నీలిమబ్బుల వంటి కలల సామ్రాజ్యంలో
అరవిరిసిన విహంగాలు
ఊహా సౌధాలు..
చంద్రుడు మబ్బుల
మాటున నక్కెననో
తారలు షికారుకెళ్ళి
ఇంకా తిరిగి రాలేదనో
వంకలు కొన్ని వెతికి
రేయిని పొడిగించరాదా
ఊహలతో మరిన్ని ఊసులు
చెప్పనీయరాదా!
మేఘమా! చంద్రుడ్ని
మాయచేసి ఒడిసిపట్టి
వెన్నెలనే దోచి కలల
కలువల్ని విప్పారనిచ్చి
అంబరాన్ని అవనితో
సంధిచేసి సంబరపడరాదా!
ఎగసే సాగరకెరటాల
వంటి భావ అలజడులలో
హత్తుకున్న
కోర్కెల్లేవు, కొట్టుకుపోయినవీ లేవు
స్థిర సంకల్పానికి
నిర్ధిష్టమైన రూపం ఒకటిచ్చి
పట్టుదలని పరిచయం
చేసి ప్రణయంగా మార్చి
అంధకారానికి
వెలుగుతో పరిణయం చేయరాదా
గమ్యాన్ని సరిగమ
సరాగాలతో శింగారించరాదా!