క్రొత్తపంధా
నేను భావాలోచలతో యుద్ధం చేసి అలసిపోకుండా
అక్షర సైనికులందరూ నన్ను దాడికి తలపడమంటే
పదకవాతాలకు అధిపతిరాలినై అలరించబూనుకున్నా
మెప్పించాలన్న ధీక్షతో నా శక్తిని ఉసిగొల్పుతున్నా!
నేను అనుభవాలకి రంగులద్ది భావాలు చెడిపోకుండా
రసరమ్య కావ్యాలనే లిఖించాలని ఊహలు పట్టుబడితే
లిపిలేని కలలకు రేపు నాదన్న రసాయనం పూస్తున్నా
వాక్యాలు మనసుని తాకి పరిమళింప ప్రయత్నిస్తున్నా!
నేను ఇకపై నిరాశావేదనల ఊసులన్నవే రచించకుండా
సమతాలౌకిక సామాజిక ప్రయోజన పదమాలల్లమంటే
నన్ను నేను గెలవకపోతి రచ్చ ఏం గెలుస్తా అంటున్నా
అయినా కొత్తగా అక్షరప్రయోగం ఒకటి మొదలెడుతున్నా!
నేను సంఘ సంస్కరణోద్యమంటూ మాటలు చెప్పకుండా
మార్పుకై నిఘంటువులో సున్నిత పదాలు వెతకబోయి
సమసమాజ నిర్మాణ పునాదుల పుస్తకం చదువుతున్నా
మనిషినీ మానవత్వాన్ని బ్రతికించే కావ్యక్షేత్రంలో నేనున్నా!
అస్థిర బంధం
స్నేహమే ప్రేమగా మారుతుంటే సై అన్నాను
బంధాన్ని గట్టి పరచాలని బావాని పిలిచాను
బావలో బలం లేదంటే నిజమేనని నమ్మాను
మామాని పిలిచి మమతానురాగాలే చిలికాను
మరులుగొలిపేంత మత్తులేదంటే ఊరకున్నాను
కన్నా అంటూ పిలిచి కపటమేలేదని తెలిపాను
కలవరింతపెట్టే పిలుపంటే కామోసనుకున్నాను
ముద్దుపేరుతో పిలిచి మురిపాలు గుమ్మరించాను
ముద్దులియ్యమంటే హద్దు దాటేనని మానేసాను
నా విశ్వమే నువ్వంటూ వీడకని వేడుకున్నాను
వలపు పొరకు బంధం అక్కర్లేదంటే ఇంకేమనను
ఆప్యాయంగా అల్లుకున్న అస్థిర బంధాన్ని నేను
తుప్పట్టిన లాంతరు వెలుగులా నవ్వుతున్నాను!
వెర్రిలోకం
వద్దన్నా వ్యక్తుల్ని వార్తాపత్రికలా చదివేస్తుంది
ఏదోకరోజు రూపం వెనుక దాగింది చూస్తుంది
వాస్తవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది!
దాచింది చదవలేనిదేదో నెమ్మదిగా తెలుస్తుంది
అంత వరకూ ఆగని లోకం ఏదేదో ఊహిస్తుంది
వ్రాయని అంశాల పెద్దనిఘంటువే దాగుంటుంది
ప్రపంచానికి కనబడని మరోకోణమే మనిషన్నది!
కన్న కలలను బ్రతికించుకునే హక్కు నీదీ నాది
ఎవరికి తగ్గ నైపుణ్యం వారిలోనే కుదించబడుంది
నువ్వు నువ్వే నేను నేనేనన్న ప్రత్యేకత మనది
నిజం నేస్తమై సహనం సన్నిహితగా ఉంటానంది!
నవ్వు వెనుక వ్యధను దాచే వ్యక్తిత్వం కొందరిది
మదిగాయానికి చేసే మోసపూరిత అలంకారమది
మనసువిప్పి నవ్వక బహిరంగంగా ఏడ్వలేనన్నది
నిజాన్ని ఎందుకు చూపకున్నామో తెలియకుంది!
మ్యాడ్ మెంటల్ పిచ్చి పైత్యం పట్టిన లోకం ఇది
వారిది కాక ఎదుటివారి జీవితాన్ని చదువేస్తుంది
ఇతరులు మనలా ఉండాలని ఎందుకో కోరుతుంది
అందుకే మతిలేని లోకాన్ని వదిలేయమంటుంది!
Subscribe to:
Posts (Atom)