ఏం తెలుసు!

సర్వసంగపరిత్యాగైన సన్యాసికేం తెలుసు
సరసం తెలిసిన జవ్వని సొగసు ఎక్కడుందో

రాతిగుండె వంటి రాక్షసుడికేం తెలుసు
రసికత ఎరిగిన రాగిణి ఆలాపించే రాగమేదో

వరాలు ఇచ్చి వచ్చిన విటుడికేం తెలుసు
వన్నెలాడి వయసు చేసే వింతవిన్యాసమేదో

మొద్దులా మారిన మొరటోడికేం తెలుసు
మొగ్గై ముడుచుకున్న ముదిత మురిపమేదో

పొగరు పొరగప్పిన పోటుగాడికేం తెలుసు
పొగడపువ్వులా పొదవిన పడతి పరిమళమేదో

దొరవోలెకాక దొంగై దోచుకొనేవాడికేం తెలుసు
దోబూచులాడాలనుకున్న దొరసాని సిగ్గుదొంతరేదో

మాయదారి మగాడి మనుగడకేం తెలుసు
మారామంటున్న మగువ మనసులో మర్మమేదో

నేనూ...పతివ్రతనే!

అడుగడుగునా ఆశలే అణగారిపోయి
అంచెలంచెలుగా ఆశయాలే కూలిపోతే
అడ్డుకున్న వారినే అక్కున చేర్చుకుని
ఆహా! ఓహో అన్న నేనూ...పతివ్రతనే!



అడ్డమైన ప్రశ్నలకీ కాదంటూ అవునని
అర్థమైనా కానట్లు అమాయకంగా నవ్వి
అడ్డంగా నిలువుగా తలూపి తైతెక్కలాడి
అబ్బో అమ్మో అంటున్న నేనూ...పతివ్రతనే!



అలై ఎగసిపడుతున్న కోర్కెలకి ఆనకట్టేసి
అనురాగాన్ని కలలోనే కామించి రమించి
అలుసైపోయి అరచేతిలో వైకుంటమే చూసి
అమాయకంగా అవునన్న నేనూ...పతివ్రతనే!



అవసరాల్ని ఆసరాచేసి అందాలని పొగిడి
అదును చూసేసి అదుపు తప్పినవారిని
అతిమంచివారంటూ అందరినీ ప్రేమించిన
అసలుసిసలైన అబలనైన నేనూ...పతివ్రతనే!

అంతరాత్మా..."ఐ లవ్ యూ"

నాలోనే దాగిన స్వార్థ ప్రలోభ ప్రేతాత్మా
నా నుండి నన్ను లాక్కున్న భూతమా
మంత్రమేసి మాయచేసిన మార్జాలమా
పుర్రెలో గుజ్జునే పీక్కుతినెడి పిశాచమా!


నా ఆలోచల్ని ఆత్మలకిచ్చి ఆడుకోమని
నాదేహం పరులకై ప్రేతాత్మగా మారమని
మట్టిలో కలిసి పిండమై కాకినే తినమని
నన్నే మార్చిన నువ్వే ప్రియదెయ్యమని!


నా ఆత్మవే అయినా నిన్ను ఆలింగనమిడి
అసలుసిసలు అందవికారివైనా నే ముద్దిడి
ఆత్మలో ఆత్మనై ఆత్మల నడుమ అడుగిడి
ఎలుగెత్తి అరుస్తా అంతరాత్మా ఐ లవ్ యూ!

సరాగాల వంట

ముద్దుల ముద్దకూర మురిపాలవేపుడు
కమ్మగావండి వయ్యారంతో వేడిగా వడ్డిస్తే..
ఒళ్ళువేడెక్కి జ్వరమొచ్చింది అన్నావురా!

కౌగిళ్ళనే కొనగోటితో కోసి కలగూరగా కలిపి
కడుపసందుగా కవ్వింతలతో అందించబోతే..
కళ్ళున దగ్గితే కంగారులో పొలమారె కదరా!

