పదిల పరచుకునేందుకు మనసు సరిపోక
ప్రకృతిని కూసింత చోటివ్వమని అడగబోతే
చిట్టిగుండెలో చిందులేసేటి చేదుస్మృతులను
పొమ్మంటే గతాన్ని త్రవ్వుతూ నాపై అలక
పంచభూతాలని ఏదోలా మాయ చేయబోతే
తెలియని తపన ఏదో తన తోడు కోరింది!
పెనుగులాట వద్దని పేరుకున్న వ్యధలను
మూటగట్టి మంటల్లో వెయ్యటం నాకు రాక
గతం గుర్తురావద్దని మరపుతో చేయికలిపితే
మంచు కరిగి మంటలార్పి కసిగా నవ్వింది!
చీటికిమాటికి చప్పుడు చేస్తున్న బాసలను
చర్చ చేయక చటుక్కున చంపడం చేతకాక
భవిష్యత్తుని బాట అవ్వమని బ్రతిమిలాడితే
భూత వర్తమానం వేదనలను అప్పగిస్తుంది!