ఏంకావట్లేదు..

ఆకలిని ఓర్చుకునే ఓపిక నశించి రుచులపై వెగటుపుడితే
పంచభక్షపరమాన్నాలు ఎలా ఆరగించాలో అర్థంకావట్లేదు!

ఒంటరితనపు ప్రియమైన శత్రువుతో ప్రేమలో కూరుకుపోతే
తోడుకై తనువుకు తాళి ఎలా కట్టించుకోవాలో తెలియట్లేదు!

చీకటికి అలవాటుపడిన చూపు వెలుగుపై విసుగుచెందితే
కాంతులీను భవిష్యత్తని కాటుకభ్రమని కళ్ళకు పూయట్లేదు!

నిరాశసెగల వేడికి పట్టుదలే నిట్టూర్పై కరిగికాలువై పారితే 
వెక్కిరించే మార్పుతో ఎక్కడికెళ్ళాలన్నా దారి కానరావట్లేదు!

స్వశక్తి సన్నగిల్లి స్వయంకృతాపరాధ వ్యధలతో ఆడుకోబోతే
అగుపించని ఎదభారంతో జీవితాన్నెలా నెట్టాలో చేతకావట్లేదు! 

నాకు నే నిబ్బరపడి నగ్ననిజంతో శూన్యంలో రమించబోతే 
కన్నీటికి చులకనైపోతానని తెలిసి కూడా నవ్వు రావట్లేదు!!  

అన్నీ జరిగిపోతాయి

అనుకోకుండానే అన్నీ అయిపోతుంటాయి
ఏదో విధంగా పనులు జరిగిపోతుంటాయి
న్యాయం కోరుకున్నవారికి దొరుకునో లేదో
తనువుకైన గాట్లగుర్తులన్నీ మానిపోతాయి!

అనుకోనివి ఇష్టంలేదు కాదన్నా అవుతాయి
భయంకరమైన రాత్రులూ గడిచిపోతుంటాయి
కన్నీళ్ళు ఆవిరై గుండెమంటలు ఎగసిపడగా
ఎదురు తిరిగితే మౌనమే జవాబులౌతాయి!

అడగలేదని ఆగిపోక అవసరాలన్నీ తీరతాయి
తప్పించుకోడానికి వంకలెన్నైనా దొరుకుతాయి
మరపు వరమై అన్నీ సవ్యంగా సాగిపోతుంటే
ఆత్మగౌరవం అలలై అంబరాన్ని తాకుతాయి!   

అలసిన ఆశలేమో అంతరంగాన్ని ఊరడిస్తాయి
అణచుకున్న ఆవేదన ఉధ్రేకంతో ఎర్రబడతాయి 
ప్రమేయం ఏమీ లేవన్న భాధ్యతలు పెరిగిపోతే
అనుకున్నా అనుకోకున్నా  జరుగుతాయి!

ఎలా చెప్పేది!?

నేడు నేను చెప్పాలనుకుంటూనే మళ్ళీ చెప్పలేకపోయాను
నాతోనే ఉండిపొమ్మని అరచి గోల చెయ్యాలి అనుకున్నాను 
వెళ్ళకుండా నాకోసం నన్నంటుండే శక్తి నీది అనుకున్నాను
చెప్పలేకపోయాను..చెప్పానన్న భ్రమలోనే బ్రతికేస్తున్నాను!

నేడు నిన్ను తనివితీరా హృదయానికి హత్తుకోలేకపోయాను
కౌగిలిలో బంధించి ఇరుశ్వాసలతోపాటు కరిగించలేకపోయాను 
నా ఊపిరున్నంత వరకూ నాతో ఉండమని అనలేకపోయాను
చెయ్యలేకపోయాను..ఏదో అనుకుంటా కానీ ఏమీ చెయ్యను!

నేడు నన్నూ నిన్నూ వేరుచేసేటి రేయినైనా ఆపలేకపోయాను
ఏమాయోచేసి నా మనోభావాల ముసుగుతో నిన్ను కప్పలేను 
నువ్వు లేని నా పరిసరాలన్నీ నవ్వుతుంటే నేనూ నవ్వలేను
నిస్సహాయురాలిని నేను..ఏబంధంతోను నిన్ను కట్టివేయలేను! 

నేడు నువ్వులేని నేను ఎంత అసంపూర్ణమో కూడా చూపలేను
అణువణువు నీ స్పర్శకోసం పడుతున్న తపన ఎలా తెలుపను
నువ్వు నావాడివై ఉండని ఏడ్చే ఎదఘోషను ఎప్పుడు చెప్పను
ఎన్నో చెప్పాలనుకునే నేను నేడేకాదు ఎప్పటికీ ఏమీచెప్పలేను!