ప్రేమలో పట్టా...


ప్రేమ గురించి తెలుసుకుని పట్టా పుచ్చుకోవాలని
ప్రాధమిక తరగతికి వయ్యారివయసు పరిగెట్టెళితే
పరువాలని పసిడి మేని ఛాయని పైపైన చూసి
కొలతలేస్తూ దరికొచ్చి గుండెలోతు ఎంత అనడిగి
గుట్టు చప్పుడు కానీయకంటూ ఆరాలు చెప్పమని
అక్కడక్కడా తడిమినట్లుగా చూసి అప్లికేషన్ ఇచ్చె!

ప్రేమ ఓనమాలు దిద్దాలంటే ఇవి తప్పదనుకుని
అర్థమైనా కానట్లుగా వ్యంగ్యమైన ప్రశ్నలు పూరిస్తే
పైటలోని అందాల్ని తినేలా చూస్తూ గుటకలు వేసి
లేని జ్ఞానం ఉన్నట్లు మతలబు లేకుండా మాట్లాడి
శృంగారమే శ్రీకారమంటూ తెలివితేటలతో బొంకుతూ
పిటపిటలాడే పిల్ల బాగుందని పట్టుకునే ప్లాన్ వేసె!

ప్రేమ గురించి పుస్తకాల్లో చదివిన మాధుర్యమేదని
వెతకబోవ ప్రేమాక్షరాభ్యాసానికే ఇన్ని ఆటంకాలొస్తే
ఉన్నతమైన వలపుని ఎక్కడో వెతికి ఒడిసిపట్టేసి
జివ్వుమంటున్న జిజ్ఞాసలకి అందమైన రంగులద్ది
మనసునేం మభ్య పెట్టవల్సిన పనిలేదని సర్దుకుని
ప్రేమపాండిత్యంకి ప్రాక్టీస్ అవసరంలేదని వదిలేసా! 

ఏదో ఆశా..

నిరాశావేదం వదన్నకొద్దీ వెంటాడి వేదిస్తుంటే
కవ్వించే కమ్మని కల్లబొల్లి కబుర్లు ఏంచెప్పను

ఆశల అంకురార్పణకి ఆదిలోనే చెదలు పడితే 
ఆశయాలనే రెమ్మలతో పూయమని ఏంకోరను

ఆవిరైన కన్నీట పెదవులు ఆరిపోయి పగిలితే
ఆనందం ఆమడదూరంలో ఉందని ఏంచూడను

నిజాలన్నీ నిర్వికారంగా నవ్వి బేలగా చూస్తుంటే 
మంచికాలముందని అబద్ధపు భరోసా ఏమివ్వను

అక్కరకురాని ఆవేశం అదునుచూసి మరీ ఆడితే
అదుపు తప్పవద్దని అంతరంగాన్ని ఎలా ఆపను

అహర్నిశలూ ఆలోచనలతో మెదడు తపనపడితే
అద్భుతమే జరిగేనని వెర్రీఅశతో ఎదురుచూస్తాను!   

వలపుచెర

వసంతమై నీవు ఉరకలు వేస్తూ వచ్చి వాలితే
మల్లెలతోటలో కోయిలనై నేను పాడుతుంటాను!

నిండు పున్నమి వెన్నెలవై నువ్వు విరబూస్తే
చంద్ర కిరణకాంతులు విరబూసే కలువనౌతాను!

వేసవిమాటున చిరుజల్లులా నీవు వర్షిస్తానంటే 
ఏడురంగుల ఇంద్రధనస్సునై వెల్లివిప్పారుతాను!

వలపు సంగీతానికి పల్లవిగా నీవు జతకూడితే
నర్తించే మువ్వనై సరాగపు చిందులు వేస్తాను!

మమతానురాగాలను మనసువిప్పి రుచిచూపిస్తే
మనసున్న మగువగా నిన్ను చేరి మైమరిచేను!      

నీ శ్వాస ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలు నేనే అన్నావంటే 
మనిరువురి ప్రేమకి ప్రాణము నేనై ఊపిరిపోస్తాను!

ఏడేడు జన్మల జతే కాదు, సర్వం నేనని పలికితే
వలపుచెర బంధీనై ప్రేమకు పర్యాయ పదమౌతాను!
  

