నీ రాకలో...

నువ్వు వస్తావని విని వెన్నెల విరగకాసింది
అరణ్య మయూరమై మనసు నర్తించసాగింది
మోముపై కోటికుసుమాలు తళ్ళుక్కుమనగా
నీలాకాశం మబ్బు చీరను నాపై విసిరేసింది!

కుడి కమలనేత్ర కాటుక కలవరంతో చెదిరింది
శంఖాకృతిలాంటి కోమల కంఠం మూగబారింది
అధరం వణికింది ఆకురాలిన అలికిడికి కూడా
పసిమిమేనిఛాయ ఎందుకో ఏమో ఎర్రబడింది!

విరహగానం విన్న చెవి యుగళగీతం కోరింది
దేహం పారిజాతసుమదళాల పాన్పు పేర్చింది
కురులు పిల్లగాలికే కడలి అలలాగ కదలాడగా
పాదాలు పలుమార్లు గుమ్మంగడపని తాకింది!

వస్తావని రాని ఆలోచనే వచనా కవిత్వమైంది
అక్షరాల హావభావం అలంకారమేలని అలిగింది
ఛందస్సు సంధిసమాస వ్యాకరణాలన్నీ కూడా
నన్ను తాక.....నా అమాయక జ్ఞానం నవ్వింది!

తోడుండవే..

మనసా ఎందుకలా పరుగెడుతున్నావే
వెయ్యి దారాలతో నిన్ను కట్టిపడేసినా
వంద మార్గాలగుండా పారిపోతున్నావే!

ఎన్నో కలలు కల్పించి ఆడుకోమన్నావే
నిద్రను నిటారుగా నిలబెట్టి నిద్రపుచ్చినా
మేల్కుని చెప్పకుండా పయనమైపోయావే!

అలిగిన పగటిని మాటలతో బుజ్జగించవే
సాయంత్రం నీకేమీ గుర్తు రాకపోయినా
రాత్రి కునుకైవచ్చి కలలో కాపురముండవే!

గడచిన కాలాన్ని బ్రతికిద్దాం మరలారావే
ఆరిన కన్నీళ్ళు అకారణంగా తడిబారినా
అవి తుడిచే వంకతో వెంటనే వచ్చేయవే!

మనసా వడిగా అడుగులేయడం ఆపేయవే
అలసిన ఆశలతో కదలలేక చతికిలబడినా
ఆసరాగా చెయ్యందించి నన్ను నడిపించవే!

తెల్లతోలు..

తాత్కాలిక తళుక్కులు ఎందుకులే అని

ఏంవాడక ఏబ్రాసిముఖం వేసుకున్నావా
ఎర్రిదానికి ఏంతెలీదని ఎగతాళి చేస్తారు

బాహ్యంకన్నా ఆత్మ అందం మిన్న అని
కబుర్లెన్ని చెప్పినా అందమంటే తెల్లఒళ్లేగా
పాలిపాచినా తెల్లపాల బొమ్మనే పొగిడేరు

తెల్లగుండి తైతెక్కలాడినా తెలివైనది అని
నడ్డిముక్కూ చీలికళ్ళేసుకుని చిరాకుపడినా
తింగరి వేషాలేసినా తెలివైనదిలే అంటారు

తేజస్సుతో పనేముంది తెల్లగా ఉంది అని
ఏం చేయకున్నా కంటిని కట్టిపడేయునుగా
ముడితే కందిపోవునని గారంగా చూస్తారు

తిమ్మిని భమ్మి చేసేటి లోకంతీరు ఇదే అని
ఒంటిరంగు వంద వంకర్లు కప్పెట్టును కదా
ఒప్పినా ఒప్పకున్నా తెల్లతోలునేగా మెచ్చేరు