కాయగూరలతో కబుర్లు!!!

పద్మా...పూలపై, ప్రేమపై, జీవితంపై ఇన్ని రాసావు...మమ్మల్ని రోజూ ఉపయోగిస్తూ కూడా ఒక్కటైనా మాగురించి వ్రాయాలనిపించలేదా? అంటూ ప్రశ్నించాయి....
ఏమి వ్రాయాలా అని ఆలోచిస్తున్న నాతో...
వంకాయ...వద్దు వద్దంటూనే వండిన విధంగా వండకుండా వివిధ విధాల్లో వండుకుని తింటారంటూ వయ్యారాలుపోయింది.
బెండకాయ...జిగురని, ముదురని, పుచ్చని అంటారేకాని అందరికీ నా తెలివితేటలు ఎంతైనా అవసరమంది.
చిక్కుడుకాయ...చిన్నగా, సన్నగా, గింజవున్నా, లేకపోయినా చీల్చి చెండాడి నారతీసి మరీ వండుకుంటారని చిన్నబోయింది.
గుమ్మడికాయ...ఆకారంలో పెద్దనైన నాకు కూరల్లో మొదటి స్థానం ఇవ్వకపోయినా గృహంలో అడుగిడాలంటే నేను లేనిదే జంకుతారెందుకంటూ గుసగుసలాడింది.
మునక్కాయ...ముక్క ముక్కలై నేను మునగనిదే సాంబారుకి రుచెక్కడిదంటూ ముద్దు ముద్దుగా మూలిగింది.
సొరకాయ...సొంత సోది నాకు లేదుకాని పప్పుకి, దప్పళానికి నేను చేదోడు వాదోడునంది.
దొండకాయ...పండుగా నేను పనికిరానని, చిన్నదాన్నైనా ఉడకడానికి కాస్త బెట్టు చేస్తానంటారే కాని నన్ను ఇష్టపడేవారున్నారంది.
కాకరకాయ... చేదు చేదంటూనే దాన్ని విరచడానికి విశ్వప్రయత్నంచేసి ఆరోగ్యానికి మంచిదని కిమ్మనకుండా కమ్మగా తింటారంది.
అరటికాయ...అల్లం, ఆవపోపుతో నన్ను అలంకరించి మరీ ఆరగిస్తారు అది చాలు నాకంది.
మిరపకాయ...నేను లేనిదే మిగతా కూరగాయలకి ఉనికెక్కడిదంటూ, మీసాలు మెలివేస్తూ మిడిసిపడింది.
పొట్లకాయ...పొడుగైనదాన్నని పొగరునాకేల, పనిజరగాలి కాని పొగడ్తలతో నాకు పనియేలనంది.
టమాట...కూరగాయల సామ్రాజ్యానికే మహారాణిని, నాకు వేరొకరితో పోలికేలనంది.
దుంపకూరగాయలు...దురదని, వాతమని మా జాతిని ఎవ్వరూ వదలకుండా పిండి పిప్పిచేసినా మాకు ఆనందమేనంటూ ఆలు(బంగాళా దుంప) అలవోకగా నవ్వింది.
ఆకుకూరలు...అతితక్కువ ధరలో అందరికీ అత్యవసరమైన ఆహారం మేమేనని అదే మాకు ఆదర్శమంది.
క్యాబేజి, క్యారెట్, కాలీఫ్లవర్...దొరలనుండి దొరలి వచ్చినా మాకు భాష రాకపోయినా కాకాలు పట్టవలసిన అవసరం లేదు, ప్రస్తుతం మాదే పైచేయంది.
పద్మా!! మా పలుకులెప్పుడు ఆలకిస్తావంటూ ఫలాలన్నీ పరుగున వస్తున్నాయండి!!!
అమ్మో!!...ఇదేదో పోటీల వ్యవహారంలా తయారయ్యేటట్లు ఉందండి!!!
ఇంతటితో ముగిస్తాను.....చిత్తగించండి!!!

