నిశ్చలంగా..

పోగుచేస్తున్నా చిందరవందరగా పడిఉన్న భావాలను
పదిలపరిచే ప్రయత్నంలో మదిని శుభ్రపరుస్తున్నాను!

వర్షంలో తడిసి చల్లబరిచాను వేడెక్కి ఉన్న వ్యధలను
వసంతాన్ని కౌగిట్లో బంధించి బ్రతిమిలాడుతున్నాను!  

చిగురాకుల మధ్య చిందులేసి పిలిచా చిరునవ్వులను
పంటపొలాన్ని ప్రేమతో పలుకరించమని కోరుతున్నాను!

కమ్మని పాట పాడమంటున్నా కానరాని కోయిలమ్మను
ఎదలో మరుమల్లెలు పూయించమని అడుగుతున్నాను!

జాలువారగా జారిపొమ్మంటున్నా జాబిలమ్మ హొయలను
తుమ్మెదొచ్చి తాకినా తడబడరాదని అనుకుంటున్నాను!