అలంకరణ


నీలిమబ్బుల వంటి కలల సామ్రాజ్యంలో
అరవిరిసిన విహంగాలు ఊహా సౌధాలు..
చంద్రుడు మబ్బుల మాటున నక్కెననో
తారలు షికారుకెళ్ళి ఇంకా తిరిగి రాలేదనో
వంకలు కొన్ని వెతికి రేయిని పొడిగించరాదా
ఊహలతో మరిన్ని ఊసులు చెప్పనీయరాదా!
మేఘమా! చంద్రుడ్ని మాయచేసి ఒడిసిపట్టి
వెన్నెలనే దోచి కలల కలువల్ని విప్పారనిచ్చి
అంబరాన్ని అవనితో సంధిచేసి సంబరపడరాదా!
ఎగసే సాగరకెరటాల వంటి భావ అలజడులలో
హత్తుకున్న కోర్కెల్లేవు, కొట్టుకుపోయినవీ లేవు
స్థిర సంకల్పానికి నిర్ధిష్టమైన రూపం ఒకటిచ్చి
పట్టుదలని పరిచయం చేసి ప్రణయంగా మార్చి
అంధకారానికి వెలుగుతో పరిణయం చేయరాదా
గమ్యాన్ని సరిగమ సరాగాలతో శింగారించరాదా!

రూపు మార్చేయ్

మగువనంటూ మదిలోన మదనపడింది చాలు
మదం ఎక్కిన వాడి మగతనాన్ని మసిచేసెయ్!

వెకిలిచేష్టల వారిని వద్దంటూ వారించింది చాలు
వెన్ను వంచి వాడి నరాల్లో వణుకు పుట్టించేయ్!

చంకలోని పసివానికి చనుపాలు ఇచ్చింది చాలు
ఛాతీని చూసి చొంగ కార్చిన వాడి కళ్ళు పీకెయ్!

నలిగిపోయి నలుగురిని న్యాయం అడిగింది చాలు
నడిబజార్లో వాడ్ని నిలబెట్టి నపుంసకుడ్ని చేసెయ్!

సహనానికి మారుపేరు స్త్రీ అంటే సహించింది చాలు
శంకించిన వాడు పతి అయినా పైత్యం పిండేసెయ్!

కామించు అంటే కాదనలేక కుమిలిపోయింది చాలు
కాళిలా మారి వాడి కంఠాన్ని కదంతో తొక్కిపారెయ్!

గిలిగింత...

 చిటికె వేస్తే వస్తానన్న చలి...
చిందులు వేసుకుంటూ వచ్చి
దుప్పట్లో దూరి ఈలవేసి గోలచేస్తూ
ఏదేదో చెప్పి ఏమార్చకు అంటుంది!

బధ్దకాన్ని బావాని  పిలిచి...
ఒక్కసారి కన్నుగీటిన పాపానికి
ఒళ్లంతా తడిమేసి వదలలేనంటూ
బ్రతిమిలాడేకొద్దీ మరీ బెట్టుచేస్తుంది!

ఏదో విధంగా సర్ది చెప్పాలని...
సరసమాడ సమయమే కాదంటే
కురుల వెనుక మోమునే దాచుకుని
పగటిని చూపి రేయిగా మారినానంది!

వెచ్చదనాన్ని ముద్దుగా ఇచ్చి...
చిన్నగా గిల్లినా సన్నగా జారుకోబోతే
రేయిరెప్పల్లో దాచకు వేడి ఉద్రేకాలనని
రాత్రికి వేసే రాజీమంత్రమేదో తెలుసునంది!

గుర్తుకొచ్చే..


 గుండె కొట్టుకుంటూ ఉంటే గుర్తుకొచ్చే
నువ్వు అక్కడున్న జ్ఞాపకం తట్టిలేపె

గడిచిన కాలమంతా కఠినంగానే గడిచె
నీ బాస జ్ఞాపకమై వచ్చి లేపనం రాసె

తట్టుకోలేని గుండె తడబడుతూ అడిగె
దు:ఖాన్ని తరిమే నిబ్బరాన్నీయమనె

ఎదను ఎదిరించే శక్తి నాలోనూ ఎక్కువే
అది తరిగిన క్షణమే మది నిన్ను తలిచె

సేదతీర్చుకోమని నా నీడే నన్ను ఓదార్చె
అప్పుడు, ఆగని కన్నీటికి నీవు గుర్తుకొచ్చె

సాధన

అమ్మ ఆప్యాయంగా కలిపి పెట్టిన అన్నం ముద్ద
ఉడకని అన్నం హాస్టల్లో అరగనప్పుడు గుర్తుకొచ్చే..
ఆమె ఒడిలో గారాలుపోతూ విననన్న మాటలు
గోడపై బల్లి అరిస్తే అమ్మా అంటూ అరవాలనిపించె!

