిసారీ అవుతుంది విజయం
నాకు దక్కింది ఎల్లప్పుడూ పరాజయం
ఓడిపోయిన నేను చేసాను దరహాసం
అదిచూసి జీవితానికి కలిగెను ఆశ్చర్యం!

జీవితంతో కొన్నేళ్ళిలా సాగింది నా పయనం
ఒకనాడు నన్ను ఇలా అడిగింది జీవితం
ఓటములను చూసిన నీకు రాదేల ధుఃఖం
మది నిట్టూర్పు విడిచింది ఆ క్షణం!

జీవితానికి ఇచ్చాను నేను సమాధానం
ఓరోజు తనకన్నా ముందన్నాను నా గమనం
మృత్యువు వెంట నేనెదిగిపోతాను ఆ దినం
నాకోసం జీవితమా....నీవు చేస్తావు నిరీక్షణం!

జీవితాన్ని చూసి నేను చేస్తాను విజయహాసం
గడచిన కాలాన్ని తలచి సాగిస్తాను ప్రయాణం
మరణించి సాధించాను జీవితంపై విజయం
గెలుపు ఓటముల్లో నవ్వలేకపోయింది జీవితం!

సప్తహృదయ రాగాలు...

ఈ హృదయ రాగాలు, నావి కావు వేరొకరి భావాలు...
కలల బాటసారి కవితాపధం నుండి జాలువారిన పలుకులు...
నా హృదయపధంలో చెరగని ముద్రవేసిన సరాగాలు ...
మీ సహృదయాలను మెప్పిస్తాయేమో చూడాలి ఈ కవితలు!

గతకాలపు జ్ఞాపకాలు
విత్తులే కదా అని ఓ మూలకి విసిరేసా
ఊడలతో సహా పెరిగి
మనసంతా అల్లుకుపోయాయి!

నేనీ జీవితంలో ఒంటరిని
నేను నీ సమక్షంలో సమస్తాన్ని
నేనీ పయనంలో అలసిన ప్రాణాన్ని
నేను నీ తోడులో అలుపెరుగని పయనాన్ని!

మౌనం నీదైనప్పుడు,
నిశబ్దాన్ని మించిన శబ్దం లేదు.
పయనం నాదైనప్పుడు,
నిలకడని మించిన పరుగూ లేదు!

జరిగేదేది జరగక మానదు
జరిగిన దానితో జీవితం ఆగదు
సమాధాన పడకపోతే దారినిండా ముళ్ళే
చిన్ని సూత్రం తెలిస్తే సెలయేటి ఉరవళ్ళే!

నిన్న నీకు ఆద్యంతాన్ని
నేడు ఒట్టి ఏకాంతాన్ని
నిన్నటి పరిచయానికి అపరిచితుడ్ని
నేటి ఏకాంతానికి చిరకాల మిత్రుడ్ని!

రోజూ చూపులు కలిసినా..
గాలితో ఊసులు పంపినా..
చినుకులతో తనువంతా ముద్దాడినా..
కలిసేదుందా నింగీ నేలా యేనాటికైనా??

పువ్వు నవ్వెందుకు చెరపడమని కొమ్మనుండీ తుంచలేదు
చూసీ ఎందుకు తెంచి ముద్దాడలేదని రాలాక తగువాడింది.
చెలికి చింతెలనని నే చితినెంచుకుంటే.........
మరో గూటికి చేరి, తన గొంతుకోసానని తెగడుతోంది!

పెళ్ళి/చావు

పల్లకీలో కూర్చున్నావు నీవు
పాడెపై పడుకోపెట్టారు నన్ను
పూలతో నిన్ను అలంకరించారు
పూలని నాపై పరిచారు.....

అలంకరించుకున్నానీవు
అలంకరించారు నన్ను
నలుగురిలో కూర్చోబెట్టారు
నలుగురు మోసుకెళ్ళారు....

గమ్యంవైపు పయనం నీవు
తుది మజిలీకి చేర్చారు నన్ను
ఆనందంతో కేరింతలు అందరు
రోదనలతో ఇక్కడ కొందరు....

పురోహితుని మంత్రాలు వింటూ నీవు
కాటికాపరి కాలుస్తున్నాడు నన్ను
నిన్ను అక్షింతలతో ఆశీర్వదించారు
నన్ను ఆశ్రువులతో సాగనంపారు....

బంధాలకు బానిసవు నీవు
బంధవిముక్తున్ని చేసారు నన్ను
జీవితం వైపుకి నీది పయనం
నాతోనే అంతం జీవితం....