ప్రియుడు కావాలి!

నాకు ఒక మంచి బాయ్ ఫ్రెంఢ్ కావాలి
వీలుంటే ఒడ్డూ పొడుగు ముద్దుగుండాలి
లేకున్నా పరువాలేదు మనసు ఉండాలి
కాసులు లేకున్నా పెద్ద కలేజా ఉండాలి
ప్రేమించానని గట్టిగా నలుగురికీ చెప్పాలి!   

ప్రేమలో పండిన పద్మకు ప్రియుడుకావాలి
కుదిరితే అస్లీ లేకుంటే నక్లీ అయ్యుండాలి
పెళ్ళైనా కాకున్నా దిల్ జబర్దస్తు ఉండాలి
చెప్పినా చెప్పకున్నా అన్నిట్లో తానుండాలి 
ప్రేమని పంచడంలో మాత్రం కింగ్ అవ్వాలి!

అర్పిత అంటే అల్లాటప్పా కాదని తెలియాలి
తెలిసీ మనసు మెదడు రెంటితో ప్రేమించాలి 
కులగోత్రాలు లేని గుణసంపన్నుడు కావాలి
చేసే ప్రతీ పనిలో నా ప్రతిబింబం కనబడాలి
వాడితో పెళ్ళి కాకున్నా నిత్యశోభనం కావాలి!

గజ్జె ఆడె..


లోకాన్ని చూసి నేను లజ్జ వీడి వెక్కిరిస్తూ
నేడు కాలికి గజ్జెకట్టి బిడియంతో నర్తించగా
హోరుకు హడలిన మువ్వలు చిందరవందర  

అమాయకత్వంతో బిడియము జత కట్టేస్తూ 
కనుపాప రెపరెపల్ని భంగిమలిమ్మని కోరగా
వేసిన పాదముద్రలకు మువ్వలు అస్తవ్యస్థం

నాటి కలనైన నేనిప్పుడు కలతని రేకెత్తిస్తూ
పలుకుతూ వేస్తున్న ప్రతిపాదం వ్యర్థమవగా
చేస్తున్న నృత్యానికి మువ్వలు వంకర టింకర 

రూపులేని మమకారం ప్రలోభానికి గురిచేస్తూ
లేచిన ఆశల అవయవాలు ముక్కలు అవగా
తొక్కిసలాట తాండవంతో మువ్వలు విస్ఫోటం..  

స్వతంత్ర యోధులం...

స్వాతంత్య్రం వచ్చిందెవరికి...మీకు నాకు దేశానికేగా?
దేశమంటే మట్టికాదోయ్ మనుషులనే కదా అంటారు 
అంటే ఎవరికి వారు అందరూ స్వతంత్రలనే అర్థంకదా!

అలాగైతే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఉండొచ్చు
ప్రేమించిన వారిని పెళ్ళి చేసుకునో లేకో ఎగిరిపోవచ్చు
కాపురం చేసి కావాలంటే కని వద్దంటే పారెయ్యొచ్చు 
కన్నోళ్ళని ఇష్టమున్నట్లు పెంచి, వినకపోతే చంపొచ్చు
ఏది కావాలంటే అది నచ్చినట్లు చేసి చిందులెయ్యొచ్చు!

ఏది ఎక్కడా అలా జరగడంలేదు అదే మన ధౌర్భాగ్యం
ప్రేమించినా లేకపోయినా ముడిపడ్డ ఇరుజీవితాలే బంధం
పిల్లలను కని పెంచాలి తప్ప నిలదీయ కూడదే శాసనం
ఒకరిపై ఒకరు ఆధారపడి బ్రతుకుతున్న పరాన్నజీవులం 
అయినా వారికివారే స్వతంత్రులనుకుంటున్న మూర్ఖులం!

అంతెందుకు నీకు నచ్చిన దుస్తులు నువ్వు ధరించలేవు  
అనుకున్నవి అన్నీ అనుకున్నట్లు సాధించి గెలవనూలేవు
నీవు సంపాదించినవి ఏవీ కూడా నీకు శాశ్వితము కావు   
నీ అవయవాలను నీకు నచ్చినట్లు నీవు అమర్చుకోలేవు
చివరికి నీ ఆయువు తీరిపోతే ఒక్క క్షణము బ్రతుకలేవు!

మరెందుకని స్వతంత్రులమంటూ ప్రేలాపనలు సంబరాలు?
అస్థిర అడుగులకు చంచల మడుగులొత్తి జైజైకారాలు చేసి
   యోధులమని బిరుదులిచ్చుకునే అతి సామాన్యులం కదా!