అక్షరాభయం

ఒకమారు రెండు అక్షరాల "ప్రేమ"ని

మూడు అక్షరాల "మనసు"తో తెలుప

నాలుగు అక్షరాల "ప్రవర్తన" బయటపడి

ఐదు అక్షరాల "అనుభూతులు" మిగిల్చి

ఆరు అక్షరాల "పరాజితపాలు" చేస్తేనేమి

ఏడు అక్షరాల "అనుభవసారము" వచ్చె..

ఎనిమిది అక్షరాల "పరిజ్ఞానసామ్రాజ్యపు" పట్టాతో

తొమ్మిది అక్షరాల "ఆశలసౌధాశిఖరము" ఎక్కితే

పది అక్షరాల "పరిపూర్ణజీవితనెలవు" అగుపించె!

పరిపక్వతని పదిఅక్షరాల్లో చూసి పద్మార్పిత నవ్వ..
అక్షరం అజ్ఞానాన్ని తొలగించే అక్షయపాత్రగా వెలసె!  

తప్పు??

గాజుముక్కలే కొన్ని గుండెని గుచ్చుతున్నాయని
మోము అందాన్ని చూసి మనసుని అంచనావేసి
మదిని ముక్కలుగా విరచి బంధాన్ని బీటలుచేస్తే
అది తన ఉనికిని చూపడమే తప్ప తప్పు కాదు
నిన్ను తన ఉనికిలో చూడాలనుకోవడం నీ తప్పు

లోకం లోటుపాట్లు ఎంచి మన లొసుగుల్ని దాచి
మన తప్పేం లేదని నిందలు ఎదుటి వారిపై వేసి
సొంత సమస్యల్ని సోమరిపోతువై గాలికి వదిలివేస్తే
ఒంటరితనమే నీకు శత్రువైన తప్పు దానిది కాదు
పరిణితి చెందకనే అంచనాలతో అడుగేయడం తప్పు

వ్యధలు వేడుక చేసుకుంటున్నాయని వేసారి వగచి
ప్రయత్నం చేయకుండా ఫలితం లభించలేదన్న కసి
మదిలో నింపుకుని రాని వినలేని రాగాలు ఆలపిస్తే
పట్టుదల లేకపోవడం తప్పు కాని విధి తప్పు కాదు
వచ్చిన పని చేరవలసిన గమ్యాన్ని మరవడం తప్పు

కొసరు కాపురం

కొంటెగా తుంటరివై కొన్నాళ్ళు కాపురముండు
ఆ పై కరిగి చెదిరిన కలని కాలం గడిపేస్తాను

ముఖం పై కొన్ని ముద్దుమురిపాల రంగులద్దు 
గాట్లు పడితే సలిపే గాయాలని సర్దుకుంటాను 

హత్తుకుని హద్దుదాటిన ప్రతిబింబమై అగుపించు
సిగ్గుదొంతర్ల చీర చుట్టుకుంటినని సంబరపడతాను

బిడియం వీడమని బ్రతిమిలాడి వలపుసెగ రేపు
రగిలి చల్లారిన కోరికల్ని కిమ్మనరాదని కట్టేస్తాను

చిలిపిచేష్టలకి తుంటరి తెగులు అంటించి చూడు 
సరసం సంగీతరాగం ఆలపించెనని ఆడిపాడతాను

ప్రణయపు పరిమళాలను చేయి పసందైన విందు
ఆ పై వెళ్ళలేని నీతో కొన్నాళ్ళు కాపురమంటాను   

కలయిక

నువ్వు వస్తావని తెలిసిందే తడవుగా
అంబరమంత సంబరం గుండెల్లో గూడుకట్టి
నింగీ నేలా ఏకమై పోవాలంటుంది...
చెల్లాచెదురైన కోరికల్ని కుప్పగా పోసి
చెదిరిన స్వప్నాలని తిరిగి కలగంటుంది!

నిన్ను తనివితీరా చూసిందే తడవుగా
సప్తస్వరాలు హృదయాన్ని మీటి వెన్నుతట్టి
మౌనంగా ఏకమయ్యేలా ప్రేరేపిస్తుంది...
సిగ్గుదొంతరలకు సెలవిచ్చి సంభాషించమని
చేజారితే అవకాశం మరలరాదు పొమ్మంది!

