భ్రమలో ఉన్నావేమో..

మారిన సమయపు మాయావలయం చూస్తూ మేల్కుని 
కనులు మూసుకుని గడిపే కాలాన్ని కలగంటున్నావేమో!

తామరాకుపై నీటిబొట్టంటి  ప్రేమసంతకాన్ని గుండెపై చూసి 
ఆవిరైన నీటిరాతల్లో  తీపిజ్ఞాపకాలు వెతుకుంటున్నావేమో!
  
వెన్నెల్లో కానరాని వెలుగును వేకువ వెలుగుల్లో వెతుక్కుని
ఆశతో మరోమారు మరపురాని బంధాన్ని పేనుతున్నావేమో!

దూరమైపోయిన ఆనందం గుండె గుర్తుల్లో దాచిందంతా తీసి 
నేలనింకిన నిరాశకి ఎత్తుపల్లాల బాటని చూపుతున్నావేమో!

ప్రేమంటే రెండుశరీరాల కలయిక కాదన్న సిద్ధాంతం వల్లించి 
ఆటుపోట్లు లేని జీవితమేలేదన్న వేదాంతం వల్లిస్తున్నావేమో!  

ప్రేమహంతకుడు..

"ప్రేమించు ప్రేమను నీవు ప్రేమతో పంచూ
అది రెట్టింపు ప్రేమను నీకు అందించు..."
పద్మ ప్రేమకే అర్పితమని కబుర్లెన్నో పలికి
ప్రేమ భావాలను మనసు నిండా నింపితే
ప్రేమించి ప్రేమించానని భరోసా ఇవ్వమంటే..
బలమైన బంధానికి బానిసను మన్నించమనె!
ప్రేమించిన మనసు బ్రతకడం రాక చావలేక
అనుకున్నది ఒకటి జరిగె మరొకటని వగచి
మార్గం మార్చి నడువ చేయి అందించమంటే..
కన్నవాళ్ళు కాళ్ళే కాదు చేతులూ కట్టేసారనె!
నచ్చింది చేయాలనుకుంటే అడ్డురాని ఆటంకాలు
నచ్చనివి వద్దనడానికి వంకలెన్నోనని మనసంటే
ప్రాధాన్యతనిబట్టే ప్రణయమైనా పని ఏదైనా అని..
ప్రేమించడానికి అవసరంలేని మిగతా అవయవాలనె!
జీవితపు చివరిమజిలీ వరకూ భంగిమలు మారుస్తూ
ప్రేమను నాలో చంపేసిన నా ప్రేమికుడికి నజరానా..
నవ్వుతూ బ్రతుకుతున్నాననే భ్రమని కలిగించానంటే
ఇంట గెలవకపోయినా నా ప్రియుడు రచ్చ గెలుస్తాననె!  

మాట వినని వలపు..

నేను ఎన్నడూ ప్రేమించకూడదనే అనుకున్నా
నిన్ను చూసి నా గుండె నాకే ద్రోహం చేసింది!
జీవితం ఆడి పాడుతూ హాయిగా గడిపేస్తున్నా 
అనుకోకుండా ఈ ప్రేమరోగం నాకొచ్చి సోకింది!

కునుకు కరువైయ్యింది అంతే కదా అనుకున్నా 

ఎడబాటగ్ని లోపల నరాలను దహించి వేస్తుంది!
ప్రేమిస్తే ఒకజీవితభాగం పూర్తని సరిపుచ్చుకున్నా
ప్రేమకెన్ని ఆచారవ్యవహార ఇబ్బందులో తెలిసింది!

వరించి వ్యధపడ్డ వారిని చూసి వెర్రని నవ్వుకున్నా

వ్యధలు పీడిస్తే వలపుజాడ్యం వ్యసనంగా మారింది!
రాత్రులు కలలతో కాపురం చేస్తే సహజమనుకున్నా
మనసిచ్చి పుచ్చుకున్న వారికిదే శిక్ష అనిపిస్తుంది!
     
తప్పు తప్పూ ఇకపై ప్రేమించడం మానాలనుకున్నా
కానీ.....నా గుండె నామాట ఎప్పుడు వినిచచ్చింది!