పిడికెడు హృదయం

నా పిడికెడంత మనసుకు ఎందుకిన్ని ఊహలో!!
ఆశల ఊగిసలాటలో ఎందుకు ఈ తర్జన బర్జనలో
సమస్యల సుడిగుండాలు వద్దంటూ వెన్నెల్ని కోరి
వేడిసెగ నిట్టూర్పులతో అణగారిన ఆవేశం చెంతజేరి
వేదనపడినా వెర్రిమోములో కనబడని మదిచారలో
తోడున్నామని రాలిపోతున్న మరిన్ని కన్నీటిధారలో..

నా గుప్పెడంత గుండెకు ఎందుకిన్ని భావావేశాలో!!
అనురాగానికై ఎందుకు ఈ అనుబంధ ఆటుపోటులో
నేనున్నా అని నిండుగా నమ్మించేవారి నీడకై వేసారి
విశ్వాసమే వమ్మైనప్పుడు అగాధపు అంచుల్లోకి జారి
అందించిన ప్రతి హస్తం తాకి ఆప్యాయత అన్వేషణలో
ఎదురైన ఎదకి చేరువై ఎందుకిలా రాటుదేలిపోవడాలో..

నా చిన్ని హృదయానికి వద్దన్నా ఎందుకిన్ని గాయాలో!!
ఆవేశం అణుచుకోలేక భగభగ మంటున్న మదికుంపటిలో
భాషకి అందని భావాలకౌగిలిలో మాటరాని మౌనంగా మారి
ముందడుగు వేయబోతే బ్రతుకులో కనబడకున్నది ఏ దారి
అందుకే కోర్కెలకు సంకెళ్ళువేసి బంధించా హృదిచెరసాలలో
ఒంటరినై ఎదురీది సాగిపోక తప్పదు జీవన ప్రయాణంలో...

58 comments:

  1. పకడ్బందీ కవిత్వ నిర్మాణంతో మీ బ్లాగ్ బంధీని చేసేశారు.

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానానికి నేను బంధీని కానీ మీరెవరో తెయకుండా ఏం బంధించను :-)

      Delete
  2. పద్మార్పిత పిడికిలి హృదయానికి వంగి వంగి సలాములు
    ప్రేమామృతమయి నీకు అభినందనలు

    ReplyDelete
    Replies
    1. సలాం చెప్పి సన్నగా జారుకోకండి :-)

      Delete
  3. కొత్త సంవత్సరం కొంచెం కొత్తగా కదం తొక్కారు సరే, ఇలా పాత వేదనతోనే మమ్మల్ని ఏడిపించాలా? ఎప్పుడూ ఇలా ఏడుపుగొట్టు కవితలు.. :-) :-(

    ReplyDelete
    Replies
    1. వినోద్గారు తప్పుగా అనుకోకండి, వేదనకి పాతా కొత్తా అంటూ ఏముంటుంది. మనిషి అన్నాక వేదన తప్పదు. వేదన అనుభవించిన వారిలో ఆత్మస్థైర్యం మెండు. పద్మార్పిత అలాంటి అంచులన్నీ దాటి వచ్చిన అనుభశాలని ఆమె భావాల ద్వారా మనకి అర్థమౌతుంది. మీరు కేవలం ఆ వేదనలో రోదననే చదివారనుకుంటాను అందులో ఆమె అందించిన ప్రేరణ చూసి ఉండరు. ఆమె అక్షరాల్లో మాకు స్వాంతన పొంది సేద తీరడం అలవాటైపోయింది. అందుకే మీరు ఎప్పుడూ ఏడుపుగొట్టు కవితలేనా అన్న మాటలు ఇబ్బందిగా అనిపించాయి- హరినాధ్

      Delete
    2. వినోద్ గారు...కొత్తగా కదం తొక్కాను అంటే ఖుష్ అయ్యేంతలోపులోనే ఏడిపించాను అని నవ్వే మీ మోము ఏడిస్తే ఎలా? :-) నేను ఏడ్చేలా రాసినా నవ్వేయండి

      Delete
    3. హరినాధ్ గారు.... నాలోని ఆత్మస్థైర్యానికి మీ అందరి అండ అన్న ధీమాయే కానీ నేనూ పిరికిదాన్నే......నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి.