నీ అనురాగంలో నే తడిసిందే తడవుగా
గ్రీష్మఋతువు తాళలేనంటూ గింగిరాలుచుట్టి
వసంతాన్ని విరబూయమని కబురంపింది...
బిడియం వీడిన మనిద్దరి కలయికని చూసి
సప్తవర్ణాల వైకుంఠము మన నెలవౌతుంది! 

వలపు గ్రంధం

ఎదను అల్లరిపెట్టి మురిపించే భావాలని
హృదయ కుంచెతో ముచ్చటగా చిత్రించి
వలపు గ్రంధాన్ని అలవోకగా లిఖించనా!

 కలల కాపురం కనురెప్పలపై నివాసమని

అంబరాన్నున్న మెరుపుతారని చూపించి
ఎదిగిన ప్రేమ శిఖరం పై జెండా పాతిరానా!

ఆపాలనుకున్నా ఆగని మది సవ్వడులని

గీతంగా వ్రాసి రాగాన్ని జతచేసి ఆలపించి
ప్రేమలోని రెండక్షరాలు మనమని చెప్పనా!

ఇరు ఊపిర్లకు సులువైన మార్గం కలయికని

 కలిసి కన్నీరిడి ఎదపై తలవాల్చి నిదురించి
వలపు సరిహద్దులే దాటామని నిర్ధారించనా!

నా మది


అంతర్ముఖ కల్లోలిత అంతరంగం అనుకోకు
ఆందోళనలతో కలవరపడిన అంతఃపురమది


అంతర్యమంతా ప్రేమ నిండిందని పొరబడకు
ఆరని వేదనలని నిద్రపుచ్చుతున్న గూడది


అరవిరసిన అందాల నందనవనం అనుకోకు
ఆర్ద్రతామిళిత ఆలోచనలతో ఆరి వెలిగిందది


అలరించే సరాగ సరిగమ రాగాలు వెతుకకు 
ఆవేదన్ని జాలువార్చే విషాదగీతాల నెలవది


అందమైన అక్షరాలతో అల్లినమాల అనుకోకు 
ఆవేశాలకు ఆనకట్టలువేసి అణచిన భావమది


అరమరికల అంతస్తులతో అమరిన మిద్దెనకు 
ఆప్యాయతతో అక్కున చేర్చుకునే పూరిల్లది!

ఆ అనుభూతులు

గుర్తుందో లేదో నీకు అలనాటి సంధ్యవేళ
నీరెండ కులుకుల్లో నీ మాటలు మెలిపెట్ట
విడిపోలేని మన శ్వాసలు చేసిన బాసలు
చురుక్కుమన్న నీ చూపుల చమత్కారంతో 
మనసాయె చెమక్కులు కావు నీ జిమిక్కులు!

గమనించావో లేదో ఆనాటి సద్దుమణిగినవేళ
అల్లుకున్న వలపుల్లో అయిన అధరాల గాట్లు 
నీవు చేసిన అల్లరికి కందిన తనువు వంపులు
వేడి తాళలేక విచ్చుకున్న కోరికల కవాటాలతో
సాగిన రాసలీలకి కుళ్ళుకున్న వెన్నెల సెగలు!

గిలిగింత జ్ఞాపకముందో లేదు నాటి పొద్దువేళ
జాగారం చేయించి జారుకోమాకని నడుం గిల్లి
దాహం తీరలేదని తడిమిన తిమిరపు లోయలు
లేవబోవ బాహువుల బంధిట్లో పరస్పర రాపిడ్లతో
సన్నగా మూల్గి సిగ్గుతో ఒదిగిన సరస సరాగాలు!

గడిచిన గతం మరలి వచ్చునో లేదో తెలియనివేళ
ఆ తీయని తలపులే తుమ్మెదలరోదనై జివ్వుమన
బంధించలేని అలసిన మనసు చేస్తున్న అలజడులు
స్మృతుల ప్రవాహాన్ని గతకాలపు కలల సాగరంతో 
సంధి చేయలేక నెమరేసుకునే మధురానుభూతులు!

ఎవ్వరు?

