నా రాకుమారుడవని ఎదను ఇచ్చి ఎదలోన దాగుండమంటే
పరువపు ఎత్తుపల్లాలు చూసి ఎత్తుపోతల పధకమే వేసావు!
ఉన్నతమైన ఊసులే చెప్పి ప్రేమికుడిగా ఉపాధి పొందమంటే
ఊహకందని ఊసులతో ఊపిరాడని ఉపాధి హామీ ఇచ్చావు!
మనువాడి ఆలిగా చేసుకుని అనురాగాన్ని కురిపించమనంటే
ఇదిగో అదిగో అంటూ అందీ అందని అభయ హస్తమిచ్చావు!
విజ్ఞానం ఉంది విద్యలెన్నో భోధించే వివేకవంతుడు అనుకుంటే
విర్రవీగే నైపుణ్యాన్ని చూపి విద్యోన్నతి పధకం అంటున్నావు!
సొగసుగాడి యవ్వారం చూసి శోభనంలో సున్నుండలు పెడితే
శృంగారమే కరువాయెనని పనికి ఆహారపధకం ఎందుకన్నావు!
సర్దుకుపోయి ఏదో ఒకగూటి పక్షులుగా కాపురం చేద్దామంటే
గుడిసెకన్నా గుండే పదిలమంటూ స్వగృహ పధకమనేసావు!
నేలపై నిలకడతో నిశ్చింతగా ఉండు నింగిలోకి ఎగిరిపోవద్దంటే
చేతిలో చిప్ప పెట్టి ఉడాయించి ఉడాన్ పధకాన్ని పాటించావు!