జీవితం నాకు నేర్పింది..

జీవితం నాకు నేర్పింది..
ఎవ్వరిమీద ఆధారపడవద్దని
ఆత్మవిశ్వాసమే నీ ఆయుధమని!

జీవితం నాకు నేర్పింది..
నన్నునేను ప్రేమించమని
ఎదుటివారిలో మంచిని ఎంచుమని!

జీవితం నాకు నేర్పింది..
నీకు ఏదీ చెడుగా కనపడదని
ఎదుటివారి దృష్టితో చూడమని!

జీవితం నాకు నేర్పింది..
నీదికానిదానిపై మక్కువ వలదని
దక్కిన దానితో తృప్తి పడమని!

జీవితం నాకు నేర్పింది..
మంచివాడు మోసం చేయలేడని
మోసగాడు మంచిని చూడలేడని!

జీవితం నాకు నేర్పింది..
సంతోషాన్ని నీవు వెతకవద్దని
వెతికితే సంతోషం దొరకదని!

పువ్వుని పలుకరిస్తే!!

పువ్వుని పలుకరిస్తే!! వాటికే చూపొస్తే!!
చామంతికి చేరువైతే చైతన్యాన్ని ఇస్తానం
టుంది.
కలువని కలవరపెడితే కంటిపై కునుకు కరువౌతుంది.
గడ్డిపువ్వు గ్రహణం పట్టిన వేళ గరగనై గతించిపోతానంది.
బంతితో బంధాన్ని పెంచుకుంటే భారమై నిన్ను బాధిస్తుంది.
గన్నేరు గళమందు చేరితే తనువంతా గజగజ లాడుతుంది.

తంగేడుకి తళుకులు తక్కువని తనలో తానే మదనపడుతుంది.
గులాబిని గుబులుపుట్టిస్తే గునపమై గుండెలో గుచ్చుకుంటుంది.

మొగలిపువ్వా మోహించమంటే మాలగా నేను పనికి రానంది.
సంపంగితో సరసాలాడితే వాసనేగాని సావాసానికి తగనంటుంది.
నందివర్థనాన్ని నేచేరుకుందామంటే నటరాజుకే తానంకితమంది.
కనకాంబరాలపై కరుణ చూపితే కటాక్షించి కనువిందు చేస్తానంది.
మందారాన్ని మరులుగొలిపితే మమతలమాలై నన్నల్లుకుంటానంది.
పారిజాతాన్ని పరిణయమాడదామంటే పవళింపు వేళ నేపనికిరానంది.
మల్లె సువాసనల మత్తులో మంచిని మరువకని మెల్లగా మందలించింది.
ఉమ్మెత్తా నీవు ఊసులాడవేమంటే ఊహలలోకూడా నా ఊసెక్కడుందంది.
కుంకుమపువ్వా నీకు కులుకులేలనంటే, కాసులతోనే తన కాపురమంది.
పొద్దుతిరుగుడుతో పొందుకోరితే సూర్యుడు పొంచి చూస్తున్నాడంటుంది.
మరువం మమకారమే లేదు మీకు నాపై నేను పువ్వునేకాదు పొమ్మంది.

ఓ పుష్పమా!!

పుష్పమా!! నీవింత సుకుమారమా!
తుమ్మెద వాలితేనే త్రుళ్ళిపడేంత భయమా!
గాలికి కూడా ఊగిసలాడే అంత బేల తనమా!!!

ఇలలోని రంగులన్నీ నీకే సొంతమమ్మా!
భగవంతునికి మాకు మధ్య వారధివమ్మా!
ప్రేమను తెలిపే ఒక సాధనం నీవమ్మ!!!

నీ సువాసనలన్నీ మేము దోచుకుంటాము!
జ్ఞాపకాల గుత్తులుగా నిన్ను దాచేసుకుంటాము!
నిన్ను చూసే నవ్వడం మేము నేర్చుకున్నాము!!!


