పద్మార్పితాని లేని గంభీరాన్ని గొంతులో నింపుకుని గది పిలిచింది
అప్పుడే పైకప్పు: హైగా ఆలోచించి ఆకాశమంత ఎత్తుకి ఎదుగంది
సీలింగ్ ఫ్యాన్: సిల్లీ ప్రశ్న, ముందు మైండును చల్లగా ఉంచమంది
గడియారం: సమయానికి విలువిచ్చి మసలుకోమని సజెస్ట్ చేసింది
క్యాలెండర్: కాలంతోపాటు సాగిపోవాలి అదాగదని కిలకిలా నవ్వింది
నా పర్స్: పైసామే పరమాత్మ, భవిష్యత్తు కోసం మనీ దాచమంది
అద్దము: నిన్ను నీవు నాలో చూసుకుని సవరించుకోమని చెప్పింది
గోడ: పెద్ద ఆరిందాలా ఇతరుల భారాన్ని నువ్వు పంచుకోవాలనంది
కిటికీ: నీ కోణంలోనే కాక పదిమంది దృష్టితో చూసి నేర్చుకోవాలంది
నేల మాత్రం: నిబ్బరంతో ఎవరెంత ఎత్తుకెదిగినా నేలపైనే ఉండాలంది!
అప్పుడు నే మంచంవైపు మత్తుగా చూసి నువ్వు కూడా చెప్పన్నా
సలహాలు అనేవి చెప్పుడానికి వినడానికే తప్ప బ్రతకడానికి కాదని..
చల్లగా ఉంది దుప్పట్లో దూరి పడుకో, మిగతావి మోహమాయంది!!