వానకు తడిసిన గోడలు కూలిపోయినట్లుగా
మమకారమున్న మనసుపొరలు మాసిపోతే
నిర్లిప్తభావాలు నిస్సంకోచంలో సగం చిట్లిపోయి
గోడ పై అందంగా పేర్చబడ్డ గాజుముక్కలయ్యే!
గెలవాలన్న ప్రయత్నం యుద్ధం చేసినా కూడా
వందమార్లు ఓడి నూటొకటవసారైనా గెలవలేక
వానవెలిసాక కరెంటుతీగకు వేలాడే నీటిచుక్కలై
చేతకాని ఆశలన్నీ ఆత్మహత్యకు తయారయ్యే!
ఇంధ్రధనస్సే విల్లై వంగి ధైర్యమే దూసుకురాగా
నిబ్బర నిక్షేపాలు ఉరుములై వెచ్చని ఊపిరైతే
నీడ కంపించి నిజాలెన్నింటినో కక్కి నిలకడనిస్తే
చూరట్టుకు వ్రేలాడుతున్న సూక్తులే జారిపొయ్యే!
పదాలు వెచ్చని పందిర్లు కాగా నిశ్శబ్దం నవ్వగా
ఓర్చుకోలేనన్న బాధని ఉప్పెనైనా ఊరడించలేక
ముసురు పట్టిన భావాలు బురదలో కొట్టుకుంటూ
విరిగిన చెట్టుకొమ్మపై నిలచి శోధనకి సిధ్ధమయ్యే!