నేను నువ్వు అలిగి కలత పడితే
బ్రతిమిలాడి అలుక తీర్చేది ఎవ్వరు?
నేడు ఇరు హృదయాలు బీటబారితే
అతుకువేసి గాయం మార్పేది ఎవ్వరు?
నువ్వు నేను మౌనంగా ఉన్నామంటే
ముందుగా మౌనం వీడేది ఎవ్వరు?
చిన్ని విషయానికి పెద్దరాద్దాంతం చేస్తే
బంధాన్ని పీతముడేసి బిగించేది ఎవ్వరు?
నేనూ ఏడ్చి నువ్వూ కంటనీరు పేడితే
కన్నీరు తుడిచి బుజ్జగించేది ఎవ్వరు?
నువ్వు నేను ఇద్దరం రాజీకి రాకపోతే
మరి క్షమించి దయతో కట్టేసేది ఎవ్వరు?
నీలోను నాలోను అహం గెంతులువేస్తే
అహాన్ని అణచి అలసట తీర్చేది ఎవ్వరు?

ఎవ్వరికీ సదా సొంతమవని జీవనయాత్రలో
ఒంటరి గడియల్ని ఒడిసి పట్టేది ఎవ్వరు?
నువ్వు ముందో నేను ముందో కన్నుమూస్తే
మరలా రేపిలా పశ్చాత్తాపం పడేది ఎవ్వరు?

నాకు నీవు

గుండె గదిలో ఏదో ఒక మూల
ఎప్పుడూ తచ్చాడుతూనే ఉంటావు..
రేయింబవళ్ళు అలసటలేక అంతటా నీవై
ఆరని జ్యోతివలె వెలుగుతుంటావు....


ఆ వెలుగులో ఆనందం కానరాక ఆర్పనూలేక
నీ ఆలోచనలు వద్దన్నా గిలిగింతలు పెడితే 
నన్ను నీలో బంధించిన నిన్ను నింధించక 
నన్ను నేను తిట్టుకుని మనసు తలుపు తీసి 
నిన్ను పారద్రోలాలని ప్రయత్నించినా ఫలించక
ఏకాంత రాయబారమే జరిపి పంపించనూలేక.. 
సతమతమై ఎదురుగా లేని నీతో ఎన్నో ముచ్చటించి 
నా మనసుకు నేనే అలుసైపోతూ నీకు దగ్గరౌతాను! 

భరోసా..


నిన్ను నీవు అంతలా కాపాడుకోకు
పెనుగాలి తాకిడికి తట్టుకోలేవు
వానా వరదలొస్తే తడవక ఉండలేవు!

కన్నీళ్ళు ముత్యాలవంటివి రాల్చమాకు
పెదవులకి కొంచెం పని కల్పించు
పలుకుతూ పలుకరిస్తూ నవ్వి నవ్వించు!

వెన్నెల వెలుగులు తెచ్చి అద్దమనకు
మనసు మంచిదైతే ముఖమే వెలుగు
ఆత్మతృప్తి లేనిదే ఆనందంగా ఉండలేవు!

వ్యధలు నిన్నే అంటుకున్నాయి అనుకోకు
నీరెండవోలె వచ్చిపోతాయి నిమ్మళించు 
సమయానికవే సర్దుకుంటాయి గమనించు!

ఎప్పుడూ నీగురించి మాత్రమే ఆలోచించకు
మనసిచ్చి పుచ్చుకోమని ఎవరన్నారు
చేతిలో చెయ్యేసి నువ్వున్నావన్న ధీమానివ్వు!

మరోదారి

ప్రతి ప్రయత్నం ఒకదాని వెంట ఒకటి శత్రువై
రోజుకి ఒక ఆశని చేజార్చి నిట్టూర్ప జేస్తుంటే
ఇంకెన్ని వ్యధలు భరించే సత్తువ ఎదకుందోనని
ఎదురు దెబ్బలు ఎన్ని తగిలినా లేచి నిలబడుతూ
 కొన్ని జ్ఞాపకాల్ని మనోపల్కం పై పేర్చుకుంటాను!!

కాలిబాటన ముళ్ళెన్నో పాదాల్ని బీటబార్చినా
ప్రతి దారిలో పయనించి పొడిబారే ప్రోత్సాహానికి
మరో ఎండమావిని ఎరగా వేసి దప్పిక తీరుస్తూ
ఆశ్రువుల అలలే ఎగసి పొంగిపొర్లుతున్న కళ్ళలో
కొన్ని అందమైన స్వప్నాల్ని అలంకరించబోతాను!!

