గీతలు-రాతలు

గీతలకేం తెలుసని చేస్తాయి గీతోపదేశాలు!!
అరచేతి గీతలుచూసి అఖండ సౌభాగ్యమని
అర్థంకాక అలికిన గీతల్ని అహా ఓహో అని
హస్తరేఖలతో జీవితాన్ని ఏం అంచనా వేస్తావు
చేతుల్లేక జీవిచడంలేదాంటే వెర్రిముఖం వేసేవు

గజిబిజిగీతలకేం ఎరుక గాడితప్పిన గమ్యాలు!!
నుదుటిపై గీతల్లో భవిష్యత్తు అంతా భవ్యమని
ఆకతాయిగా తిరిగి అదే అందిన ఆనందం అని
కష్టాల్లో కలిసిరాదని నుదుటిరాతనే నింధించేవు
ప్రయత్నం ఏం చేయకనే ఫలితాలని ఆశించేవు

సరళరేఖలకేం తెలుసని సహజీవన విధానాలు!!
నేలపై నిలువు అడ్డంగా గీతలేగీసి సరిహద్దులని
స్వార్ధసంస్కరణల చిందులనే విజయమనుకుని
విరిగిన మనసులకు మాటల లేపనమే పూసేవు
అద్దమంటి మదిని గీతకనబడకుండా అతకలేవు

గాట్లుచేసే గీతలకేం ఎరుక గాయాల సలపరాలు!!
పట్టింపు పగలతో శరీరంపై గాటుగీతలేసి శిక్షలని
రక్తం స్రవిస్తుంటే రంగొకటే అయినా మనం వేరని
ఆవేశంతో ఆలోచించకనే తృటిలో పరిష్కరించేవు
ఎన్నటికీ ఊపిరాగిపోని గీతలేవీ నీవు గీయలేవు

బంధాల మధ్య గీతలకి లేవు సంబంధ విలువలు!!
అనురాగాల తులాభారమేసి ఆపలేవు అడ్డుగోడని
పైకంతో వారధి కట్టి కాంచలేవు మమతల కోవెలని
అనుబంధమే తెగితే ముళ్ళు లేకుండా అతకలేవు
అంతరంగపు అడ్డుగోడలతో అందరిలో ఒంటరి నీవు

58 comments:

 1. పద్మార్పిత అంటే ఏంటో చెప్పడానికి మీ ఈ కవిత ఒక్కటి చాలు.. ఇట్స్ అ పవర్ పాకెడ్ పోయెట్రీ...

  గీతలేం తెలియజేస్తాయో తెలియదు కానీ..మీ రాతలే ఉపదేశాల్లా అనిపిస్తాయి.
  గజిబిజిగా ఒక్క పదమైనా రాయరు కానీ.. జిలిబిలి పలుకులతో గమ్యం గురించి చెప్తారు.
  సరళరేఖల గురించి తెలియదు కానీ.. అక్షరాలకు సరళత్వం పులిమి సందేశమిస్తారు.
  గాట్లు చేసే గీతల్లో మర్మం అస్సలు తెలియదు కానీ.. కుంచెపట్టి గీతలకి ఊపిరిపోస్తారు.
  బంధాల మధ్య గీతలేమో కానీ.. నెర్రలేని అభిమాన వారధిని మాత్రం సంపాదించుకున్నారు.

  హ్యాట్సాఫ్ మేడం. !!


  ReplyDelete
  Replies
  1. ఈ అభిమానం ఇలా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను_/\_

   Delete
  2. Yohanth thanks for supporting

   Delete
 2. పద్మా మీ పదాల పద్మవ్యూహం అనితరసాధ్యం. అందులో చిక్కుకోవడమే తెలిసింది కాని బయటకి రాలేం :-) చాలా చాలా పరిణితి చెందిన కవిత. అభినందన మాలార్పితం

  ReplyDelete
  Replies
  1. పద్మవ్యూహంలో భందించే చాతుర్యమెరుగని కోమలిని, మరీ బంధించాను అన్న అభాంఢనేల నాపై :-)

   Delete
 3. This is one of your best padma.

