నిన్ను చూసి స్థంబించిన మ్రానులా నీపై వాలినప్పుడు
బరువనుకుని ప్రక్కకు జరుగకు అది నా అనురాగం!
నా చేతివేళ్ళు నీ తలను నిమురుతూ చెరిపేస్తున్నప్పుడు
వెర్రని చిరాకుపడకు అదేమో వ్యామోహానికి నిదర్శనం!
నా మోము నీ చేతుల రాపిడికి ఎర్రగా మారినప్పుడు
కనురెప్పల్ని వాల్చ బాధనా అనడక్కు అదే ఆలంబనం!
మనిద్దరి హస్తాలు హత్తుకుని నులుముకుంటున్నప్పుడు
అదేదో పెనుగులాటని వాపోకు అదో వినపడని గేయం!
వెచ్చని శ్వాస ధ్యాసలు రెండూ వివస్త్రలై ఏకమైనప్పుడు
ఉప్పగుంది స్వేదం అనకు అది అంతరోష్ణ ప్రేమద్రవం!
రెండు శరీరాలు పెనవేసుకుని లతలా అల్లుకున్నప్పుడు
ఒకరికొకరము బంధీలైనాం అనుకోకు అదొక బాంధవ్యం!