నమ్మకాన్ని వలచి గెలవాలని కంటి కాగడాతో వెతికి
విశ్వాసానికి బదులు ఛాతీ చీల్చిన నిరాశ గాయాలకి
ఓదార్పు లేపనం అద్దబోయి మరింత మంటరేపుతూ
ఏ ప్రలోభానికీ లొంగని శిరస్సును వ్యధభారంతో వంచి
క్రొత్తదారి దొరుకునని కంటి వెలుగునే పెంచుకుంటాను!!

ప్రేమో ఏమో!!

 అందరూ నన్ను వలచి దరిచేర ప్రయత్నిస్తుంటే
నేను నిన్ను వలచి నీకై వగచడం వెర్రని తలచి..
విధిలించుకోలేనన్న హృదయం వదిలించుకోబోవ 
పసిపిల్లాడిలా ప్రేమించమంటూ ప్రాకులాడతావు!!

అడ్డాలనాడే బిడ్డలు కాని గెడ్డాలనాడు కాదనంటే
అవసరానికి వాడుకునే అవకాశవాదిని కాదని..
ప్రాయం వచ్చినా పరిపక్వత కరువాయనంటూ
గెడ్దాలదేముంది అడ్డగాడిదలా ఎదిగినానంటావు!!

అజ్ఞానం అలముకున్న అమాయకుడివి నీవంటే
ఆ జ్ఞానమేదో ఆర్జించినాకే అగుపిస్తానంటూ పలికి..
పైకాన్ని కూడబెట్టి కాసుల మూటలు ముందుంచి
ధనమే అన్నింటికీ మూలమంటూ ఉపదేశించావు!!

అందలమెక్కిన నీకు అగుపించని అందం నాదంటే
నటించలేని నాలో కల్మషంలేని నవ్వు చూసానని..
తెగింపులేని నా వలచిన గుండెపై జాలిగా జారబడి
నన్నెరిగిన నాలో నీ ప్రతిరూపాన్ని చూస్తున్నావు!!

నా భావాక్షరాలు..


_/\_ఇది నా బ్లాగ్ లో 500వ పోస్ట్. ఇన్నాళ్ళు నన్ను ఆదరించి అభిమానిస్తూ నేను లిఖించిన అక్షరాల్లో అవకతవకలున్నా ప్రేరణ అందించిన అందరికీ పద్మార్పిత వినమ్రతా నెనర్లు_/\_

మంచుకురిసే వేళైనా మైకం కమ్మేస్తున్నా
ఆలోచనలు ఆరాటపడినా అలసట కాదన్నా
నా మనోభావనలకి రాయాలన్న ఈ తపన..
మది చేసిన అల్లరిని బయటపెట్టె వందసార్లు!

మమతానురాగాలు మోహమై కమ్ముకున్నా
ఆలాపనలు ఆరోహణావరోహణలై అడ్డుకున్నా
నా హృదయస్పందనల సవ్వడులే ఈ రచన..
ఉఛ్వాసనిశ్వాసలై కలతపెట్టె రెండువందలసార్లు!

మండుటెండలో మల్లెలు వికసించి కవ్విస్తున్నా
ఆవేదనలు అంతరంగాన్ని అదిమిపెట్టుకోమన్నా
నా భావం కాన్వాసుపై కుంచై చేసిందే ఈ నటన..
చిత్రాల్లో నగ్నత్వం కన్నుగీటె మూడొందలసార్లు!

మరులుగొల్పు మాటలు కలాన్ని కట్టడిచేస్తున్నా
ఆటుపోట్లై పలవరింతపు పులకింతలు ఆగనన్నా
నా కలం చేస్తున్న అక్షర వందనాలే ఈ భావన..
కలల వేదాంతమే చెప్పెనేమో నాలుగొందలసార్లు!

మంచిమాటల మాల అవకతవకలతో కట్టలేనన్నా
ఆగ్రహం చెందిన ఊహలే నన్ను కాదుపొమ్మన్నా
నా పక్షపు గెలుపుకి మీ స్ఫూర్తివ్యాఖ్యలే స్పందన..
మీ సహకారానికి నమస్సులు అయిదొందలసార్లు!