      Delete
  4. పద్మార్పితగారు 2014 లో మొదటి కవిత వేదనే అయినా చక్కగా పండించారు. అయినా మీరు మాత్రమే వ్యధని కూడా ప్రేమించేలా రాయగలరు. మేము ఆ అనుభూతిని పొందగలము.

    ReplyDelete
    Replies
    1. వేదనలో భావాంకురార్పణ ఏపుగా ఎదుగుతుందేమో యోహంత్.....కన్నీటితో తడుస్తుంది కదా :-)

      Delete
  5. madam thank you new poem rasinaduku. chala bagundi dont stop write 100 poems this year.

    ReplyDelete
  6. అర్పిత మీరు మా ప్రేరణ ఎవరు ఏమనుకున్న మీరు చెక్కు చెదరక మీరు అనుకున్నది వ్రాసేయ్యండి. అక్షరం రాని వాళ్ళకి కూడా అర్థమయ్యేలా మీరే వ్రాయగలరు. వేదనలోను వింత అనుభూతిని మీరే వివరించగలరు. కుడోస్

    ReplyDelete
    Replies
    1. ఆకాంక్ష.....ఎవరో ఏదో అనుకుంటారని ఎవరికోసమో మాత్రం రాయను. నాలో కలిగే భావాలకి దర్పణం నా బ్లాగ్.

      Delete
  7. ప్రేమించడం ఎందుకో!!!???????
    ఇలా వేదనంటూ లభో దిబో అనడం ఎందుకో అస్సలు అర్థం కాదు నాకు

    ReplyDelete
    Replies
    1. ఇలా అదెందుకో ఇదెందుకో అనుకుంటే అసలు జీవించడం ఎందుకో అన్న ప్రశ్న ముందుగా వస్తుందండి:-)

      Delete
  8. ఏం కామెంట్ పెట్టాలో కూడా అర్ధం కావడం లేదు. మనసుతో రాస్తే బహుశా ఇలాంటి పదాలు వస్తాయేమో.
    మీ హృదిచెరశాలలో బందీ అయిన ఈ బరువైన పదాలకు ఒంటరితనాన్నిచ్చి... మరింత బరువెక్కించారు. వాటి బరువుని కొంచెమైన దింపే సాంత్వననిస్తే బాగుండేది. మీ పదాల బందిఖానాలో భావావేశాలను అక్షరాలుగా చిత్రించింది... కన్నీటి సిరానా.. అనిపిస్తుంది ఒక్కోసారి. ఇంత కన్నా రాయలేకపోతున్నాను. బాగుంది.. చాలా బాగుంది.. ఇలాంటి కామెంట్ల నుంచి... విశ్లేషించే స్థాయికి మీ అక్షరభావాలు ఎదిగిపోయాయని నేను భావిస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. Exactly Sateesh Garu:-) Same feeling:-)

      Delete
    2. సతీష్ గారు ఏం కామెంటాలో అర్థం కావడంలేదు...అక్షరాలకి అందనంత ఎత్తుకి ఎదిగాను అని నన్ను ఎత్తి పడేయకండి. నేను ఎప్పుడూ ప్రైమరీ సెక్షన్ విద్యార్ధినే......

      Delete
    3. Sruti same to same ani nannu vadileyaku :-)

      Delete
  9. మీ భావాల కౌగిలిలో ఉక్కిరిబిక్కిరవుతూ.. గుప్పెడంత హృదయంలో ఆకాశమంత ఆశల పందిరిలో ఇన్నిన్ని భావ సంఘర్షణలతో ఒంటరిగా పయనం సాగిస్తా అన్న ఆత్మస్థైర్య వాక్యం కవితకు ప్రాణం పోసింది. చిత్రం అందుకు తగ్గట్టుగా సమాయత్తమవుతున్నట్టు అమరింది. కానీ ఇంత మంది అభిమాన స్నేహ హస్తాలుండగా మీరు ఒంటరి కాదు కదా..:-) Padma Arpita గారు.. అక్షర సుమాలతో.....