  ReplyDelete
  Replies
  1. Thank you. this is the first direct compliment i got from you sir.

   Delete
 4. అమ్మో మీరిలా అక్షరాల అమ్మోరు పూనినట్లు రాస్తే నేను రాసే అల్లరి సమాధానాలకి కోపం వచ్చి శపిస్తారని భయం వేస్తుందండి.

  ReplyDelete
  Replies
  1. ఆకాంక్షని భయపెట్టే ధైర్యమా నాకు....హన్నన్నా...ఎంతమాటెంతమాట :-)

   Delete
 5. Very tough job mam. U made it simple

  ReplyDelete
  Replies
  1. Welcome to my blog.
   Thank you very much

   Delete
 6. hats of madam miku sati evaru leru

  ReplyDelete
 7. పద్మార్పిత పదములే చాలు జీవితాన్ని చదవనవసరంలేదు. నిజమేనండోయ్ మీరు పెద్దమనిషైపోయారు తప్పుగా అనుకోకండి గ్రేట్ పర్సన్ అన్నమాట మీ పదాలకి గులామునై సలాము చేస్తున్న.

  ReplyDelete
  Replies
  1. పెద్దమనిషైపోయాను అంటూ హిమక్రీములన్నీ మీరే తినేయకండి.:-)

   Delete
 8. చిరునవ్వులు చిందించే మోము నేడు మూగాబోయిందేలనో
  ఉరుకులు పరుగులేస్తూ కెరటాన్ని తలపిస్తూ ఉండే జలజ
  చేతిరాతలకేం నుదుటి రాతలకేం మన మనసు సరళ రేఖ లా ఆలోచిస్తే
  ఎన్ని వంకర గీతలున్న అసలు రాతలే లేకపోయినా స్వయంకృషితో వెలిగిపోతారు

  కృషితో నాస్తి దుర్భిక్షం. మనలో సత్తాను నమ్ముకోవాలే కాని
  చిలకపలుకులు భూతద్దాలు తీరిపోయిన గతాలు తెలియని భవిష్యత్తుకై ఎందుకీ పాట్లు

  చిత్రం చక్కగా వచ్చింది. మీరు అటాచ్ చేసే చిత్రం మీ కవితకు జీవం పోస్తుంది. భళా పద్మగారు భళా.

  ReplyDelete
  Replies
  1. ఏదో కాసేపు అలా మూగగా నటిస్తానే కానీ నేనెప్పుడు ఉండగలను అలా చెప్పండి....ఉరకలేస్తూ, నవ్వేస్తూ, బర బరా బరికేస్తూనే ఉంటాను గీతల్ని. మీరు చదివినా చదవకపోయినా :-) చిత్రాలని కాస్త కుదురుగా వేసే ప్రయత్నం చేస్తాను అవి నాకు ప్రాణం కదా!

   Delete
 9. పద్మార్పిత గారూ !

  మీ ' గీతలు - రాతలు ' కవిత చదివాక కామెంట్ కై
  కలం తీస్తే ఇంత గొప్ప కవితకు ఏం రాయాలో తెలియని
  భయంతో కలం ముందుకు సాగలేదు,
  నమ్మగలరా .. ఇది వాస్థవం .
  అందు చేతే ఆలస్యంగా రాస్తున్నా .

  ఈ మధ్య మీ కలం నుండి జాలువారిన మంచి కవితల్లో,
  మీ ' గీతలు - రాతలు ' అగ్రస్థానాన్ని ఆపాదించుకుంది .

  బాషకు - భావనలకూ అవధులు లేవని మీ కవిత
  అడుగడుగునా రుజువుచేసింది.
  ఆ రెండూ పోటీ పడి మమ్ము ఆలోచనల వడిలోకి లాక్కెళ్ళి
  జీవితంలోని నగ్న సత్యాలను అవగాహన చేసుకోమన్నాయ్ !
  కవిత సాంతం చదివాక చుట్టూ వాతావరణం గాంభిర్యాన్ని
  నింపుకుంది. పటుత్వమైన భాషా పరిజ్ఞానాన్ని రంగరించి
  భావగర్భితమైన కవితనందించి మరింత భాద్యతను పెంచుకున్నారు .
  మున్ముందు మీరందించే కవితలు ఇంకెంతటి స్థాయిని పుంజుకుంటాయో మరి.
  మీ ఈ కవిత సాహిత్యలోకాన్ని అలరిస్తుందని,
  అందరి మన్ననలను అందుకుంటుందని చెప్పడంలో....
  అతిశయోక్తి ఎంత మాత్రమూ లేదంటే ... లేదు .

