తప్పు??

గాజుముక్కలే కొన్ని గుండెని గుచ్చుతున్నాయని
మోము అందాన్ని చూసి మనసుని అంచనావేసి
మదిని ముక్కలుగా విరచి బంధాన్ని బీటలుచేస్తే
అది తన ఉనికిని చూపడమే తప్ప తప్పు కాదు
నిన్ను తన ఉనికిలో చూడాలనుకోవడం నీ తప్పు

లోకం లోటుపాట్లు ఎంచి మన లొసుగుల్ని దాచి
మన తప్పేం లేదని నిందలు ఎదుటి వారిపై వేసి
సొంత సమస్యల్ని సోమరిపోతువై గాలికి వదిలివేస్తే
ఒంటరితనమే నీకు శత్రువైన తప్పు దానిది కాదు
పరిణితి చెందకనే అంచనాలతో అడుగేయడం తప్పు

వ్యధలు వేడుక చేసుకుంటున్నాయని వేసారి వగచి
ప్రయత్నం చేయకుండా ఫలితం లభించలేదన్న కసి
మదిలో నింపుకుని రాని వినలేని రాగాలు ఆలపిస్తే
పట్టుదల లేకపోవడం తప్పు కాని విధి తప్పు కాదు
వచ్చిన పని చేరవలసిన గమ్యాన్ని మరవడం తప్పు

కొసరు కాపురం

కొంటెగా తుంటరివై కొన్నాళ్ళు కాపురముండు
ఆ పై కరిగి చెదిరిన కలని కాలం గడిపేస్తాను

ముఖం పై కొన్ని ముద్దుమురిపాల రంగులద్దు 
గాట్లు పడితే సలిపే గాయాలని సర్దుకుంటాను 

హత్తుకుని హద్దుదాటిన ప్రతిబింబమై అగుపించు
సిగ్గుదొంతర్ల చీర చుట్టుకుంటినని సంబరపడతాను

బిడియం వీడమని బ్రతిమిలాడి వలపుసెగ రేపు
రగిలి చల్లారిన కోరికల్ని కిమ్మనరాదని కట్టేస్తాను

చిలిపిచేష్టలకి తుంటరి తెగులు అంటించి చూడు 
సరసం సంగీతరాగం ఆలపించెనని ఆడిపాడతాను

ప్రణయపు పరిమళాలను చేయి పసందైన విందు
ఆ పై వెళ్ళలేని నీతో కొన్నాళ్ళు కాపురమంటాను   

కలయిక

నువ్వు వస్తావని తెలిసిందే తడవుగా
అంబరమంత సంబరం గుండెల్లో గూడుకట్టి
నింగీ నేలా ఏకమై పోవాలంటుంది...
చెల్లాచెదురైన కోరికల్ని కుప్పగా పోసి
చెదిరిన స్వప్నాలని తిరిగి కలగంటుంది!

నిన్ను తనివితీరా చూసిందే తడవుగా
సప్తస్వరాలు హృదయాన్ని మీటి వెన్నుతట్టి
మౌనంగా ఏకమయ్యేలా ప్రేరేపిస్తుంది...
సిగ్గుదొంతరలకు సెలవిచ్చి సంభాషించమని
చేజారితే అవకాశం మరలరాదు పొమ్మంది!

నీ అనురాగంలో నే తడిసిందే తడవుగా
గ్రీష్మఋతువు తాళలేనంటూ గింగిరాలుచుట్టి
వసంతాన్ని విరబూయమని కబురంపింది...
బిడియం వీడిన మనిద్దరి కలయికని చూసి
సప్తవర్ణాల వైకుంఠము మన నెలవౌతుంది!