నన్ను నీలో...

ఎప్పుడైనా నిన్ను నువ్వు కలుసుకుంటూ ఉండు..
అప్పుడేగా నన్ను నువ్వు కలుసుకోవాలనుకుంటావు
సమయం చూసి వీలుంటే పలుకరించుకుంటూ ఉండు
అప్పుడే నువ్వు నాకెంత ప్రత్యేకమో తెలుసుకుంటావు
అవకాశం దొరికితే నిన్నునీవు ప్రశ్నించుకుంటూ ఉండు
అప్పుడప్పుడూ ఆ ప్రశ్నలకు జవాబు నన్నడుగుతావు
మన మధ్య లింక్ తెలుసుకునే ప్రయత్నమేదో చేస్తుండు
ఆత్మని ఆత్మతో తాకినప్పుడు నువ్వా యత్నం చేయవు
కాలం మారినా సమయంలేదని వంకలు వెతుక్కోకుండు
కాపురానికి కల్యాణం కానీ మనసు కలయికవి అడ్డవవు
నీకు నేను ఏమీకాను ఇది నూరుశాతం సత్యమై ఉండు
ఏమైనా నన్ను నీవు తిరస్కరించే సాహసము చేయలేవు
నా వలన బాధాలేదు సంతోషం కూడా నీకు కలగకుండు
అలాగని మన జ్ఞాపకాలను కాల్చి బూడిదైనా కానీయవు
ఎంతో ఎడమై దూరంగా ఉన్నా ఎడబాటుసెగ రగలకుండు
బహుశ భావానుభూతులు ఎప్పుడు విడాకులు తీసుకోవు
ఈ జీవితానికి శాంతి సంరక్షణ నీవని తెలుసుకుని ఉండు
నన్ను కలవలేక నిన్ను నీవు కలుస్తూ నన్ను కలుస్తావు!

దూరమై దగ్గర!

కొందరు మనకు దగ్గరగా ఉన్నట్లే ఉండి
జ్ఞాపకాల్లో మాత్రమే సజీవంగా ఉంటారు
మనకి తెలియకుండా మనల్ని నిలదీస్తూ
మన భావాల్లో బ్రతికేస్తూ బ్రతికిస్తుంటారు!

గిరిగీసి రాసుకున్న నిఘంటువులో ఉండి
అదృశ్యహస్తమై వాళ్ళతో తీసుకునిపోతారు
మెదడు మొద్దుబార్చి వారివెంట నడిపిస్తూ
స్వనిర్ణయ అజ్ఞానులుగా మార్చేస్తుంటారు!

పెంపుడు పావురాల్లాంటి పదాలుగా ఉండి
అక్కరకొచ్చినట్లు అక్కడక్కడా వాలిపోతారు
మొండిమనసుని శోఖసాగరం చేసి రోధిస్తూ
పరాకష్టగా పరాయీకరణ దోవన వెళతారు!

అంతరంగోద్భవ చెరసాల్లోనే ఖైదీలుగా ఉండి
చేతకానితనాన్ని చెదలకు ఆత్మార్పణచేస్తారు
నిర్జీవ ప్రాణాన్ని పెకిలించినా నవ్వీ నవ్విస్తూ
జీవించమంటూ ఆత్మహత్యకి ఉసిగొల్పుతారు! 

విప్పేసుకుందాం..

వేళ్ళ మధ్యన చిక్కున్న వ్యామోహపు సున్నిత దారాలను
హడావిడిగా తీయాలన్న తపనతో గట్టి ముడులేస్తున్నాం

విప్పే ఓపికలేక కత్తిరించబడి ముక్కలైపోయిన ప్రశ్నలను
చెప్పింది వినక చెప్పనివి వినేసి హైరానా పడిపోతున్నాం

మునుపు మనసులకీ నిర్లక్ష్యపువైఖరి లేక కిమ్మనకుండెను
ఇప్పుడు కనుసైగలతోనే అబద్ధాలని నిజాలు చేసేస్తున్నాం

పరిమళాలు అద్దిన ఎన్నో వాసనలేని కాగితపు పువ్వులను
పంచకనే శరీరానికి ఊపిరి అందించనట్లు విసిరేస్తున్నాం

మోహపు గూటిలో అనుకోక ఇచ్చి పుచ్చుకున్న ఆత్మలను
తప్పొప్పుల తులాభారంలో సరిసమానంగా తూగుతున్నాం

పగలు రేయిలాంటి నువ్వు నేను సాయంత్రం కలుసుకుని
ఎవరి దారిన వారే వలపులో కూరుకొని విడివాడిపోతున్నాం!