సప్తహృదయ రాగాలు...

ఈ హృదయ రాగాలు, నావి కావు వేరొకరి భావాలు...
కలల బాటసారి కవితాపధం నుండి జాలువారిన పలుకులు...
నా హృదయపధంలో చెరగని ముద్రవేసిన సరాగాలు ...
మీ సహృదయాలను మెప్పిస్తాయేమో చూడాలి ఈ కవితలు!

గతకాలపు జ్ఞాపకాలు
విత్తులే కదా అని ఓ మూలకి విసిరేసా
ఊడలతో సహా పెరిగి
మనసంతా అల్లుకుపోయాయి!

నేనీ జీవితంలో ఒంటరిని
నేను నీ సమక్షంలో సమస్తాన్ని
నేనీ పయనంలో అలసిన ప్రాణాన్ని
నేను నీ తోడులో అలుపెరుగని పయనాన్ని!

మౌనం నీదైనప్పుడు,
నిశబ్దాన్ని మించిన శబ్దం లేదు.
పయనం నాదైనప్పుడు,
నిలకడని మించిన పరుగూ లేదు!

జరిగేదేది జరగక మానదు
జరిగిన దానితో జీవితం ఆగదు
సమాధాన పడకపోతే దారినిండా ముళ్ళే
చిన్ని సూత్రం తెలిస్తే సెలయేటి ఉరవళ్ళే!

నిన్న నీకు ఆద్యంతాన్ని
నేడు ఒట్టి ఏకాంతాన్ని
నిన్నటి పరిచయానికి అపరిచితుడ్ని
నేటి ఏకాంతానికి చిరకాల మిత్రుడ్ని!

రోజూ చూపులు కలిసినా..
గాలితో ఊసులు పంపినా..
చినుకులతో తనువంతా ముద్దాడినా..
కలిసేదుందా నింగీ నేలా యేనాటికైనా??

పువ్వు నవ్వెందుకు చెరపడమని కొమ్మనుండీ తుంచలేదు
చూసీ ఎందుకు తెంచి ముద్దాడలేదని రాలాక తగువాడింది.
చెలికి చింతెలనని నే చితినెంచుకుంటే.........
మరో గూటికి చేరి, తన గొంతుకోసానని తెగడుతోంది!

13 comments:

  1. నిన్న నీకు ఆద్యంతాన్ని
    నేడు ఒట్టి ఏకాంతాన్ని
    very good one...

    మీ దగ్గర మంచి కలక్షన్ ఉన్నట్టుండి.. అన్నట్టు.. చాల రోజుల తరువాత మీ బ్లాగ్ దర్శనం చేసాను.. కొత్త చిత్రాలు జోడిన్చినట్టున్నారు.. వెరీ గుడ్...again..

    ReplyDelete
  2. మౌనం నీదైనప్పుడు,
    నిశబ్దాన్ని మించిన శబ్దం లేదు.
    simply very good

    ReplyDelete
  3. గతకాలపు జ్ఞాపకాలు
    విత్తులే కదా అని ఓ మూలకి విసిరేసా
    ఊడలతో సహా పెరిగి
    మనసంతా అల్లుకుపోయాయి!

    Excellent.. caalaa baaguMdi.

    ReplyDelete
  4. " చాలా బాగుందండి :) "
    అందుకే,
    అతివలు అర్థంకారు, ఒకవేళ అర్థమైంట్లు అనిపించినా, అర్థం చెసుకోగలిగింది "అర్ధ" మాత్రమే అని అర్థమై!
    అర్థాంతరంగా, అన్నీ వదలి ,
    ప్రయత్నిస్తున్నా!
    ఈ "సభ్య" సమాజంలో ఏకాంతంగా బతకటానికి.

    ReplyDelete
  5. చాలా చాలా బాగుంది..మరీ ముఖ్యం గా మొదటి పేరా ........ హరివిల్లు లాగా అందం గా ఉంది మీ కవిత

    ReplyDelete
  6. పద్మార్పితగారు మీ కలెక్షన్స్ సూపర్... ఆ బ్లాగ్ లింక్ కూడా ఇచ్చుంటే ఇంకా బాగుండేదేమో!

