"తూనికరాళ్ళు"

అంగుళంగుళం అందగత్తెనని
ఆమడ దూరంలోనే ఉంచేసావు
ఆరుగజాల చీర నే చుట్టానని
మూరెడుమల్లెలు తీసుకురానినీవు
జానాబెత్తెడు బట్టకట్టిన దానిని
నెరజాణనంటూ చూసి లొట్టలేసావు
ఇంచు అందాలను తాకి ఆమెని
అప్సరసంటూ అందలమెక్కించావు
చిటికెడు నవ్వుని ప్రేమనుకుని
తబ్బిబై తెగ సంబర పడిపోయావు
లీటరుబీరు పావుశేరు పలావుతిని
నోట్లని లెక్కచేయక గుమ్మరించావు
అడుగడుక్కి రోగం అంటించుకుని
కొండంత ఆస్తి కరిగినాక తిరిగివచ్చావు
ఇప్పుడింక రెండు గజాలైనా చాలని
బారెడంత బాధ్యత నాకు అంటగట్టావు
చివర్లో గుప్పెడంత గుండెలో నేనని
పిడికెడుప్రాణంలో పిడిబాకు దింపావు

(ఇది వ్యసనాలకు బానిసై చరమాంకంలో తిరిగి వచ్చిన భర్త పై భార్య విసిరిన "తూనికరాళ్ళు" )

వ్యధావేదన

కంటపడకుండా బాధను మునిపంటితో నొక్కి
ముసినవ్వుతో ఎదను పిండే వ్యధను దాచేస్తే
ఎగశ్వాసలో ఎగసి పడింది మదిలోతుల సెగ
ముఖం మారింది నవ్వుని ముసుగ్గా కప్పేసి!
వ్యధనణచిన పలుకులు కంటికి తడిగా తగిలి
తనువు తడిసి ఆనందాన్ని అప్పు అడగబోతే 
సంతోషపు స్థిరాస్తుల దస్తావేజులు అడిగింది
లేదన్నానని ముఖం పైనే తలుపేసింది కసిరేసి!

తడారిన గొంతుతో నర్తించమంటూ నవ్వుని కోరి
అలుసైపోయాను తోడురానన్న కన్నీటి ధారకు
గాయమైన గుండెలో రగిలిన సానుభూతి పొగ
ఆరకుండానే తలపు పరిహసించె మరో గాటుచేసి!
దుఃఖం అలవాటైపోయి సంతోషం చుట్టంగా మారి
నవ్వినా ఏడ్చినా కన్నీరు పెట్టని కరగని శిలనైతే
ఆశావాదంతో ముందుకు సాగడానికేం మిగిలింది
నమ్మకమే తియ్యని విషమై కాటేసింది మాటువేసి!

మదికే శిక్ష

కరిగిపోతున్న కల నిందిస్తూ నాతో అంది..
నీవు మనసుకు దగ్గరై కనులకు దూరమని

రాలుతూ తార బింకంగా ముఖం తిప్పుకుంది..
ప్రేమించి వేదన్ని నేనే కోరి కౌగిలించుకున్నానని

కన్నీరు చెంపలపై జారుకుంటూ చర్చల్లోకి దిగింది..
మనసులు ఏకమైతే కళ్ళతో వెతకడం వెర్రితనమని

మనసు మాత్రం మౌనంగా తనలో తానే అనుకుంది..
ప్రేమిస్తే అవయవాలన్నీ కలిపి శిక్షించేది తననే ఎందుకని

కల మరోమారు మేల్కొని మనసుతో మంతనాలు ఆడింది..
అభాంఢమేల తలచినది ఒకటైతే జరిగేదెప్పుడూ మరొకటేనని

వేదనతో శిక్షించబడ్డ మనసు అంబరాన్ని చేరి మరలి వచ్చింది..
వేగంగా వాన వచ్చి పరామర్శించబోయి మనసునే ముంచేసింది
ఎందుకంటే! కన్నీరు తనతో కలిసి కనబడనందుకు కట్టే రుసుమంది!

రాయబారమెందుకు?

చలనంలేని మనసును ప్రణయమంటూ దోచి
ఊపిరున్న ఊహలకు రూపమంటూ ఒకటిచ్చి
కదులుతున్న శ్వాసలో పలికే భావంగా మారి
గాజువంటి మదిని అందమైన అద్దంగా మార్చి
తడబడుతున్న అడుగులకు తోడుగా అడుగేసి
ఆవేశంతో చెలరేగబోయే సుడిగాలిదిశను మార్చి
అలిగికోరితే అందలమైనా అపూర్వంగా అందించి
మధుర ధరహాసమంటూ జ్ఞాపకాలని జతకూర్చి
కలత పడితే కన్నుల్లో దాగిన కన్నీళ్ళను తడిమి
కమ్మని కోయిల పాటలై ఎద ఊయలపై సేదతీర్చి
పంచభూతాల సాక్షిగా ప్రకృతి నీవు ప్రాణం నేనని
నమ్మి వలచిన ఇరుమది సవ్వడులు ఒకటైనప్పుడు

               ప్రణయానికి  పవరున్నప్పుడు...
                               *****
ప్రమాణపరిణయానికి పసుపుతాడు ముళ్ళెందుకు?
గుండె గోడల్లో కొన్నాళ్ళకి తెలియని బీటలెందుకు??
అ చంచలప్రేమను బలపరిచే రాయబారాలెందుకు???