    ReplyDelete
    Replies
    1. భావాలలో ఒంటరినే కాని జీవితంలో ఒంటరినెలా అవుతానండి మీరందరూ ఉండగా....:-)

      Delete
  10. గుప్పెడంత గుండె అని ఎవరన్నారూ? డాక్టర్స్ కి తెలీదు , సముద్రమంత హృదయం అని కవులంటారు,
    అందుకే అన్ని ఆటు,పోట్లు, పర్వాలేదు ఎదురీదే దైర్యం మీకుంది (భావాలకు), మిమ్ము ఒడ్డుకు చేర్చే పూచూ నాది.(పదిలంగా పూలపడవనై.:-))
    బాగుందమ్మా...మంచి భావాలు ఎప్పటిలాగే.

    ReplyDelete
    Replies
    1. కవయిత్రిగా మీరు స్ఫూర్తినీ, పూచీనీ ఇచ్చారు ఇంక గుప్పెడంత గుండె వ్యధలనే కాదు గుండ్రాయినైనా ఎత్తేస్తానుగా :-)

      Delete
  11. మది ఊహలు, కనుల బాసలు, ఎద భావనల అవేశాలు, గుప్పెడంత గుండెకు భద్రం గా ఉన్నా ఎందుకిన్ని గాయాలో .... అంటూ
    చిక్కని హృదయరాగం కవిత
    చాలా బాగుంది.
    అభినందనలు పద్మార్పిత గారు!

    ReplyDelete
    Replies
    1. చిక్కని భావాలని చక్కని హృదయరాగమని అభినందించిన మీకు నెనర్లండి.

      Delete
  12. అదేమిటి పద్మార్పితా ...
    నూతన సంవత్సరంలో " ఇదేదో" రాసి
    అందరినీ "అదేదో" చేస్తావనుకుంటే , బారంగా రాసి మనసంతటినీ మసక బార్చావ్ !

    "భాషకి అందని భావాలకౌగిలిలో మాటరాని మౌనంగా మారి
    ముందడుగు వేయబోతే బ్రతుకులో కనబడకున్నది ఏ దారి
    అందుకే కోర్కెలకు సంకెళ్ళువేసి బంధించా హృదిచెరసాలలో
    ఒంటరినై ఎదురీది సాగిపోక తప్పదు జీవన ప్రయాణంలో..."

    మీ కవిత ఎంతో బాగుంది.
    భారంగా ఉన్నా భావోద్వేగంలో బయటకొచ్చిన ఆ నాలుగు వ్యాక్యాలు చాలవా షడ్రుచులను పంచడానికి. వేదన ఎంత చేదుగా ఉన్నా - అదే చెదు ఓ మంచి తీపి గురుతుని అందిస్తుంది . చేదు జ్ఞాపకాలు ఉంటేనే కదా తీపి దనంకు ఓ ప్రత్యేకత. ఆ రెండూ సమాంతరంగా కాకుండా, సమన్వయంతో కలసి పయనిస్తే - ఇలా భారమైన భావాలు రావేమో కదా ! మొదట మనసు కాస్తా మొద్దు బారినా క్రమేనా సడలించుకుందిలెండి .
    శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. అసలు ఏం వ్రాయొద్దు అనుకుంటూ ఏదేదో రాస్తే.....మెత్తగా తలనిమిరి మొట్టికాయ వేసినట్లున్నా మీ స్పందన నచ్చేసిందిలెండి :-)

      Delete
  13. Well I don't have any words. బాదను కుడా ఇంత అందంగా అక్షరాలతో బంధించగలిగే శక్తి మీకు మాత్రమే ఉంది:-) 2014లో బహు చక్కని కవితను అందించరు:-) Thank Q Padmarpita garu:-)