నీవు మౌనంగానే ఊసులాడగలవేమో!
చలికి ముడుచుకుని చెమ్మగిల్లుతావేమో!
తెల్లవారితే మరల నీవెట్లు విరబూయగలవో ఏమో!!!

వినతి!!!!

నా ఊహలనే నీ బాసలుగా అనుకున్నానని, ఎదురు చూపులతో నీకై నిరీక్షిస్తూన్న నన్ను మౌనంగా ఉండనీకు.

నాకున్న తావు నీగుండెలోనేనని మనసుతో ఆడుకోవడం నాకు రాదని, తెలిసి ప్రేమలో నన్నోడిపోనీకు.

నీవు కాదన్న నాడు నేను లేనే లేనని నీతో జీవించాలనుకున్నానని, నా జీవితంతో ఆడుకోకు.

నేను కన్న కలలన్నీ నీ కళ్ళతోనేనని, కష్టసుఃఖాల్లో నీతోడు నీడై ఉంటానని మరచిపోకు.

నా మనసొక వాగై ఈ వెల్లువలో ఎటుపోతుందోనని, భీతిల్లిన నన్ను ఒంటరిని చేసిపోకు.

నా జీవనయానంలో చుక్కానివై దరిచేరి నన్ను ఒడి చేర్చుకుంటావనే నమ్మకాన్ని వమ్ముకానీకు!!!

కలువ(పద్మ) వ్రాసిన కవిత...

గుణింతముతో కలువ(పద్మ) వ్రాసిందొక కవితను..

కాస్తంత మీ సమయాన్ని వెచ్చించి చదవమంటాను..

కించిత్ దయ ఎదుటివారిపై చూపమంటాను..

కీర్తి ప్రతిష్ఠలకై ప్రాకులాడడం ఏలంటాను..

కుబేరుడేల కుచేలుడిలా ఉండమంటాను..

కూడబెట్టినవి ఏవీ మనవెంట రావని అంటాను..

కృత్రిమమైన ప్రేమాభిమానాలు వలదంటాను..

కౄరత్వాన్ని మించిన పాపమేదీ లేదంటాను..

కెంపులు, కాసులు మనకెందుకని అంటాను..

కేటుగాళ్ళతో సహవాసమే మనకి వద్దని అంటాను..

కైలాసగిరికి మార్గము మంచితనమేనంటాను..

కొద్దో గొప్పో మంచిపేరుంటే అదే చాలనుకుంటాను..

కోటి విద్యల కూడులో కొంతైనా పరులకి పెట్టాలంటాను..

కౌసల్య సుప్రజా రామలకి కొంత సమయం కేటాయించమంటాను..

కంటికి కునుకు పడ్డాక పరుపైనా కటికనేలైనా ఒకటేనంటాను..

కః తో ఏదైనా ఒక మంచి మాటని సెలవీయండని అంటాను.!!!!

ఆనంద ఊయల!

మనసు విప్పి మాట్లాడు!
నీలోని భావాలకి ఒక రూపం ఏర్పడుతుంది.
చిలిపి తగవులతో నాతో పోట్లాడు!
బుజ్జగించడానికి నాకొక వంక దొరుకుతుంది.

మనస్పూర్తిగా నన్ను ప్రేమించు!
ఆ ప్రేమే జీవితానికి ఒక ఆలంబనమౌతుంది.
అంతులేని అనురాగాన్ని చూపించు!
అనురాగమే నా ప్రేమకి ఒక ఆకారాన్నిస్తుంది.

నీ కంటిపాపలో నన్ను సింగారించుకో!
లోకమంతా రంగులమయమై కనిపిస్తుంది.

నీ పెదవులపై చిరునవ్వుగా నన్నుంచుకో!

జీవితమే ఆనంద ఊయలై ఊగుతుంది.....