విత్ లవ్ ఫ్రం.......నరకం!

నావెంటపడి వస్తాను అనకు అల్లంత దూరం
అక్కడ నాకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువట
నీదేమో అది చూసి తట్టుకోలేని ప్రేమస్వార్థం
పాపులు పాతచుట్టాలుగా చుట్టూ చేరతారంట
నీకేమో నేనంటే అసలే వల్లమాలిన అభిమానం
వారు పలకరిస్తుంటే నీకు ఒళ్ళంతా పిచ్చమంట
యముడికి కూడా నేనంటే అమితమైన ప్రియం
చిత్రగుప్తునికి చెప్పి నన్ను త్వరగా రప్పించాడట
నాపై ప్రేమతోపాటు తెలివైన నీకు తగనంత ఆవేశం
అందుకే నిన్ను నావెంట ఒద్దని బ్రతిమిలాడుతుంట
నీ శక్తి సామర్ధ్యాలతో ఇక్కడ ఎందుకులే గందరగోళం
భువిలోనే మంచిమనిషిగా పేరు తెచ్చుకోమని అంట
నీ వెంట ఆయువు తీరిన నేను ఉండలేను కలకాలం
చేసిన క్రియానుగుణంగా వేయిస్తాను నీకు స్వర్గబాట!!

షాక్ సరసం

కన్నుగీటి కొంటెగా కోమలిని రమ్మంటే...
మాపటేల సరసం పగటిపూట వలదనెను!
సంధ్యవేళ సరదాపడి నడుముపై గిల్లితే...
సన్నజాజులు విరియలేదంటూ నవ్వెను!
మోజుగా ముద్దాడి కోరి కౌగిలిలో బంధిస్తే...
ఊపిరాడక ఉక్కిరి బిక్కిరై ఎదపై వాలెను!
మనోహరుడిగా మారి మరులు గొలిపితే...
మరో ఏడు జన్మలకు తోడునీడ తాననెను!
ప్రేయసని ప్రియంగా పిలిచి ప్రాణమడిగితే...
ప్రీతిగా పెకిలించి పువ్వుల్లో పెట్టిస్తాననెను!
వేయిరాత్రుల వెన్నెల ఒకేసారి కోరుకుంటే...
ముసిగానవ్వి మన్మధుడికే మతితప్పుననెను!
ఆ మాటవిని సర్రున షాక్ కొట్టి సొమ్మసిల్లితే...
నుదుటిపై ముద్దాడి చాలునా సరసమనడిగెను!

ప్రియమైన శత్రువు


వందనం నా ప్రియమైన శత్రువుకు
అభివందనం ఓ ప్రియతమా నీకు...
జీవితాన్ని మరో కోణంలో చూపించి
లౌక్యాన్ని తెలిపిన నీకు ప్రణామం!!

వందనం నేను మెచ్చిన నా ధ్వేషికి
మనసుని రాతిబండగా చేసిన నీకు...
ఎత్తుకు పైఎత్తు వేసి మంచిచెడునెంచి
లోకంతీరు చూపిన నీకు నమస్కారం!!

వందనం ప్రియాతిప్రియ ప్రత్యర్ధునకు
అంతర్గతంగా కలవర పరచిన నీకు...
కయ్యానికి కాలుదువ్వి కసిని పెంచి
గెలుపేదో నేర్పిన నీకు ఇంకో సలాం!!

వందనం నేను వలచిన నా విరోధికి
నా వ్యక్తిత్వానికి అర్థమడిగిన నీకు...
అస్తిత్వానికి అసలు రంగుని అద్దించి
నన్ను నన్నుగా నిలిపిన నీకు దణ్ణం!!

ఇలా ఎందుకు???

అంతా భగవంతుని అనుగ్రహమే అనుకుంటే
అనురాగ అనుకోని అతిధుల ప్రవేశమెందుకు?

మూసిఉన్న మది చీకటి తలుపులు తట్టి తెరచి
వ్యధ వెలుగునిచ్చి విధిని నింధించడమెందుకు?

నాకు నేనెవరో తెలియక తెగిపడిన తోకచుక్కనైతే
అలజడిని అమాయకంగా జత చేయడమెందుకు?

ప్రేమచమురు ఇంకని దీపమై వెలుగొందుతుంటే
విహరించని వనంలో విశ్రాంతిని కోరడమెందుకు?

ఆశాకిరణాల మేలుకొల్పుతో వగలు విసరనీయకనే
విరియనిమొగ్గపై విరహసెగల వడగాల్పులెందుకు?

మైలురాయిగామారి మార్గబాటలో దారిచూపుతుంటే
బూటక విమర్శల సోపాన మాటల మార్గమెందుకు?

బంగారపు సాలెగూటిలో చిక్కి బంధమేదో తెలియకనే
విశాలగగనంలో వింతబంధపు వలపుయాత్రలెందుకు?