వలపు వగలనే వడగాచి మసాల దట్టించి
ఇగురు కూరను ఇంపుగా ఆరగించమంటే..
అరగదని చెప్పి ఆయాసపడతావు ఏందిరా!

పులుపు పరువాన్ని పప్పుపులుసుగా పోపేసి
నాజూకు చేతులతో నెయ్యివేసి తినిపించబోతే..
వికారమని వింతాకారాలే చూపుతున్నావురా!

చిక్కటిపాల మదినే గడ్డపెరుగుగా తోడుపెట్టి
అల్లరి ఆవకాయనే నంజుగా అద్దుకోమంటే..
పడిసెమంటూ పట్టెమంచం ఎక్కినావేందిరా!

ఈ విచిత్ర విన్యాసాల చోద్యమేమని ఆరాతీస్తే
వలచినవాడి మనసుదోచ వంటావార్పులేల..
కలువభామను చూసి కడుపునిండెనన్నావురా!

ప్రేమతత్వం

ఆడలేనంటూ గుండె ఆగాగి కొట్టుకుంటే
అడుగులో అడుగేస్తూ వచ్చి ఆపమాకు!

పరుగున వచ్చేసి పొత్తిళ్ళకి హత్తుకుని
నుదుటినే నిమిరేసి సేదతీర్చి వెళ్ళిపోకు!

కొన్నిక్షణాలైనా ఎడబాటు తాపమే ఎరిగి
ఎదభారం మోయలేక మరమనిషివైపోకు!

చెప్పింది వినేసి మౌనమే మందని చెప్పి
నీకంట కన్నీటిని నా కంట కురవనీయకు!

అంతరంగం తెలుసుకోకనే అందాన్ని చూసి
అనురాగబంధమని ముహూర్తం పెట్టమాకు!

ప్రేమేం వానచినుకు కాదు వచ్చిపోవడానికి
శ్వాసగాపీలిస్తే జీవితం ఆగితే అంతం బ్రతుకు!

విముక్తి

అనుభవాలన్నీ పాఠాలు నేర్పి దూరమౌతుంటే
ఆలోచనా విధానమే మారి జీవనగతే మారింది
నేను మాత్రం మారలేక నిన్న రాలిన వేకువనై
సంధ్య వెలుగులో సంతోషాలు వెతుకుంటున్నా!


                       
మనుషులేమారి లోకం మారిందని వెక్కిరిస్తుంటే
కానరాని ఆత్మవంచనే మబ్బులమాటునదాగింది
స్వఛ్ఛహింస సెలయేటిలోకంలో స్నానమాడి శుద్దై
నమ్మకం తగ్గిన నాసిరకపు దారంతో బంధమేస్తున్నా!


                          
నిగ్రహమే నిటారుగోడలా ఒంటరిగా నిలబడుతుంటే
చేయూతనీయలేని సూక్తులు నీతులని బోధించింది
సొమ్మసిల్లిన నిబ్బరాన్ని కన్నీరు చల్లి లేపి బండనై
గుండెగూటిలో దాగిన ఆశయాశలకు విముక్తినిస్తున్నా!