  శభాష్ పద్మార్పితా.
  అభినందనలతో
  *శ్రీపాద

  ReplyDelete
  Replies
  1. శ్రీపాదగారు నిజంచెప్పాలంటే ఇంచుమించు మధ్యాహ్నం నుండి నాదీ అదే పరిస్థితి. ఏం వ్రాయాలో అర్థంకాక రెండు టీలు తాగి లాభం లేదని మిన్నకున్నా....
   "పటుత్వమైన భాషా పరిజ్ఞానాన్ని రంగరించి
   భావగర్భితమైన కవితనందించి మరింత భాద్యతను పెంచుకున్నారు .
   మున్ముందు మీరందించే కవితలు ఇంకెంతటి స్థాయిని పుంజుకుంటాయో మరి"
   మీరు ఇలా అంటే అభిమానిగా అనందంతో పాటు కంగారు కూడా కలిగింది. ఎందుకంటారా! అర్పితకేం ఆడుతూ పాడుతూ వ్రాస్తుంది భావ గంభీర శైలిలో, కానీ.....మనసు మెదడు రిలాక్స్ అవ్వడానికి నేను చేసే పని ఆవిడ బ్లాగ్లో పాటవింటూ అహ్లాదకర పోస్ట్లు చదువుకుని మనసారా నవ్వుకోవడం. అది దూరమైపోతుంది అన్నీ ఇంత గంభీరంగా వ్రాస్తే.....ఎంతైనా అల్లరి అర్పిత చిలిపి, తుంటరి కవితలు మంచి ఆరోగ్య ఆనంద గుళికలు-కాదంటారా!

   Delete
  2. శ్రీపాదగారు అసలు మీరు కమెంట్ రాస్తే రిప్లై ఇవ్వడానికే భయపడిపోతుంటే నేను, మీరు ఇలా భాధ్యతంటూ ఇంకా భయపెడితే ఎలాగండి. ఏదో వెరైటీ కోసమై ఇలా, ఇదే లెవెల్ అంటే నావల్ల కాదండోయ్ :-) ఏం రాసినా చూసి భరించేద్దురూ....తప్పదు మీకు

   Delete
  3. హరినాధ్ గారు....కమిట్ అయ్యారు, నా అల్లరిని భరిస్తానని:-) బలైపోయారుగా

   Delete
 10. గాట్లుచేసే గీతలకేం ఎరుక గాయాల సలపరాలు!!
  పట్టింపు పగలతో శరీరంపై గాటుగీతలేసి శిక్షలని
  రక్తం స్రవిస్తుంటే రంగొకటే అయినా మనం వేరని
  ఆవేశంతో ఆలోచించకనే తృటిలో పరిష్కరించేవు
  ఎన్నటికీ ఊపిరాగిపోని గీతలేవీ నీవు గీయలేవు

  మీ అక్షర పద్మ వ్యూహంలో అభిమానులను అభిమన్యులుగా చేసి బంధించేస్తే ఇంకేం వ్యాఖ్యానించగలం. సలామ్ కొట్టడమే.. గీతల చక్రవ్యూహం చాలా బాగుంది. అభినందనలతో..