పోరాటం


పరచుకున్న మార్గం మొత్తం శూలాలని
ఉన్న సంబంధాలకు దుమ్మంటుకుందని
పరిష్కరించ ప్రతికూల పరిస్థితులు లేవని
తడుముకుని నీకు నీవు అవరోధం అవకు
లే లేచి నీ స్వంత మార్గాన్ని నీవే తవ్వుకో!



సూర్యుడు చీకటిలో గల్లంతు అయితేనేమి
రాతిరివేళ ముగియగానే తెల్లవారిపోయేను
కాంక్షలే నిన్ను కౌగిలించుకుని ఉన్నాయి
ఒంటరివైతివి అనుకుంటూ బెంబేలు పడకు
నమ్మిన సిద్ధాంత చట్టాన్ని నీవే నిర్మించుకో!



జీవనపోరులో మనోబలాన్ని విల్లుగా వంచి
కోరికల బలగాన్ని కొలిమిలో కాల్చి గట్టిచేసి
అడ్డంకులున్నా గెలిచే వరకు ప్రయత్నించు
నీ మనోధైర్యము వదిలేసి సహనం కోల్పోకు
సత్యానిదే విజయం అదే నీకు లక్ష్యం అనుకో!

నన్ను వీడకు

చినుకు పడి చిలిపి కోరిక రేగె మదిన
మనసా నీవు వలపు దాచి నటించకు
ఆ పై చెప్పలేదని నాపై నింద వేయకు.

యవ్వన ఋతువులా ఈడు జిల్లుమన 
పైర గాలివీచి పైట లేచెనని సర్దుకోమాకు
మాపటేల మబ్బుల్లో విరహాన్ని దాచకు.

పగ్గంలేని చంచల ప్రకృతి నన్ను రమ్మన
చెప్పకనే లేచిపోయానని పరువు తీయకు
మాయచేసి మంత్రమేసానని గేలి చేయకు.

ఎండ నీడ హృదయాన్ని తాకి ఆశ కమిలిన
ఆశ్చర్యపడి అణిగి ఉండమని ఆంక్షలేయకు 
నా కురుల గూడారంలో నన్నే దాగమనకు.

వలపు తెలిసిన ఒంటరితనం కౌగిలించుకొన
పగలే క్రూరమై రేయి హంతకుడాయె అనకు 
కలల వీక్షణల్లో వెర్రిదాన్నైనానని వీడిపోకు.  

మారిన ధ్యేయం!


నేనొక మైనపు ముద్దలా కరుగుతుంటే
పాచిన పనికిరాని పిండి పదార్థమంటూ
కాలానికి వేలాడకట్టి చోద్యంలా చూపితే
అసంతృప్తి ఆమ్లాన్ని మింగలేక కక్కలేక
తడికంటి దర్పణాల్ని శాశ్వితంగా మూయక
తటస్తీకరణ శక్తికావాలని కోరడం అవివేకం!


కాలాన్ని కోస్తూ ఒలికిపడుతున్న జ్ఞాపకాలు
గుండెను డోలకంలా అటుఇటు కదుపుతుంటే
ముసురు పట్టిన మస్తిష్కంలో నిండిన వేదన
విరహంతో తగువులాడి వలపునే లేపనమడుగ
కఠినమైన కారుణ్యానికి దారితెన్నులు కానరాక
ఒంటరి కుంచె వర్ణంలేని చిత్రం గీయడం విచిత్రం!


విధి వచనమెరుగనట్లు వక్రశైలిలో వివరమడుగ
సాంద్రత లోపించిన సద్గుణమే అద్దమై మెరవాలని
నిర్లిప్తత నిరాశలని శత్రువులుగా ఎంచి తూలనాడి
చిట్లిన గాయాలతో రోధిస్తున్న ఆశల్ని గుప్పిటనిడి
సొమ్మసిల్లిన ఆశయ మోమిట స్థైర్యం కుమ్మరించి
తడిసిన మైనాన్ని స్ఫటికంగా మార్చడమే ధ్యేయం!

తపన ఎందుకో!?

ధనంతో అన్నీ కొనగలం అనుకున్నప్పుడు
శ్వాసని సాంతం కొనలేక పోవడం ఏమిటో!!
కొనలేనప్పుడు ధనం పై డాబూ దర్పమేలనో
వట్టి చేతుల్తో వెళ్ళే మనకీ ప్రాకులాటెందుకో!?