వింత బంధం

ఓ బాబు...బీటు వేసి సైటుకొట్టమంటే
కన్నుకొట్టడమే రాదని కాలరెగరేస్తావు

ఈల వేసి ఇంగితమేదో వివరించమంటే
విజిల్ అంటే ఏమని పజిల్ ఫేస్ పెట్టావు

కూత కూసి కూనీరాగమే తీయమంటే
స్కూల్ ప్రేయర్ పదిసార్లు అప్పజెప్పావు

జీన్స్ ప్యాంట్ తో దూసుకొచ్చేయ్ అంటే
లాల్చీపైజామాలోనే  లవ్వుచేయమన్నావు

మీసకట్టైనా చూసి మురిసిపోదామనుకుంటే
మెలితిరగని మొరటుమీసమని కత్తిరించావు

స్పోట్స్ షూ వేసుకొచ్చెయ్ పారిపోదామంటే
చెప్పులేసుకొచ్చి తప్పని  చెంపలేసుకుంటావు

సిక్స్ ప్యాక్ కండలకై కసరత్తులు చేయమంటే
కండలుఏల మనసుచూసి మోహించమంటావు

ఎంతో అమాయకుడవని అక్కున చేర్చుకుంటే
అయస్కాంతమై అంటుకుని నన్ను వీడకున్నావు

గుప్తజ్ఞానులు

తామరాకుపై నీటిబొట్లు వంటి ఈ పరిచయాలు ఏలనో
పట్టుకుంటే జారిపోతూ ముట్టుకుంటే మాయమైపోయి
మనల్ని మనకు దూరంచేసి మనసునే శత్రువుగా మార్చి
ఏం మిగిల్చావు అంటే....శూన్యంలోకి చూపుడువేలెత్తి చూపి
తెలిసీ అడుగు వేసావు అంటూ ఎగతాళి చేస్తాయి.....ఎందుకో?

తుమ్మితే రాలిపోయే ముక్కు వంటి బంధాలు ఎందుకనో
అవసరాలకి వాడుకుని ఆపైన నక్కి జీవించే నక్కలైపోయి
అంటుకుంటే రాచుకుంటుందని విడిపోతూ మనసుని కాల్చి
కాలీకాలని శవంలా మిగిలుంటే.... తెలిసీ తెలియనట్లు తలూపి
చేసుకున్నవారికి చేసుకున్నంతంటూ ఉపదేశిస్తారు......ఎందుకో?

తెరవెనుక దాగి ముసుగుతీసి మంచివాళ్ళుగా నటించనేలనో
తనువుని కోరుతూ మనసిచ్చానని మాటల్లోనే తడబడిపోయి
వ్యామోహమంటే వెసులుబాటుకాదని ప్రేమంటూ దాన్ని మార్చి
కోరికల గాలమేదో విసిరేసావు అంటే.....విచిత్ర విన్యాసాలెన్నో చేసి
గోచరించని గొప్పగమ్యం ఇదంటూ చెప్పే గుప్తజ్ఞానులు......ఎందుకో? 

అక్షర చుంబనం

ఉత్తమోత్తమ అక్షరాలతో లోకాన్ని ఉద్దరిద్దామంటే
నాలోని భావాలు పక్కున నవ్వి పరిహసించాయి...
పదిమందికి చెప్పే పాండిత్యం నీదా అని ప్రశ్నించె!?

సంఘాన్ని సంస్కరించే సరళపదాలు రాద్దామంటే
నా భావసంఘర్షణలు అక్షరరూపం దాల్చమన్నాయి
నిన్నునీవు సాంత్వనపడి సంఘాన్ని శాసించమనె!?

స్ఫూర్తితో రాయాలని ధీమాగా దూసుకెళదామంటే
నాలోని పిరికితనం పనికిరాని బ్రహ్మాస్త్రాలేలన్నాయి
చేతకానితనం ఎవరిదంటూ పదాలు పంజా చూపించె!

దిగులుతో డీలాపడిన మనసు దిక్కులు చూస్తుంటే
నా కోపాహంకారాలు  ఉండనంటూ ఎగిరిపోయాయి
విజ్ఞత మాత్రం వివేకంతో అడుగేయమని సూచించె!

విధేయతతో తెలిసింది వివరణగా విన్నవిద్దామంటే
నాలోని ప్రేమగుణాలు నను వీడనని మారాంచేసాయి
ప్రేమపంచమని ముస్తాబైనక్షరాలు నాచేయి చుంబించె!
  

మన ప్రణయం

మన ప్రణయాన్ని చూసి పారిజాతాలే పరవశించి...
ప్రవరాఖ్యుడికి పాఠాలు నేర్పమని ప్రాధేయపడ్డాయి!

