అన్న రాముడి వెంట వెళ్ళుతూ ఒక్క మాటైనా నన్నడక్కపోతివి కదా లక్ష్మణా
నీవు లేనప్పుడు నిద్రపోక ఊర్లపొంటి నే తిరిగుంటే ఏమైయుండేదో నీ క్రమశిక్షణ
రాముడు తోడున్నా సీతకు కావలి కాస్తివి కట్టుకున్న భార్యకు అక్కర్లేదా రక్షణ!
లక్ష్మణ గీత దాటిన సీత గతి ఎరుక అందరికీ కానీ ఎవరికి తెలుసునని ఊర్మిళ
రాకుమారుడై అన్నీ అనుభవించి జ్ఞానమని చెప్పకుండా ఉడాయించిన సిద్ధార్ధుడా
కాపురంచేసి కావల్సింది పొంది సంసార బాధ్యతల్ని మరచిపోయినోడొక సమర్ధుడా
బ్రతుకు వెలిగించుకోవాలని ఆమే వెళ్ళుంటే గౌతముడు బుద్ధుడై కీర్తింపబడేవాడా!
భౌద్ధభోధనలో సమస్తసారం తెలిసిన వారిని ఎవరినైనా అడక్కపోయావా యశోధర
పదితలలు ఉన్నప్పటికీ ఒక్క తలలో కూడా మెదడు లేకపోయెకదా రావణాసురా
పెరటిచెట్టని వదిలేస్తివే కానీ నాకన్నా అందంతెలివిహోదా ఆమెలో ఏమి చూస్తివిరా
అన్నీ ఉండి కూడా నిన్ను అదుపులో పెట్టుకుని నా కొంగుకు కట్టుకోకపోతినిరా!
బావిలోకప్పనై నీకు ఆలినైనా చివరికి విభూషణుడికి భార్యగా మిగిలెనీ మండోదరి
చక్రవర్తివై ఉండీ సతిని సుఖపెట్టలేని నీవు లోకానికి మాత్రం సత్యహరిశ్చంద్రుడివా
భర్తనువాడు భార్యపిల్లల్ని రక్షించాలి కానీ అమ్ముకోవడం ఏమిటని అడగరాదంటివా
దొంగ హంతకురాలిగా నిందభరించి దాసినై పుత్రశోకం భరిస్తే నీవే నరకబూనితివా!
సత్యసంధ స్ధిరచిత్త స్థితప్రజ్ఞ ధీరోదాత్త నీవు నాకొచ్చినపేరేమో మతిలేని చంద్రమతి
పురుషుడు గొప్పవాడిగా కీర్తించబడాలని స్త్రీ ఎన్నింటిని త్యాగం చేసినా మెచ్చరుగా
అదే స్త్రీ తన ప్రత్యేక గుర్తింపుకోసం అడుగు బయటవేస్తే బరితెగించింది అంటారుగా
స్త్రీ ఉన్నతి వెనుక పురుషుడున్నాడేమోనని పురాణచరిత్రల్లో వెతికా కనబడలేదుగా
మీకు తెలిసినవి జరిగేవి జరుగుచున్నవి వ్రాస్తే చదివి సంతోషిస్తుందిగా పద్మార్పిత