వెతుకులాట

మూగబోయి ఎందుకు ఉంది ఈ జీవితమని
ఎందుకిలా జరుగుతుందని ఎవరిని అడగాలి
చతికిలబడి సమయమెందుకు సాగుతుందిలా
సంతోషకరమైన క్షణాలను ఎక్కడని వెతకాలి?

నుదుటిరాతను ఎందుకిలా రాసావో చెప్పని
జీవితం ఇంకా ఎంత దూరం ఇలాగే సాగాలి
కలలు కళ్ళలోనే చెమటలు కక్కి కారిపోనేల
తడారని పెదవుల కోసం ఎక్కడని వెతకాలి?

మేలు చేస్తే పంపించిన దీవెనలు ఏంచేసావని
ఆకాశాన్ని తాకిన ఆశలు శాశ్వితముగా రాలి
శ్వాస ఎక్కడో మలుపుతిరిగి మరలివచ్చెనిలా
మదిని వదలిన స్పందనని ఎక్కడని వెతకాలి?

అలా జరిగింది!

గోరువెచ్చని నీటితో అభ్యంగన స్నానం చేసితి
కురులు ఆరబోసి సాంబ్రాణి ధూపాన్ని వేసితి
నీకిష్టమైన పలుచని తెల్లచీరనే ఒంటికి చుట్టితి
నుదుటన నిలువుబొట్టు కంటికి కాటుక పెడితి
వళ్ళంతా వన్నెతగ్గని వగలనే నగలుగా వేసితి
తలలో మల్లెలుతురిమి గుమ్మంలో నీకై వేచితి!
చక్కని చూపుల వలలో చిక్కుతావని కలగంటి
నా నడుము వంపులో నక్కాలని ఊహల్లోఉంటి
కోరికల కొవ్వొత్తులు పడకగదిలో వెలిగించుకుంటి
చెప్పకున్నా నన్నునీవు చదివేస్తావు అనుకుంటి
వచ్చి ఇచ్చే చుంబన లాలాజలమే లేపనమంటి
ఈ విరహఉష్ణవ దాహం నీవే తీర్చగలవనుకుంటి!
అలా ఎదురుచూసిన నాకు నీరాక ఒక పిడిబాకు
ఇంటికొస్తూ రాగానే తేనీరు కావాలి అలసిన నీకు
స్నానం తరువాత రుచులు కోరతావు భోజనంకు
ప్రయాణబడలికతో నీ దేహం దాసోహం పాన్పుకు
ఇంకేం తలపులు రగిలించిన ఉత్తేజపు వేడి నాకు
ఆరాటం అందంగా ఆవిరైపోయింది నిట్టూర్పులకు!