  ReplyDelete
  Replies
  1. ఎన్నో అద్భుతమైన కవితలు అందించిన మీలాంటి కవులే ఏం వ్యాఖ్యానించగలం అంటే మాబోటివారి సంగతి ఏంటీ కుమారవర్మగారు :-)

   Delete
  2. భావాలని వెదజల్లే నన్ను బంధించాను అని అనడం ఎంతవరకూ భావమండి....కవివర్మగారిని కవితల్తో బంధిచడం అంత సులభంకాదని తెలిసి పరాచికాలా :-)

   Delete
  3. భలే అడిగేసారు హరినాధ్ గారు....:-)

   Delete
 11. మొదటిసారి చదువుతూ గీతలగీసి చిత్రం ఎలా వేయాలో రాసావేమో అనుకున్నాను. చదువుతున్న కొద్దీ భృకుటి ముడిపడి జీవన విధానంలోని విలక్షణ గీతల విశిష్టత గురించి ప్రతిష్ఠాత్మక పదబంధంతో బంధించి కాసేపు మనసు మూగపోయేలా చేసి, పిమ్మట పదపద్మ కవితా కొలనులో సేదతీర్చావు...అభినందాశ్శీస్సులు అర్పితా-హరినాధ్

  ReplyDelete
  Replies
  1. మీ ఆశ్శీస్సులు సదా కాంక్షిస్తూ మీకు వందనములు. ఏదో గీతలో రాతలొ, ఏదైతేనేమి సేదతీరచ్చానన్న భావం ఆనందాన్ని ఇచ్చిందండి.

   Delete
 12. ఈ కవితని అర్థం చేసుకోవడం నావల్ల కాక మళ్ళీ మీకే మెసేజ్ చేసి తెలుసుకోవలసి రావడం భాధాకరం. తప్పింది కాదు. నేను కమెంట్ పెట్టడానికి అర్హుడిని కానేమో అనిపిస్తుంది దీని భావం అర్థం అయ్యాక. అత్యంత అద్భుతమైన భాషాపరిజ్ణానం మీ సొంతం.

  ReplyDelete
  Replies
  1. యు ఆర్ మోస్ట్ వెల్ కం! ఎప్పుడూ అలా అనుకోవద్దండి. మీరు అడిగితే ఆనందిస్తాను. అర్హుడినికాను అనే అటువుంటి మాటలు అభిమానానికి అడ్డుకావండి. జ్ఞాం పెంచుకోవడంలో మనమంతా ఎప్పటికీ విధ్యార్ధులమే కదా!

   Delete
 13. మనిషికి మనిషికి మధ్య ఉన్న సన్నని గీత.. అనుబంధం. ఆ బంధాన్ని అరచేతి గీతలతోనో, తలరాతలతోనో నిర్మించుకోడం సాధ్యం కాదని... ఎంత చక్కగా చెప్పారు. గీతలు కావు, చేతలు ముఖ్యమన్న సందేశంగా దీన్ని అర్ధం చేసుకుందామంటే మరో కోణం మనసుని తడుతోంది. అందమైన స్కాచ్‌ సీసా లాంటి చిత్రాన్ని చూపించారు. దూరం నుంచి మత్తెక్కించారు. తీరా దగ్గరికి వెళ్లి రుచి చూద్దామంటే...అసలు చిత్రం పెద్ద కథే చెప్పింది. బతుకు అతుకులనకు ఫిలాసఫీ మంత్రమేసి మత్తు చల్లారు. అందం మత్తుని ఆస్వాదించాలనుకునే లేపే.. ఆ అదృష్టం ఒక భ్రమే.. తలరాతల్లోనూ అదే భ్రమ.. ఆ భ్రమలోంచి బయటపడండని... ఎంతో చక్కగా వివరించారు. ఇది కవిత కాదు... జీవిత సారమే. గీతల్లో ఏం లేదు, తలరాతల్లోనూ ఏమీ లేదు.. మనసు నడిచే గతిలోనే అంతా ఉంది. ఇదే కదా... క్లుప్తంగా మీ భావానికి అర్థం... పద్మగారు.

