ఖబర్దార్

నువ్వు నాకేమో బంగారు కొండ
నేను నీకొరకై నిండిన పాలకుండ
ఇద్దరం ఒకరికొకరం అండాదండ

నువ్వు నాకు ఇష్టమైన సున్నుండ
నేను నీకు ఇష్టమైనట్టి కలాకండ
ఇద్దరం తిందాం తీపి కడుపునిండ

నువ్వు అనుకోకు నన్ను గుదిబండ
నేను నీ కోసం ఊగేటి పచ్చజెండ
ఇద్దరం ఒకటైతిమా సుందరకాండ

నువ్వు లేని జీవితం పెద్ద అనకొండ
నేను లేనిది నువ్వొక ముదురుబెండ
ఇద్దరం కలిసుండటం మన ఎజెండ

నువ్వు కాదన్నావా నీ మొఖం మండ
నేను అవుతా నిన్నుకాల్చే మండేఎండ
ఇద్దరి మధ్య జరుగును కిష్కింధకాండ

అతడు-ఆమె

అతడు-జీవులలో అత్యంత ఉన్నతుడు
ఆమె-ఆదర్శాలలో మహోన్నతమైనది..
అతడు-సింహాసనం పై కూర్చుని ఉద్దరిస్తే
ఆమె-బలిపీఠమైనా ఓర్పుగా సహిస్తుంది..
అతడు-మెదడై కాంతిని వెదజల్లుతుంటే
ఆమె-హృదయమై ప్రేమను కురిపిస్తుంది..
అతడు-పరాక్రమంతో చలామణి అవుతాడు
ఆమె-తాను బలౌతూ ఉత్కృష్టమౌతుంది..
అతడు-అధిష్టాన ఆధిపత్యం బలమైనదైతే
అమె-ప్రాధాన్యతతో కూడిన హక్కౌతుంది..
అతడు-అపరితమైన మేధావి అనుకుంటే
ఆమె-అనిర్వచనీయమైన దేవతనిపిస్తుంది..

అతడు-కాంక్ష సర్వోన్నతమైన కీర్తి అయితే
ఆమె-ఆకాంక్ష ఎంతో ధర్మంతో కూడింది..
అతడు-మెదడు అంతా ఆలోచనలకు నెలవు
ఆమె-కలలుకంటూ కాంతిని వెదజల్లుతుంది..
అతడు-ముత్యాలు దాగిన మహాసాగరమైతే
ఆమె-అహ్లాద అబ్బుర సరస్సై సాగుతుంది..
అతడు-దేవాలయం అని ఆవిష్కరించుకుంటే
ఆమె-ఒక పుణ్యక్షేత్రంగా మోకరిల్లవల్సింది..
సంక్షిప్తంగా:-భువి ముగిసిన చోట అతడు
స్వర్గం ఆరంభమయ్యేదే ఆమెతో అనవచ్చు..