గరిక కొనల్లోని సూర్యుడు మేల్కొన్నది మొదలు
ఉండీ లేనట్లున్న జ్ఞాపకాల నడుమ రాయబారమే
ముఖకవళికలకి రంగులద్దుతూ అలజడి చేస్తుంటే
తలుపు తడుతున్న సంబరాలే కరిగి కలవరపడె!!
ఆకునీడ దాగిన పూలు గాలి తాకిడికి కదులుతూ
చిరుజల్లులు తమని తడిపి నేల తాకవని తలుస్తూ
నవ్వులు రువ్వ అంతలో ఆకశాన్న ఉరుము మెరవ
తెరిపి కోసం ముడుచుకున్న ఆకుల్ని తడుముతుంటే
సాంగత్యాన్ని తాళలేని కాండమే కరకుగా విరిగిపడె!!
హృదయాన్ని అద్దంలో చూపలేని ప్రకృతి పరవశంతో
తలపులని తట్టిలేపి అస్థిరమైన రూపాన్ని కానుకిచ్చి
తేలికవని మనసుని కరిగిపోనిచ్చి కుదుటపడమని
పల్లపు లోయలో దాగని జ్ఞాపకాలని పారిపోమనంటే
దిక్కుతోచని గమ్యం అవిటిది అయిపోయి మూలపడె!!