సిగ్గుపడ్డ చెక్కిళ్ళని చూసి మందారానికే మతితప్పి...
చాటుగా నక్కిన నారదుడినే ముద్దు ఇమ్మనడిగింది!

మల్లెపూలు మత్తెక్కి మెలికలు తిరిగి మైమరచి...
మంటలురేపమాకని మన్మధుడిని మందలించాయి!

పొదివిపట్టుకున్న చేతుల్ని పొగడపూమాల చూసి...
బ్రహ్మను బ్రతిమిలాడి సొగసులీయమని పోరుపెట్టింది!

చిలిపిసరాగాలని చిత్రంగా చిట్టిచేమంతులు గాంచి...
సోయగాల చిరునామా ఏదని చితగుప్తుడ్ని కోరాయి!

ఊసులన్నీ విని ఉడుక్కున్న ఉమ్మెత్త ఉసురుపెట్టి...
పక్షపాతని పరమశివుడ్నే పరుషమాటలు పలికింది!

గడియలే క్షణాలని గాబరాపడ్డ గన్నేర్లు పెదవి విరచి...
ప్రేమ పొందాలన్నా పెట్టిపుట్టాలని భక్తితో ప్రార్ధించాయి!

మనం ఏకమైన దృశ్యాన్ని చూసి నందివర్ధనం నవ్వి...
ఇచ్చిపుచ్చుకునేది ప్రేమని కృష్ణుడ్ని క్రీగంట చూసింది!


నాకు నచ్చేసాడు

వీడెందుకో నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసాడు...
పుచ్చిన సచ్చు ఆలోచనలు లేని రానివాడు
భయపడితే పళ్ళికిలిస్తూ నాతో ఆడుకుంటాడు!

ఏ దాహం తీర్చమని నన్ను అడగలేని వాడు...
లవ్వంటూ జివ్వుమని లొట్టలేస్తూ జుర్రుకోలేడు
అన్నిటికీ ఒకే భావం చూపి నా మదిని దోచాడు!

వీడు అగ్గిలో బూడిదై మనసంటూ లేనివాడు..
మనస్సాక్షంటూ బాసలుచేసి బంధం వీడిపోడు
ఖాళీపుర్రెతో నన్నేమెచ్చి నాకేనచ్చిన హీరో వీడు!

అందుకేనేమో వీడు నాకు భలేగా నచ్చేసాడు...
మూడుముళ్ళంటే మూడార్లు నెత్తిన చూపుతాడు
తిట్టినా మొట్టిన గాలిలో తిరుగుతూ నా వెంట వస్తాడు!

ముగ్ధమనసు

ప్రేమను చెప్పలేక ప్రేమలేఖ రాయబోతే
అక్షరాలే అలిగి నా గుండె భారమైనట్లు
పరిసరాలు పరవశించి పరిహసించినట్లు
నెమళ్ళు నాట్యమాడి న్యాయం చెప్పినట్లు 
వనమే వగలాడిని అని వత్తాసు పలికినట్లు!

తడారని తలపులతో నిన్ను పలకరించబోతే
పదాలే పెదవిదాటక మాటలే దిగమింగినట్లు
అరమోడ్పు కనులు సైతం నీస్పర్శ కోరినట్లు
మత్తెక్కిన మల్లెలే నిన్ను పిలవమనన్నట్లు
జారినపైట జాణతనమేమాయనని అడిగినట్లు!

బిగుసుకున్న బిడియమే విడిచి నిను చేరబోతే
అందియలే అల్లరిచేస్తూ నన్ను వెక్కిరిస్తున్నట్లు
ఎరుపెక్కిన చెక్కిళ్ళను చూసి గోరింట అలిగినట్లు
సిగ్గు దొంతర్లు సైయంటూ మచ్చిక చేసుకున్నట్లు
అడుగు తడబడి ఆడతనమేదో ఆగిపొమ్మన్నట్లు!