అందమైన యవ్వనమే ఆకర్షణ అయినప్పుడు
చివరికి జీవితం అస్తిపంజరం అవ్వడం ఏమిటో!!
వంగి కృంగిపోయే దేహానికి సింగారం ఎందుకనో
మనసు స్వఛ్ఛంగా ఉంచక మూయడమెందుకో!?

భగవంతుడు అందరిలో ఉన్నాడని తెలిసినప్పుడు
నిస్వార్థంగా ఎదుటివారికి సేవ చేయం అదేమిటో!!
పూజలుచేసి దీపధూపాలతో పుణ్యాన్ని కోరనేలనో
ఆకలనని విగ్రహానికి తీర్థనైవేద్యం పెట్టడమెందుకో!?

అదృష్టం హస్తరేఖల్లో నుదుటిరాతల్లో ఉన్నప్పుడు
నిముషాల్లో మారిపోయే జీవితవిన్యాసాలు ఏమిటో!!
శ్రమని నమ్ముకోక సులువైన మార్గం వెతకడమేలనో
వెలుగూచీకటి ఒకదాని వెంట ఒకటైన చింతెందుకో!?  

అటు ఇటుకాని.,

నింగిలోని చుక్కలు వీడ్కోలు పలకడమే తడవు
గరిక కొనల్లోని సూర్యుడు మేల్కొన్నది మొదలు
ఉండీ లేనట్లున్న జ్ఞాపకాల నడుమ రాయబారమే
ముఖకవళికలకి రంగులద్దుతూ అలజడి చేస్తుంటే
తలుపు తడుతున్న సంబరాలే కరిగి కలవరపడె!! 

ఆకునీడ దాగిన పూలు గాలి తాకిడికి కదులుతూ
చిరుజల్లులు తమని తడిపి నేల తాకవని తలుస్తూ
నవ్వులు రువ్వ అంతలో ఆకశాన్న ఉరుము మెరవ
తెరిపి కోసం ముడుచుకున్న ఆకుల్ని తడుముతుంటే
సాంగత్యాన్ని తాళలేని కాండమే కరకుగా విరిగిపడె!!

హృదయాన్ని అద్దంలో చూపలేని ప్రకృతి పరవశంతో
తలపులని తట్టిలేపి అస్థిరమైన రూపాన్ని కానుకిచ్చి
తేలికవని మనసుని కరిగిపోనిచ్చి కుదుటపడమని 
పల్లపు లోయలో దాగని జ్ఞాపకాలని పారిపోమనంటే
దిక్కుతోచని గమ్యం అవిటిది అయిపోయి మూలపడె!!

మేలుకో..

హేయ్ నా అల్లరి వయస్సా..
నేను ఏదో చేస్తూ గెంతులేస్తాను
నువ్వు మాత్రం పట్టనట్లుంటావు
బాల్యాన్ని లాక్కుని నవ్వగలవు
నా పసిమనస్తత్వాన్ని ఏం చేయలేవు!

ఓయ్ తెలుసుకోవే వెర్రి మనసా..
ప్రతీ మాటకు సమాధానం ఉండదు
ప్రేమించే ప్రతీ మనసు నిర్మలం కాదు
ప్రతిప్రాణికీ ఏదోక పిచ్చి ఉండక తప్పదు
అలాగని ప్రతీ ఒక్కళ్ళు పిచ్చివారు కాదు!

హాయ్ నీ ఆలోచన్లు నీకు అలుసా..
మౌనంలో మతలబులు లేవనుకోకు
నవ్వేవారికి లోతుగాయాలు ఉండవనకు
తరచుగా నీతో తగువాడి అలిగి కోప్పడితే
వారిది సిసలైన సంబంధంకాదు పొమ్మనకు!

ఒసేయ్ నిర్ణయాలు నీటిబొట్లు తెలుసా.. 
కంటికి కనబడే వారందరూ చెడ్డవారు కారు
విన్నమాటలు చూడని సత్యాలుగా మారిపోవు
తైలము తగ్గి వెలుగుతున్న దీపం ఆరిపోవచ్చు  
ఆరితే తడవతడవా తప్పు గాలిదని నిందించకు!

పెక్యూలర్ పత్నీస్..

