జ్ఞాపకాలు భద్రంగా ఉంచిన బీరువా నా గుండె
అందులో నా భావ ప్రపంచాన్ని భద్రం చేసాను!
అంతరంగ ఆనందపు సాక్షిపత్రాలను పదిలపరిచి
లోతుగాయాన్ని దాచే తాపత్రయం చేస్తున్నాను!
హృదయం స్పందించడం మరచి కొట్టుకుంటుంటే
అలవాటుగా ఊపిరి పీల్చి గాలినే వదిలేస్తున్నాను!
వాగ్దాన వాక్యాలు వివరం చెప్పమని ప్రశ్నిస్తుంటే
రాలిన ఆకులతో లయబద్దంగా పాడుతున్నాను!
ప్రాణంపోయినా పర్వాలేదని మది శ్వాసతో అంటే
పాతజ్ఞాపకాల పరుపు పరచి పరామర్శిస్తున్నాను!
చివరాఖర్న శాశ్విత నిద్రలోకి జారిపోతూ కూడా
నాటి పరిచయపరిమళ అత్తర్ని ఆస్వాధిస్తున్నాను!
కొలను కలువ..
కోమలకొలను గుండెపై
వలపురెక్కలు విప్పి పడుకోనెంచి..
మల్లె సంపెంగలతో స్నానమిడి
సొగసు సోయగమే చూపగా
తన్మయంతో కొలనులోని జలం
గళంవిప్పి రారమ్మని పిలిచె!
తన పూపరిమళమే పరావర్తనం
చెంది పలురంగులాయనని
కొలను సామ్రాజ్యపు కోమలి
తానని మనసా వాచానెంచి..
సంతోషంతో తబ్బిబై తన సర్వం
స్వర్గం చేసి సమర్పించగా
లోతట్టు బంధనాల సరాలలో
బిగించబడితినని అలగా ఎగసె!
గట్టుపై ఉండనూ లేక కొలనునీట
మునిగితే ఊపిరి ఆడదని
విరిసీ విరియని వలపురెక్కలు
అన్నింటినీ పూర్తిగా వొలచి..
చలిలో పల్లపుదిశగా పారుతున్న
నీటిపాయను పెనవేసుకోగా
మోడుబారిన కాండముతో
కార్యమేమని నీరు మౌనంగా సాగె!
ఒంటరి కలువకాడ బ్రతకలేక
కడతేరనులేక జ్ఞాపకాలే తోడని
నిశ్శబ్ధపు ఘోషలో తనకి తానే
తడిసి నిటారుగా నిలచి..
నీరు పల్లమెరిగినా నిజమైన
ప్రేమ తప్పక పండునని ఆశగా
కపటంలేని కలువ సృష్టి తీరును
ఎదురీది ఎదురు చూస్తుండె!
Subscribe to:
Posts (Atom)