నువ్వు నాలోనే ఉన్నావన్న భరోసాతో తోడుకోరితే
గిలిగింతలే పెట్టి గోముగా ముద్దులెన్నో అడిగినట్లు
అందమైన మాయలో హత్తుకుని అత్తర్లు చల్లినట్లు
మైమరపులే పులకరింతై పరవళ్ళతో పెనవేసినట్లు
మనోహరమొంది ముగ్ధమనసు మూగబోయినట్లు!

ఇది అదేనా!!


ప్రేమ! ప్రేమంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరిచి....
ఎదురుగా ఉంటే చెవిలో చిన్న మాటైనా చెప్పవు!

ఊహల విహంగంలో స్వర్గపుటంచులనే చూపించి...
సరసన చేరి సుతారంగా చేయి అయినా నొక్కవు!

అందాలరాశినంటూ అక్షరాల్లో అనేకసార్లు మెచ్చి...
ఒంటరిగా ఉన్నవేళ ఓరకంట చూసి ఒడిచేర్చుకోవు!

ఎదలో ఎగసిపడుతున్న కోరికలన్నింటినీ అణిచి...
నింధించబోయిన నిగ్రహాన్ని నిద్రపుచ్చి నిలబడ్డావు!

ఇది అదేనా! అని అడిగిన నా కంటనీరును గాంచి...
అడిగిన ప్రశ్నకి జవాబుగా అక్కున చేర్చుకున్నావు!

వీడ్కోలుచెప్పి వెళుతూ నీ గుండెల్లో గుడికట్టి కొలిచి...
నన్ను నీ దేవేరిగా కొలువు ఉండి పొమ్మని అంటావు!

అనిశ్చలం


గుండె గాయమే చేసి గమ్యాన్నే మార్చేసి
మరువలేని మనసును మభ్యపెట్టుకుంటే
మారిపోయానని మంచీ చెడూ తెలిసెనని
తిరిగివచ్చి తలవాల్చి సేద తీర్చమనంటే
గడచిన గంటలు కొన్నైన తిరిగి వచ్చునా!!
మనసుకైన గాయపుమరక మాయమగునా?



ఆశలసౌధాలనే అణచి ఆశయాన్ని ముంచేసి
జీవితాశయమే లేకుండా జీవశ్ఛవమై బ్రతికుంటే
చెట్టువేర్లకే చెదలడితే నీరుపెట్టి  చైతన్యమొచ్చెనని
చెలిమి అంటూ చెంతకుజేరి చేరదీయరాదా అంటే
నేలపై రాలిపోయిన ఆకులు చెట్టెక్కి చిగురించునా!!
చిరిగిన జీవితం క్రొత్తకాంతులతో చిందులు వేయునా?



సరైన అవగాహన కరువై సాహసమని సర్కస్ చేసి
బోర్లాపడి బొక్కలిరిగి బొడిపకట్టినాక బుద్దిమంతులంటే
తెలివి తెల్లారిపోయినాక తీర్పు చెప్పినట్లు ఉందనుకుని
శిక్ష అని గాలిలోన తాడుకట్టి ఉరితీసి ఉత్సవమనుకుంటే
జాగ్రత్తలే చెప్పి జీవించమన్నా, జరిగేది జరగక ఆగునా!!
కాలమే తీరిపోతే, జీవితం కడదేరక ముందుకి సాగునా?

లోహంలో లోకం...

ఈ ఇత్తడి లోకాన్ని పుత్తడిగా మార్చాలని
కంచు కంఠంతో అరిచాను కీచు కీచుమని!
బడాయిచాలించు బంగారానికి భద్రతేలేదని
చిలుము పట్టిన ఇత్తడి చిద్విలాసంగా నవ్వె!