    ReplyDelete
  7. చాలా బాగున్నాయి..ముఖ్యంగా మొదటి నాలుగు లైన్లు...

    ReplyDelete
  8. అర్పిత,
    నా కవితలు నచ్చినందుకు నలుగురి మెప్పు పొందేలా చేసినందుకు Heartful of thanks.

    ReplyDelete
  9. బాగుందండీ..
    క్రాంతికుమార్ గారూ, అభినందనలు..

    ReplyDelete
  10. చెలికి చింతేలనని నే చితినెంచుకుంటే.........
    మరో గూటికి చేరి....అసాధారణమైన తలంపు. నిజమైన ప్రేమ త్యాగాన్ని కొరుతుందంటారు. కాని ఈనాటి ప్రెమల్లొ కంటికది కానరాదే. ప్రేమకు భాష్యం తెలియక కొందరు చితినెంచుకుంటే పీడవిరగడైందని సంతసించేది మరికొందరు. అది కాదుగా ప్రెమంటే. తెలియని శాశ్వతమైన ప్రెమ ఏదొ మనవాళిని నడిపిస్తుంది. అది తెలిసిననాడు నిజమైన త్యాగమేమిటొ తెలియకమానదు. అందాకా....
    అనందమయ జ్ఞాపకాలు అల్లుకుపొవాలి..
    అవి విషాదమై మరణపాత్రమైతే అల్లుకున్నా మాడి మసై పొవాలి..
    ఒంటరి జీవితమైనా తొడొకరుంటారంటారు - ఎవరొ తెలియాలి..
    సమాధానం వెదికి వెంటాడమంటారు - మార్గం తెలియలి..
    ---తప్పదేమూ ఇక వెదుకులాట దొరికేవరకు ప్రశాంతత---
    ఈ చక్కటి భావ కవితలు వెలుగులొకి తెచ్చిన పద్మార్పితగారు మీ స్పూర్తికి నా జొహార్లు.... కొనసాగించండి. క్రాంతికుమార్ గారూ చాలా బాగున్నాయి..

    ReplyDelete
  11. This comment has been removed by the author.

    ReplyDelete
  12. Blog is well designed. poems are good. paintings are excellent. Your profile inspired me to write the following few lines.

    నేను
    ఉదృత తుఫానులో చిక్కుకొని దారి తప్పి తిరుగాడుతున్న
    ఓ కన్నీటి చుక్కను
    సువిశాల సముద్రంలో ఉనికిని కోల్పోయి ఈదులాడుతున్న
    ఓ వర్షపు చుక్కను
    విస్తరించిన ఎడారిలో నా సహచరులతో కలసి వేడెక్కుతున్న
    ఓ ఇసుక రేణువును
    అలలు అలలుగా ప్రవహిస్తూ అలుపెరగక పరుగెడుతున్న గాలికి
    అర్పిస్తున్న ప్రాణ వాయువును
    తన చల్లని ఒడిలో బంధించి లాలిస్తూ కాపాడుతున్న ఒడ్డుకు
    సమర్పిస్తున్న పయోనిధి ముద్దును

    నేను
    జీవన పరిమళాన్ని అద్దేందుకు కొన్ని పుటల్ని మిగుల్చుకున్న
    తెల్ల కాగితాల పుస్తకాన్ని
    బాధిత నయనాల జాలువారుతున్న కన్నీటిని తుడిచేందుకు
    చాచిన చిటికెన వ్రేలును
    ధరిత్రిపై నడయాడుతున్న
    అనుభూతుల ఘనీభవ దృశ్యాన్ని

    నేను
    ఓ నమ్మకాన్ని
    ఓ కమ్మని కలని
    అవని అంతా అల్లుకున్న అమ్మతనాన్ని
    నేను
    ఈ విశాల విశ్వంలో నిరంతంగా పరిభ్రమిస్తున్న ప్రాణస్పందనను

    ReplyDelete