ప్రత్యేకస్థానం..


నీవైపు అకర్షించబడ్డానికి ప్రత్యేక కారణమంటూ ఏంలేదు
దానికొక అర్థమూ పరమార్థం ప్రణాలికంటూ కూడా లేదు
ఏదో జరగాల్సింది ఇంకేదో జరిగిపోయింది అంతే సుమా..
నిన్ను చూడక ముందు జీవితానికొక అర్థమంటూ ఏంలేదు
అప్పటిదాకా బ్రతుక్కి ఒకగమ్యం నిశ్చింతస్థానం దొరకలేదు
అంతకు మించిన ఆలోచనలు నామెదడుకి లేవు సుమా..
నీ వ్యక్తిత్వసునిశితపరిశీలనా గుణానికి లొంగానంతే ఏంలేదు
అందరి మనసులనీ చదివే నీకు నామది కష్టం అనుకోలేదు
అనుకోకుండా మనసుతో చూసి మాట కలిపాను సుమా..
నిన్ను చుట్టిముట్టి ఉన్న భవబంధాల్లో నేనుండాలని ఏంలేదు
నిడారంబరనియమనిబంధనలున్న బంధమన మదిఒప్పుకోదు
ఉరుకులపరుగుల జీవనవ్యాపకంలో మరచిమారిపోకు సుమా..
నీ సహచరసావాససాంగత్యాన్ని తప్ప నేను కోరింది ఏంలేదు
మనసున మెండుగా ఉంది బయటపడని గుర్తింపు అక్కర్లేదు
ఏదేమైనా నాకంటూ ప్రత్యేక సమయాన్ని సృష్టించాలి సుమా..

తప్పేమిటి?

సుదీర్ఘ ప్రయాణంలో మార్గం మరచిపోయి
దారిచూపమన ఆగిపొమ్మనడంలో అర్థమేంటి!
శీతల తరంగం ముద్దముద్దగా తడిసిపోయి
చలివేయ కాస్త సూర్యరశ్మిని కోరితే తప్పేమిటి?
ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలు అతిభారంగా ఉన్నాయి
లోపల ఎంత వేడి ఉన్నా ప్రయోజనమేమిటి!
నీలాకాశం కంటినిండుగా తిరుగాడుతున్నాయి
నిశ్చలంగా నీటిని నిలబడిపొమ్మంటే తప్పేమిటి?
హోరుగాలులు ఏమో శాపనార్థాలై వీస్తున్నాయి
అంధకారంలో అలంకరణతో ఉపయోగమేంటి!
నిర్మానుష్య రహదారిపై చల్లని అలలాసాగిపోయి
సిగ్గునీడలో తలదాచుకుంటే మాత్రం తప్పేమిటి?
పొగమంచై పర్వతాల్లో సూర్యుడు దాగిపోయి
ఉప్పకన్నీటితో మండే గాయాలకు మందేమిటి!
గాలిలో తేలుతున్న ఆశపొగలు మసగపరిచాయి
మేఘాలను కుండపోతై కురవమంటే తప్పేమిటి?