వెసులుబాటుకైనా వెండి వలె మెరిసిపొమ్మని
రాని రాగి రాగమే ఆలాపించా మారిపొమ్మని!
విలువలేని వాటిపై కాంస్య కారుణ్యం కూడదని
పాపమైనా పర్వాలేదు ప్లాటీనంలా ప్రాకుతాననె!

తుప్పుపట్టిన ఇనుము నయం తురాయి ఏలని
బుజ్జగించా స్టెయిన్లెస్ స్టీల్ లా తళతళలాడమని!
క్రోమియంలా కోప్పడె తుత్తునాగము సూక్తులని
తెలివిలేనివాడితో తల్లి తర్కిస్తే టైటానియం తిట్టనె!

ఇంగితం లోపిస్తే ఇరిడియం యురేనియం అగునని
మూర్ఖుడికి పసుపుబంగారం మెగ్నీషియా మెరుగని
సీసము కదాని సర్దుకుంటే పాదరసమైనా పొంగునని
మనిషి పుట్టగతికి మట్టియే మాగొప్ప  లోహమైపోయె!



_/\_లోకం తీరును లోహాలతో పోల్చి చేసిన ఈ ప్రయత్నంలో దొర్లిన లోపాలని సహృదయంతో స్వీకరిస్తారని....పద్మార్పిత _/\_

ప్రేమిద్దామంటే...

ప్రేమిద్దామంటే ప్రేతాత్మలే కరువైపోయి

నాకు నచ్చిన దెయ్యమే కనబడలేదు!

ఆత్మలన్నీ ఆర్టిఫిషల్ గా అరుస్తుంటే...

పిశాచాలన్నీ పిచ్చిగా వాగుతున్నాయి!

అనుబంధం ఆమడదూరంలో అగుపిస్తూ

అడుగులు వెనక్కిపడుతూ అందనన్నాయి!

పున్నమినాటి బాసలు అమావాస్యతో చేరి...

ప్రేమను పంచలేని పనికిరాని ప్రేలాపనలు చేస్తూ

తలక్రిందులుగా మర్రిచెట్టు ఊడలట్టుకు ఊగుతుంటే...

ఆత్మల్లోని నగ్నత్వమే కనపడక కెవ్వుమని అరవలేక

అంతరాత్మని అదమనిదే అబాసుపాలని కప్పెడుతున్నా!

వ్యక్తీకరణం

తడవకోమారు తలపుకురాకు..
పొలమారితే పులకరింతనుకోకు!

చిరుగాలివై చిలిపిగా గిల్లమాకు..
మెలికలు తిరిగితే గిలిగింతనుకోకు!

గడియకోసారి గుండెను గుచ్చకు..
తనువు తిమ్మిరెక్కితే తిక్కనుకోకు!

తుంటరి తుమ్మెదవై జడిపించమాకు..
తృళ్ళిపడి తుమ్మితే శకునమనుకోకు!

కంటికెదురుగ కనపడక కలలోకిరాకు..
కస్సుబుస్సులాడితే కలవరింతనుకోకు!

వేళకానివేళ వెనకమాటుగా హత్తుకోకు..
వెక్కిళ్ళు ఎందుకంటూ వెక్కిరించమాకు!

మనసుదోచి ముగిసెనని సంబరపడిపోకు..
మరుపన్నది మనిషికి వరమని మరువకు!

ముద్దు మతలబు



ముద్దు ముద్దుకీ ఒక మతలబు ఉంది..
ప్రతి ముద్దుకీ హద్దే కాదు అర్థం ఉంది...

ఎప్పటికీ నువ్వు నా సొంతం అంటుంది
నుదిటిపై నున్నని పెదవి అద్దిన ముద్దు!

శృంగారాన్నే శృతి చేసుకోమని నవ్వింది
చెవిపై చిందులు వేస్తున్న చిలిపి ముద్దు!

నువ్వంటే నాకెంతో ఆరాధన అంటుంది
చేతిపై సాక్షిసంతకం అద్దిన చిరు ముద్దు!