  ReplyDelete
  Replies
  1. సతీష్గారికి చాలా చాలా త్యాంక్స్..పద్మార్పితగారి కవిత నాలుగుసార్లు చదివి మొదట తలుచుకున్నది మిమ్మల్నే,:-) పెయింటింగ్ కవితని వివరించేలా మీరు వ్రాస్తే చదివి మెదడుకి పనిచెప్పే అవసరంలేదుకదా అనుకున్నా..ఇప్పటికైనా మీ విశ్లేషణ చదివాకే ఇంత మర్మగర్భంగా వ్రాస్తారా ఆమె! మాలాంటి మందబుద్దులకి మీరు అండగా ఉండాలిమరి. చక్కటి వివరణ పెయింటింగ్ పై కవితపైకూడా..

   Delete
  2. గీతాజ్ఞానమే కాదు చిత్రంలోని విన్యాసాలని వివిధ కోణాల్లో వివరించారు. బాగుందండి. నిజం చెప్పాలంటే ఈ బొమ్మలో ఇంత అంతరార్థం ఉందని మీరు రాతలు చదివాక తరచిచూస్తేనే తెలిసింది.

   Delete
  3. నేను రాసిన గీతల గురించి నాకు తెలియని కొత్తవిషయాలని మీకున్న పరిజ్ఞానంతో అందంగా చెప్పి అలరించారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి. ఇంక చిత్రం గురించి ఏం చెప్తారో అని ఆశక్తిగా ఎదురు చూస్తున్న నాకు ఆనందంతో వాహ్ వ్హా అనుకుని, ఆపై నాలాగే ఆలోచించే (బొమ్మల్లోని భావాన్ని వెతికే) వ్యక్తి ఉన్నందుకు సంబర పడుతున్నాను. ధన్యవాదాలు సతీష్ గారు

   Delete
  4. ఆకాంక్ష్.....ఇది అన్యాయం నేను రాస్తే నన్ను అడకుండా విశ్లేషణకై ఇలా ఎదురుచూడ్డం. ఐ హర్టెడ్ అంతే :-) ఇకపై నేనుఏం రాసినా సతీష్ గారి నుండే క్లారిటీ అడగండి (Just kidding)

   Delete
  5. తెలుగమ్మాయి కూడా షార్ట్ కట్ లో తెలుసుకునే ప్రయత్నం మొదలెట్టారన్నమాట :-)

   Delete


 14. బంధాల మధ్య గీతలకి లేవు సంబంధ విలువలు .... అనుబంధం తెగితే ముళ్ళు లేకుండా అతకవు
  అనురాగాల తులాభారమేసి ఆపలేము .... పైకంతో మమతల కోవెలకి మూల్యం చెల్లించలేము
  అంతరంగపు అడ్డుగోడలే అన్నీ
  అందుకే .... అందరిలో ఒంటరి నీవు

  చాలా బాగుంది భావన .... కవిత
  అభినందనలు పద్మార్పిత గారు!

  ReplyDelete
  Replies
  1. మీ అభినందనలు నాకు స్ఫూర్తిదాయకం.

   Delete
 15. గీతలే బాగుంటే జీవిత రాతలే మారేవంటే....తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారేమో, ఇంత చెప్పినా అర్థంకాలేదాని. ఏమైనా జీవితానుభవసారాన్ని మీ అంత బాగా తెలుసుకోలేకపోయాం. మొత్తం కవితంతా ఒకే బాణీలో అధ్భుతంగా మలిచారు. ఇంతకన్నా రాయడానికి ఏం తోచడంలేదు. అభినందనలు.

  ReplyDelete
  Replies
  1. మహీగారు మరీ ఇలా ఢీలా పడిపోయే మాటలు చదవడానికీ వినడానికే కాని అనుభూతికి ఆనందాన్ని ఇవ్వలేవు. అందుకే గీతలూ రాతలూ జాన్ తా నహీ అని సాగిపోదాం పదండి :-)

   Delete
 16. అమ్మా పద్మా ఇలా భారమైన గీతలతో అక్షరాలు అల్లి మమ్మల్ని కైవసం చేసుకున్నది చాలక భాధతో మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తే ఎవరికి చెప్పుకోం. ఇది చాలదంటూ మళ్ళీ అందరూ బ్రహ్మాండంగా కమెంటుతుంటే మనకి అదికూడా చేతకాదనే బాధ మరోవైపు. :-) ఈసారి సమ్మర్లో ఒక సరసమైన కవితతో నవ్వించెయ్.

