తలగడమంత్రం

తెల్లని సుతిమెత్తని మనసువంటి వెన్నపూసిన ఇడ్లీలను
పప్పులపొడితో తినమంటే పల్లీపచ్చడే పసందు అంటావు
దూది బంతుల్లా గుండ్రంగా నా బుగ్గల్లాంటి బొండాలను
బిడియంవీడి బోళాగా పెడితే ఎర్రకారంలో అద్దమంటావు
దొడ్డు బియ్యం రుబ్బి దోరగా ఒకవైపు కాల్చిన దోశలను
వేడిగా ప్లేటులో వడ్డిస్తే కొబ్బరిపచ్చడి ఏదని అడుగుతావు
గుళ్ళు మినప్పప్పుతో నా చక్రాల కళ్ళవంటి చిట్టిగారెలను
ఆడుతూపాడుతూ అందించగా చిల్లు చిన్నది అంటున్నావు
మైదాలేని గోధుమపిండి కలిపి పూర్తిగా పొంగిన పూరీలను
నవ్వుతో అందిస్తేనేమి నంజుకోడానికి కుర్మా కావాలంటావు
సొట్టచెంపల సొగసులద్ది ప్రేమతో వేసిన పెసరపునుగులను
పవిటమెలిపెట్టి ప్లేటులో పెట్టిస్తే చల్లదనానికి పెరుగేదన్నావు
ఆదరువుగా అలిగిన నీకు జీడిపప్పూ నెయ్యివేసిన ఉప్మాను
అందించబోవ ఉప్మా కన్నా ఉపవాసం నయమని అరిచావు
ఆకలి వేస్తే ఏమివ్వాలో తెలియని అమాయకురాలిని నేను
అన్నీ తెలిసిన అగంతకుడివి అసలుకే ఎసరు పెట్టేస్తున్నావు
అందించే అల్పాహారాలు అన్నింటికీ ఏదోక వంకపెట్టే నీవు
అర్ధరాత్రి దీపమార్పి దిండు మంత్రమేస్తే దిమ్మతిరిగిపోతావు

శుభరాత్రి..


అలోచిస్తూ నిద్రపోవాలని ప్రయత్నిస్తున్న నాతో..
ఎలా ఉన్నావూ అంటూ అడిగింది నా హృదయం
చెబితే తెలుసుకోవడంలో గొప్పతనం ఏముంటుంది
మనసుని ఏమార్చే కళ్ళలోకి చూసి కనుక్కోమన్నా!

అసహనంతో అటూఇటూ పొర్లిదొర్లుతున్న నాతో..
ఏం చేస్తున్నావూ అంటూ అడిగింది నా మెదడు
అనవసరమైన ఆలోచనలన్నీ దొలిస్తే ఏముంటుంది
పరిష్కారంలేని ప్రశ్నలేయకని విసుగ్గా కసురుకున్నా!

అనుకోకుండా వచ్చిపడ్డ సమస్య హాస్యమాడె నాతో..
మనిషన్నాక ఇవన్నీ తప్పవని నవ్వాయి పెదవులు
తడుముకుంటే తీరదు ఏదీ తీరిగ్గా యోచించమంది
కనులకు విశ్రాంతి ఇవ్వాలని కలవరం మానుకున్నా!

అకస్మాత్తుగా ఆవలింతలెన్నో వచ్చి అన్నాయి నాతో..
అర్పితా...అలోచిస్తే అసహనమే తప్ప సమస్యలేవీ
పరిష్కరించబడవు అసహనంతో ఎన్నో కోల్పోతావంది
అందుకే నిశ్చింతగా నిదుర పోవాలి అనుకుంటున్నా!

కరిగిపోతూ..

దినదినం నేను తరిగిపోయి కరిపోతున్నా
నీ ఊహకు కూడా అంతు చిక్కనివ్వనులే
నీకు ఆ అవసరం అవకాశం రానివ్వను!
క్షణక్షణం నిన్ను తలుస్తూ ఆవిరైపోతున్నా
నన్ను నే వెలిగించుకుంటూ బ్రతికున్నాలే
అయినా ఆ విషయం నీకు తెలీనివ్వను!
చకచకా నువ్వెళుతూ కప్పిన చీకట్లోఉన్నా
కొవ్వొత్తినై కాలిపోతూ వెలుగుని ఇస్తానులే
కరిగిన మైనం మరకైనా నీక్కనబడనీయను!
టపటపా ఆశల ఆకులు నేలరాలిపోతున్నా
మరో కలకు ఆశావాదమద్ది నిద్రలేపుతాలే
నీకు తెలియని నన్ను నేను మ్రింగేస్తాను!
రెపరెపా రెక్కలు కట్టుకుని ఎగిరెళ్ళిపోతున్నా
ఆకాశపు అంచుల్లో అద్దంలా అగుపిస్తావులే
అలా నిన్ను అంటీముట్టక అంతమైపోతాను!