నాకునువ్వు నీకునేను ఒకరికొకరమంది
మెడవంపున మారాంచేసే గారాల ముద్దు!

కష్టమో నష్టమో నువ్వు నాకు కావాలంది
భుజంపై వాలి భేషజాలు వదిలేసిన ముద్దు!

"ఐ లవ్ యు" అని లిపిలేని భాషలో అంది
పెదవులు పెదవులని పెనవేసుకున్న ముద్దు!

అందమైన ఆలు


ఆలుగడ్డ (బంగాళాదుంప) ఒకరోజు బెండకాయకి ఫోన్ చేసి "ఐ లవ్ యు" అంది.
ఇది విని బెరుకులేని బెండకాయ....అబ్బో! నీకు అంత సీన్ లేదు, ఒక ఫిగర్ లేదు, బండలా గుండ్రంగా ఉంటావు. అందరికీ అందుబాటులో దొరికే చౌకరకం నీవు. నీకు నాలాంటి నాజూకుదే కావాల్సి వచ్చిందా అంటూ చెడామడా తిట్టేసింది.
ఆలుగడ్డ అహం దెబ్బతిని, మనసు గట్టిచేసుకుని మెత్తని మాటలతో కనబడిన కూరగాయని పలకరించి మచ్చిక చేసుకుని కలిసి మెలగసాగింది.
దీని పర్యవసానమేంటో ప్రస్తుతం మనం కలిపి వండుకుని తింటున్న కూరల కాంబినేషన్ చూస్తే తెలుస్తుంది.
ఇవి కొన్ని:-
ఆలు-కాలీప్లవర్
ఆలు-మటర్(బఠాణీ)
ఆలు-మెంతికూర
ఆలు-వంకాయ
ఆలు- టమాటా
ఆలు-పాలకూర
ఇలా ఆలుగడ్డ కూరగాలన్నింటికీ చేదోడుగా కలిసి తల్లో నాలుకలా మెలుగుతూ ఆలు లేని ఆహారం అంధకారం అన్నట్లుగా పేరు తెచ్చుకుంది.
బెండకాయ సంగతి ఏంటి అని మీరు అడగక పోయినా విషయాన్ని పూర్తిగా చెప్పాలి కనుక చెబుతున్నాను....ఏముంది నాజుకు నయగారం కూరగారాల బెండకాయ ఏది కలిసినా జిగురు అంటి...ఛీ  ఛీ అంటూ చీదరించుకునేలా మారి ఒంటిగానే మిగిలిపోయింది....ఇదీ సంగతి! :-)

మరి నీతి సంగతి :-).....వద్దు...వద్దు ...వద్దంటారా!
వద్దనుకునే వాళ్ళు చదవకండి....ప్లీజ్ ప్లీజ్!
బెండకాయ నీతి:-
1. ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి
2. అందముందని అహంకారానికి పోరాదు.
ఆలుగడ్డ నీతి :-
1. నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది.

నిస్వార్థ జీవి

ఈ తోడేళ్ళ లోకంలో తోడెవ్వరని తొంగి చూస్తే
ఇంతందమైన లోకం వేరేదీలేదు అనిపించింది
అందుకే వాటితోటిదే సావాసమని చేయికలిపి
గర్జించే పులికన్నా చొంగకార్చే తోడేలే మిన్నని
కోరికేదో కోరమని దాని కుటీరాన్నే ఆశ్రయించా..

తొలుత తోడు-నీడ అవుతానని తోకూపిన తోడేలు
తొందరపాటేనని తెలివిగా తనని తానే తిట్టుకుంది
అందినంత జుర్రుకుని గుట్టు చప్పుడేలని జారుకుని
వాసనమరిగి మరునాడు మరల మభ్యపెట్ట చూసె
అనుభూతులే అనుభవమైతే వద్దని మొరాయించా..