  ReplyDelete
  Replies
  1. సృజనగారూ ఏదో నన్ను ఆడిపోసుకోవడం కాకపోతే మీరు తలుచుకుంటే ఒక్క స్మృతిసవ్వడి చాలు సరసానికైనా సరదాగా నవ్వుకోడానికైనా.....కాదంటారా! :-)

   Delete
 17. అమ్మో ఇలాంటి గీతలకి-రాతలకి కమెంట్స్ పెట్టాలంటే గట్స్ కన్నా జ్ఞానం ఎంతో అవసరం.
  అది అంతో కొంత ఆపాదించుకుందామని మీ బ్లాగ్లోకి అడుగిడితే ఇంత భారాన్ని మోపి మనసంతా వేదనతో నింపేస్తారా :-) తగునా

  ReplyDelete
  Replies
  1. తెలుగమ్మాయి తెలివితేటలకేం తక్కువని ఇలా అనుకోవడం .

   Delete
 18. అందరిలా పొగడ్డానికి నాకర్హత లేదండోయ్...
  మీ కవిత చదివి జాతకం చించేసాను. ఇప్పుడేమో జాతకం ఉంటేగానీ పెళ్ళి కుదరడంలేదు... ఏం చేయను.. లవ్వడి లేచిపోవడం తప్ప..
  ఏమాటకామాట చెప్పుకోవాలి గానీ... కుమ్మేశారు పోండి..

  ReplyDelete
  Replies
  1. పొగడ్డం ఎందుకు వినోద్, అయినా అర్హతలేదు అంటూ అలా తప్పించుకోకపోతే ఒక పొడవాటి కవితేదో రాసేస్తే మీ సొమ్మేం పోతుంది విష్వక్సేనగారు ఎంతైనా మీ అభిమాని నేను.:-)

   Delete
 19. బాగుంది అని రొటీన్ గా అనలేను
  పెద్ద పదాలని కూర్చి వ్రాయలేను
  వ్రాయకుంటే మనసేమో ఊరుకోదు
  వ్రాయాలంటే కలం ముందుకు సాగదు
  మీ స్టైల్ లో కమెంటాను బాగుందా :-)

  ReplyDelete
  Replies
  1. నువ్వు రాయడం బాగోపోవడమా అనికేత్....నెవర్

   Delete
 20. every line is simply superb mam. you are rocking star of telugu poetry.

  ReplyDelete
 21. Madam whr r you!? Vacheyandi Vacheyandi

  ReplyDelete
  Replies
  1. Iam here with you my dear :-)

   Delete
 22. ఈసారి చాలా టైపింగ్ మిస్టేక్స్ జరిగాయి, ఎందుకో "కీ" బోర్డ్ నాపై అలిగినట్లుంది నేను "ఏ" అంటే అది "ఏహే" అని వెక్కిరించింది. దాని అలుక ( పద్మార్పితకి "కీ" బోర్డ్ కంప్యూటర్నీ వాడుకోవడమే కానీ ఒక కవితో కధానికో రాయలేదని, వాటిపై ప్రేమ లేదని ప్రేమించరాదని ఇలా మొండికేసిందని తరువాత తెలిసింది) తీర్చేలోపు ఆలస్యం అవుతుందని సమాధానాలు తప్పు ఒప్పులతో టైప్ చేసాను. అసౌకర్యాన్ని సహృదయంతో సర్దుకుపోతారుకదా! _/\_

  ReplyDelete
  Replies
  1. Oh! this is your style of saying apology...its different :)

   Delete
 23. మీ కవితల్లో నంబర్ 1 ఇది.

  ReplyDelete
 24. ఇది కవిత కాదు... జీవిత సారమే. !
  బాగా చెప్పేరు.

  ReplyDelete
 25. ముందస్తుగా నా బ్లాగ్ కి విచ్చేసిన మీకు వందనాలు. మీ వ్యాఖ్యలు నాకు స్పూర్తిదాయకం. ధన్యవాదాలండి.

  ReplyDelete