ఇది కేవలం సరదా నవ్వుకోడానికి రాసిందే తప్ప మరే ఇతర చర్యలకు పద్మార్పిత భాధ్యురాలు కాదని మనవి చేసుకుంటుంది...నవ్వేద్దురూ హా హా హా :-)   

ఎలా చెప్పేది!



ఏమి చెప్పను...ఎలాగ చెప్పను
నీకు నాకు ఉన్న బంధం ఏమిటంటే
ఇదేనంటూ ఏవేవి చూపించను!?
గుండెలయ గీతానివి...జీవన సంగీతానివి
కాంతి పుంజానివి...తాజాగాలి తెమ్మరవని
నా ఉత్తేజ ఉల్లాస ఉత్ప్రేరకాలు నువ్వేనని
చెప్పే సాక్ష్యాలు ఎక్కడ నుంచి తీసుకురాను!
నా సంబరాల నాంది నీవని నిరూపించలేని నేను
ప్రేమకి ప్రతిబింబమైనావని..ఎలా నమ్మించను!?
కళ్ళ నిండా నీవే...కలలలో నీవేనని
నా శ్వాసలో...నా నిరీక్షణ నిట్టూర్పు నీవేనని
రేయిపగలు ప్రతిపదం నీవే నిండి ఉన్నావని   
నా ఆలోచనల్లో అంతరాత్మలో అంతర్లీనమైనావని
చెప్పగలనే కానీ ఏ విధంగా రూపాన్ని ఇవ్వను!?
అందుకే ఎందుకు ఎలా ఏమిటంటే చెప్పలేను..

వానా వచ్చేయ్...

 సందేశమే నిన్ను తాకి తనువు తడిసేలా
మట్టివాసనతో మనుషులు పులకరించేలా
వేడెక్కిన రాతి హృదయాలు చల్లబడేలా...
మేఘమా కనికరించి జల్లు కురిపించరాదా!

పల్లె పట్టణాలన్న భేధాలు మరచి దారిమళ్ళి
గుడిసెలోనా గోపురం పైనా వానజల్లులా వెళ్ళి
తడారిన నదీబావుల దాహం తీర్చు మళ్ళీ...
మబ్బులు మనుగడకే మిత్రులని తెలుపరాదా!

నృత్యం చేసేటి నెమలి రెక్కలే అలసిపోయె
కప్పలేమో బెక బెకమని సొమ్మసిల్లిపోయె
వానపాములే తడిలేక ఎండి పుల్లలాయె...
మెరుపులో మమకారాన్ని కుక్కి కురవరాదా!

పొలంలో ఎదురు చూసే రైతు నడుము విరిగి
నాగళ్ళు సమ్మె చేయగా ముళ్ళపొదలు పెరిగి
ఉరుములకి ఉలిక్కిపడే పడుచులేమో తరిగి...
మేఘాలు మొండివన్న నిందేల కురిసేయరాదా!

 
  

పైసే మే ప్యార్...

పైసలు లేనిదే ప్రేమ ప్రేమాంటే పనికిరాదమ్మో
ప్రేమే సర్వం అనుకున్నావంటే...అది నీకు
యవ్వనంలో అంటుకున్న మాయరోగమమ్మో!


పైస పరిమళమంటని పువ్వులీ వలపు సెగలమ్మో
ప్రేమ పువ్వై నేడు విచ్చుకుని...రేపు నీకు
వడిలి ఎండిన పుష్పంలా వికారం పుట్టించునమ్మో!


పైసలుంటే మనసుపడ్డది కావాలంటే దక్కునమ్మో
ప్రేమికులు కాదని వాదించినా...కాలం నీకు
అనుభవం ఆలస్యంగా నేర్పించే పాఠం ఇదేనమ్మో!


పైసలు లేక పస్తులు ఉండి నీవు ప్రేమించలేవమ్మో
ప్రేమ కడుపు నింపేను అనుకుంటే...అది నీలో
భ్రమకి పరాకాష్ట తెలుసుకో మనసుండి మతిలేనమ్మో!


పైసల్లో పరమాత్మ వాటి వెనుకే ప్రేమ పరుగులమ్మో
ప్రేమ వెంట గుడ్డిగా పరుగులెడితే...చివరికి నీకు
అంటుకునేవి ధూళి అదీ కాదనుకుంటే వేదనలేనమ్మో!