రానా వద్దాని అడక్కుండానే వచ్చిసచ్చిందిగా కరోనా..
కలవరమెందుకు దాన్ని తరిమికొట్టడం మనకు చేతకాకనా
అన్నీ శుభ్రంగా కడుక్కోవడం మనకు తెలియదనుకునా
వచ్చాక చావకొట్టే ప్రయత్నం గట్టిగానే చేద్దాం ఏదేమైనా!
ఎక్కడో పుట్టి ఇక్కడికొచ్చి మమ్మల్ని హడలుగొడతావేమే కరోనా..
ఎడమెడంగుంటూ కలవకుండా నిన్ను మట్టు పెట్టలేమనా
బయట తిరక్కుండా ఇంటిపట్టునుంటే నీకు లేదుగా టికానా
రెక్కాడితేగాని డొక్కాడని మాతో పెట్టుకోకే చుప్పనాద్దానా!
తుమ్ముదగ్గు జలుబు జ్వరంగా వచ్చి జలదరింప చేయకే కరోనా..
మాస్క్ ముసుగేసుకుంటే నీకు ఊపిరాడదంట అవునా
ఎప్పుడెలా అంటుకుంటావోనని చస్తూ బ్రతుకుతున్నాం ఏదైనా
మేమంతా తలచుకుంటే నిన్ను నాశనం చేయడం పెద్దపనా!
ప్రభుత్వ నియమనిబంధనలు పాటిస్తాం కాచుకో కరోనా..
ధైర్యమే మా ఆయుధం తెలుసుకోవే కర్కోటకమైనదానా
ఇరవైఒకటి రోజులు ఇంట్లో ఉండి దీక్ష చేస్తున్నాం పారిపో సైతానా
కోవిడ్-19 పుట్టగతుల్ని కాల్చిబూడిద చేయడానికి అందరూ రెడీనా!