నిద్రపుచ్చుతూ నాన్న చెప్పిన ఎన్నో నీతిపాఠాలు
అర్థంకాని పాఠాలు మెదడ్ని అరగదీస్తే అర్థమయ్యే..
నాన్న ఆశయం తీర్చాలన్న తపన తరుముతుంటే
కష్టపడి శ్రధ్ధగా చదివి సాధించాలన్న పట్టుదలపెరిగె! 

అదేపనిగా చదువుతుంటే చెల్లితో ఆడుకున్న ఆటలు
అలసిపోతివా అక్కా అని అమాయకంగా వెక్కిరించె..
సెలవలివ్వని కాలేజీని కాల్చేయాలి అనుకున్నప్పుడు
ఉద్యోగనికై అన్నయ్య పడుతున్న పాట్లు జ్ఞాపకమొచ్చె!

విరామం లేక విసుగు చెందిన తనువు విశ్రాంతి కోర
స్నేహితులే దరి చేరి సినిమాకి చెక్కేద్దామని సైగ చేసె..
ధృఢసంకల్పమే దూతై వచ్చి గమ్యానికి దారి ఎక్కడన
సాధనతో సాధ్యం కానిది ఏదంటూ నన్ను నే ప్రశ్నించె!

(హాస్టల్స్ లో అహర్నిశలు చదువు చదువు అంటూ నలిగిపోతున్న ఇంటర్ విద్యార్ధులకు అంకితం )

జ్ఞాపకాలు

 చెప్పుకోలేని బాధ ఏదో

చెవుల్లో కీచురాళ్ళలా దొలుస్తూ 

ఆలోచనలకు రెక్కలు మెలిచి...

ఒక్క రాత్రైనా ప్రశాంతంగా ఉండనీయవు!

 పదునెక్కిన ఆలోచనలు ముల్లుకర్రలై 

గాయపడ్డ మదినే మరల గాయం చేస్తూ

జ్ఞాపకాలు సలపరం పెడుతుంటే...

హృదయంలో పొంగు ఉప్పెనలు ఆగవు!

 కునుకుపట్టని కళ్ళు కమిలిపోయి

వేదన నరాల్లో కరెంటులా ప్రవహిస్తూ 

కాగినకన్నీరే తనువుని బొబ్బలెక్కిస్తే

గుంతలో పాతిన గుర్తులేం ఊపిరి పోయవు!

గెలిపించేయ్..

అక్షరాలని అలవోకగా నీవు తాకి
అందమైన కవితకు జీవంపోసేయి
నా పెదాలని నీ పెదవులతో తాకి
ప్రేమకావ్యానికి అమరత్వమీయి!

వయసు పరిమితి లేదని చెరిపివేసి
ప్రణయానికి వేసిన పగ్గాలు తెంపేయి
సంబంధమే లేని బంధమని చెప్పేసి
జన్మజన్మల బంధానికి ఊపిరిపోయి!

ప్రేమిస్తే చూసేది మనసునేనని చెప్పి
ప్రేమసంప్రదాయపు సాంద్రత పెంచేయి
విచారంగా ఉంది ఒంటరి వెన్నెల విచ్చి
మువ్వోలె నవ్వుతూ చెంతకి వచ్చేయి!

నచ్చిందేదీ నాకెన్నడూ సొంతంకాలేదు
నీవు నా సొంతమై విధిరాతనే మార్చేయి
ఓటమే తప్ప గెలుపు నన్ను వరించలేదు
నీ మదిని నీవోడి నా ప్రేమని
గెలిపించేయి!

నూతనాధ్యాయం


అన్ని రోజులు ఒకేలా ఉండవులే అనుకుని
పాడైన హృదయాన్ని పీకి పడేయడం రాక
నడుస్తున్న బాటలో కొత్త అర్థాలే వెతుకుతూ
నూతనోదయానికి నాణ్యమైన నాంది వేసున్నా!

ఫలించని స్వప్నాలే విలువనెరిగి పరావర్తించి
సఫలీకృతం అవ్వాలని అదృష్టాన్నే నమ్ముకోక
పట్టుదలతో నాకు నేనే ప్రేరణగా మారి నడుస్తూ
పిల్లకాలువ సాగరం చేరదని నదిని వెతుక్కున్నా!

శిల్పం కూడా ఒకప్పటి రాయేనని తెలుసుకుని
అల్పజ్ఞానంతో మట్టిలో మాణిక్యానికి వెలకట్టలేక
మండే సూర్యుడూ మంచే చేయునని నవ్వుతూ
ఆలోచనాసక్తికి కాస్త యుక్తి చేర్చి అడుగేస్తున్నా!

ఒడిదుడుకాటుపోట్లు, పొరపాట్లు సాధారణమని
పోరాడ్డమే పని అనుకుని ప్రతిఫలం ఏం ఆశించక
అలుపన్నాదే లేకుండా నిశ్శబ్ధంగా యుద్ధం చేస్తూ
విజయం
వరించి చేసే శబ్ధానికై ఎదురుచూస్తున్నా!