    ReplyDelete
    Replies
    1. Thank you ,భాధను ఎలా అందించినా భావుకత్వంతో ఆస్వాధించే మంచి మనసు శృతిది అందుకే....:-)

      Delete
  14. పిడికెడు హృదయమే నీదైనా అందులో కడలి కెరటాలన్ని అధ్భుతమైన భావాలు. అవి అందరి మనసులకీ ఉత్ప్రేరితాలు. ఏ భావమైనా నీకు దాసోహమై చివరికి నీ నిర్ణయానికే కట్టుబడి ఉండేలా మలిచే చాకచక్యం ఉంది నీవు రాసే అక్షరాలకి మరియు నీవు అద్దే రంగులకి. నీ కవితల్లో నచ్చేది నీవు ఇచ్చే అందమైన ముగింపు. అందుకే అందరి మదిని దోచేస్తావు అనిపిస్తుంది. చిరకాలం ఏఅ ఒడిదుడుకులు లేకుండా ఆనందంగా ఉండు అర్పితా-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. మీ అభిమాన ఆశిస్సులూ సదా కోరుకుంటూ వందనం _/\_

      Delete
  15. పద్మగారు మీ భావాలకి ఎవరు ప్రేరణో తెలీదు కానీ మేము మాత్రం మీ అక్షర భావాలకి దాసోహం అవి విరహమైనా, వేదనైనా, హాస్యమైనా, ప్రేమైనా, కసిరినా, తిట్టినా, అలిగినా, మరింకేదైనా :-)

    ReplyDelete
    Replies
    1. అమ్మో ఇన్ని భావావేశాలూ తెలుగమ్మాయి మీద చూపించడం సాధ్యమా :-)

      Delete
  16. Arpitaji this poem is little bit difficult to access your status. But no doubt that you are inspiration to many people. Keep on writing memsab*Nalottam*

    ReplyDelete
    Replies
    1. Nalottam ji.....emotions are always hard to understand i think. Thanks for you comments.

      Delete
  17. నాది అన్న భావన రాగానే .....అన్నీ సుడిగుండాలే , అన్నీ సునామీలే , అన్నీ ప్రళయాలే.....పద్మార్పితగారు...అయినా మన మనసు మన మాట వినదు కనుక తప్పదు మనమే భరించాలి మౌనంగా .

    ReplyDelete
    Replies
    1. అంతే భరించక తప్పదుగా.....సుడిగుండమైనా , సునామీ అయినా :-)

      Delete
  18. విశ్వాసమే వమ్మైనప్పుడు అగాధపు అంచుల్లోకి జారి
    అందించిన ప్రతి హస్తం తాకి ఆప్యాయత అన్వేషణలో
    ఎదురైన ఎదకి చేరువై ఎందుకిలా రాటుదేలిపోవడాలో
    ఇలా ప్రతి ఆటుపోట్లలోను ఎంతో కొంత నేర్చుకోబట్టే ఈ స్థాయికి చేరుకో గలిగారు మీరు.
    కవిత చాలాబాగుంది పద్మా

    ReplyDelete
    Replies
    1. మహీ మీతో పాటే నేను కూడా ఎదుగుతున్నాను కదా :-)

      Delete
  19. పిడికెడంత హృదయమే అయినా పిడిబాకులవంటి పదునైన అక్షరాలతో అందరిలోను ఆత్మస్థైర్యాన్ని నింపగల ప్రతిభ ఉన్న పద్మారిపితవు, నీవు ఎలాంటి ఆటుపోట్లనైనా తట్టుకుని సాగిపోగలవు. 2014 మొదటి కవితతోనే అందరి మదిదోచావు.