మరోమారు మరువలేనంటూ కొత్త అస్త్రం చేతబూని
జిత్తులగారాలే వలపుబాటని వల్లిస్తే మనసే నవ్వింది
తొణకని నిబ్బరం చూసి వణికిన తోడేలు తోకముడిచి
సంధి బాసలే చేసి జామురేతిరి సరసమంటూ దరిచేరె
సర్దుబాటే సరైనది అనుకుని ఆశలచాపనే పక్కపరిచా.

చివరికి మంత్రమేసి తోడేలుని మనిషిగా మార్చబోవ
మాయపొరలు కరిగించి జీవితసత్యమేదో భోధించింది
మార్చడమేల మర్మం తెలుసుకుని మనం మారాలని
మృగమైనాసరే ఎవరి అవసరం వారినే సమర్ధించునని
స్వార్థంలేనిప్రాణిని బ్రతికిఉండగా చూడలేనని గ్రహించా..

జ్ఞాపకాలని వీడిపో

కంటికెదురుగా ఉంటే నీవు తలుచుకోవని
దూరమైతే రోజంతా నీ తలపుల్లో నేనేనని
తెలిసికూడా తడి ఆరని తపన ఏలనోమరి!!

నన్ను తలవక నిదురించే అలవాటు నీకు
నిన్ను వీడి శాస్వితంగా నేను నిదురపోతే
నీవు నిదురనే ఛీదరిస్తావన్న బెంగ నాకు!!

లాభం లేకనే నీ జ్ఞాపకాల వ్యాపారమే చేసి
తలచి తలచి నిన్ను నేను అలసిపోయాను
ఇకపై నీ తలపుల్లో నేను ఉండిపోతానుమరి!!

కన్నీటికి కారణం తెలిసి వెతుకుతావెందుకో
కంటినిండా నిన్ను చూసుకోమని కోరతావు
కనులనిండా నీటితో నీవు కానరాకున్నావు!!

నీ జ్ఞాపకాలో లేక నేను అణచుకున్న వలపో
ఉండుండి కొట్టుకునే గుండెని మెలిపెడుతుంది
నా వ్యసనమైన తలపునైనా వీడిపోరాదామరి!!

నా సామ్రాజ్యం



నా అక్షరాల అభిమాన ఆత్మీయులారా!......నేను నేనే
దయచేసి వాటిలో నన్నెతకబోయి మీరు కనుమరుగై
నా అస్థిత్వానికి మసినిరాసి మాయచేసి, మీరు బానిసై
పదాల్లో నా ప్రాత్రకి ప్రాధాన్యతిచ్చి నన్ను నిర్ధేసించకండి!

నా హృదయ సామ్రాజ్య రాజు రాణి మంత్రీ బంటూ నేనే
సామంతుల స్వార్థచెలిమికి సమయస్ఫూర్తి సరిహద్దునై
నా పరిమితులు దాటకనే అహాన్ని అణచే స్థైర్య ఖడ్గమై
రక్షించుకున్న అరమరికలెరుగని లోకమిది అడుగిడండి!

నా రచనావనంలో విరిసీవిరియని భావపుష్పాలన్నీ నేనే
మిమ్మలరించే పరిమళపుష్పాలందించాలనుకునే కంచెనై
నా దయనిర్దయ తూనికలతో తులాభారమేసే తోటమాలినై
పర్యవేక్షించిన పదాలసంపద ఏదని ప్రశ్నించక పరికించండి!

నా పుట్టుపూర్వోత్తర గత ప్రస్తుత భవిష్యత్తు భరోసా నేనే
ఆశలాంబర అంచునైనా తాకాలనుకునే కలల కౌముదినై
నా ఆశయకొలను ఎదురీదుతున్న పదపద్మాలే లోకమై
నీట వెన్నెలఛాయతో ఆటాడుకునే వెన్నెల్లో ఆడపిల్లనండి!