మనసు గాయపడిన ప్రతీమారు..
నీ పెదవులు నానుదుటిని తాకేవి
ఆ స్పర్శ మరింత ప్రేమని పెంచేది
అలా నీ కౌగిట ఒదగాలని ఉండేది!
మనం కలిసిమెలిగిన ప్రతీమారు..
నీ సాంగత్యం నాలో ఆశలు రేపేవి
ఏవో ఊహలతో ఏదో అయిపోయేది
అవి కాకున్నా సుఖమే అనిపించేది!
చిగురువసంత కలల్లో ప్రతీమారు..
నీ నవ్వులే నాకనుల కాంతులైనవి
నిష్కల్మష నవ్వే అమృతం అయ్యేది
అదేగా బ్రతుక్కి బలాన్ని చేకూర్చేది!
నాగుండె కొట్టుకున్న ప్రతీమారు..
నీ హృదయంపై అవి పిచ్చిగీతలైనవి
తెలియని అనురాగమేదో దాగుండేది
ఆ అస్పష్టతలోనే స్పష్టత కనిపించేది!