    ReplyDelete
    Replies
    1. సృజనగారూ......కొంపదీసి పిడిబాకుతో పొడిచానని పోలీసు కంప్లైంట్ ఇస్తారా ఏంటి :-) పైగా మది దోచాను అని దొంగను చేసారు కూడా :-)

      Delete
  20. painting posture is good padma

    ReplyDelete
  21. గుండె గుడిలో సంతోషాలు ఎన్నో బాధలు మరెన్నో
    మరిచిపోదామన్న మరువలేని విశాదలెన్నో
    గుర్తుకు వచ్చే ఆప్యాయత అనురాగాలు ఎన్నో మరెన్నో
    విషాదానికి సంతోషానికి దారులు ఉన్నాగాని
    సంతోషం నుండి విషాదానికి రావడానికి పిల్లదారులెన్నో
    విషాదం నుండి సంతోషానికి రావడానికి మాత్రం తెలియని మలుపుల "U-Turn" లు "Take Diversion" బోర్డులు
    ప్రతి ఘడియ ఓ మైలురాయే జీవితపు బాటలో
    ప్రతి బంధం మనకు ఆలంబానే బ్రతుకుతెరువులో
    మరి వేలకట్టేలేని సంతోషానికి పెంపొందించడానికి
    ఎగసిపడే విశాదకోరాల్ని మనోధైర్యం తో పోరాడలేమా ?

    అంబారాన్నే అలవోకగా చేరి రోదసి తో బంధం కలిపే మనకు
    మన 'నా' వాళ్లనుండే ఎందుకో తెలియని విద్వేషాలు

    ReplyDelete
    Replies
    1. అవును కదా.....ఎందుకో ఏమో?

      Delete
  22. మీ గుప్పెడంత గుండెలో ఇంకెన్ని అక్షర గ్రంధాలు దాగున్నాయో అర్పితగారు :-)

    ReplyDelete
    Replies
    1. కరస్సీవ్ రైటింగ్ బుక్కే ఇంకా రాస్తున్నా....గ్రంధాలు ఎప్పటికి రాస్తానో ఏమో :-)

      Delete
  23. గుప్పెడంత గుండెలో ఎన్ని భావాలో !

    ReplyDelete
    Replies
    1. అదే అనుకుంటున్నాను రవిశేఖర్ గారు. చాన్నాళ్ళకి ఇటువైపుగా విచ్చేసారు

      Delete
  24. వేదనను వెల్లడిస్తూనే జీవించాలని ప్రేరణను ఇచ్చారు. బాగుంది కవిత.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి....ప్రేరణగారు.

      Delete
  25. నా గుప్పెడంత గుండెకు ఎందుకిన్ని భావావేశాలో!!
    అనురాగానికై ఎందుకు ఈ అనుబంధ ఆటుపోటులో
    నేనున్నా అని నిండుగా నమ్మించేవారి నీడకై వేసారి
    విశ్వాసమే వమ్మైనప్పుడు అగాధపు అంచుల్లోకి జారి
    అందించిన ప్రతి హస్తం తాకి ఆప్యాయత అన్వేషణలో
    ఎదురైన ఎదకి చేరువై ఎందుకిలా రాటుదేలిపోవడాలో....> enni sarlu chadivina nannu nEnu chaduvukunnaTuuMdi Padmagaru ..Nice and Hart Touching

    ReplyDelete
    Replies
    1. అందరి పిడికెడు హృదయాల స్పందనా ఒకటే కదండీ....ఎవరికివారే తమనని తాము తడిమి చూసుకుంటారు

      Delete
  26. మీరు ఇచ్చే జవాబులు ఎంతో వినమ్రతగా చదువుకుని కాసేపు రిలాక్స్ అయ్యేలా ఉంటాయి

    ReplyDelete
    Replies
    1. మీరు అలా అంటే నా మనసు కూడా హాయిగా ఉంది అభిలాషిణి

      Delete
  27. ఎప్పుడూ ప్రణయ కవితలు రాసే పద్మ అర్పితేనా ఆర్థ్రత తో నిండిన కవిత రాసింది

    ReplyDelete
  28. I became fan to you after reading your poetry. Myself is feeling proud to get this blog. Missing this all these days.

    ReplyDelete