మిగిలిపోనీ..

నా వలపు భావాలకు దిష్టి తగిలింది కామోసు
దిక్కుకొకటిగా ఎగిరిపోతే దిక్కుతోచక ఉన్నాను!

పంచిన అనురాగం పాచిపట్టి పాడైంది కామోసు
ఆపేక్షాకలిని అరువివ్వమని అడుక్కుంటున్నాను!

తపనపడే మనసుకి తాయత్తు కట్టాలి కామోసు
తాపత్రయం ఎక్కువై తలభారమై తిక్కగున్నాను!

వ్యధావేదనలు వెర్రెక్కి అరుస్తున్నాయి కామోసు
వేపమండలతో వదిలించుకోవాలి అనుకున్నాను!

గాయపడిన ఊసులకి ఏదో గాలిసోకింది కామోసు
ఉలిక్కిపడరాదని ఊరడించి విబూది రాస్తున్నాను!

బ్రతుకు భూతం నన్నింకా వదలకుంది కామోసు
బడితపూజ చేసి భరతం పట్టాలనుకుంటున్నాను!

ఆలోచనాక్షరాలు సయ్యపై పరుండాయి కామోసు 
పద్మార్పిత మధురభావంగా మిగిలితే బాగుండును!