నీ తలపుల్లో..

మనిద్దరం ఆనందంగా గడిపిన క్షణాలన్నీ..
అందమైన అక్షరాలుగా అలంకరించేసుకుంటా

ఒక్కో యుగంలా గడిపిన ఎడబాటులన్నీ..
అటక మీదకి ఎక్కాయి ఎంచగ్గా అనుకుంటా

టీ అంటూ ముచ్చట్లతో గడిపిన గంటలన్నీ..
ఏదోక వంకతో నవ్వుతూ గుర్తు చేసుకుంటా

వచ్చి వెళ్తూ ఇబ్బంది పెట్టిన నిముషాలన్నీ..
నీకు దగ్గరగా ఉండాలనే నాకోరిక అనుకుంటా

తొలిసారి కలిసినప్పటి మధురస్మృతులన్నీ..
చిరస్మరణీయంగా మిగిలిపోవాలని కోరుకుంటా

నేనున్నా లేకున్నా నా మాటల భావాలన్నీ..
నీ తలపుల్లో తరగని తాకట్టులా పెరగాలంటా

నాదో ఆశ...జీవిత ఆసరాలు ఈ జ్ఞాపకాలన్నీ
పద్మార్పితే ప్రేమంటే అని నువ్వనుకోవాలంటా!

నిస్సహాయత..

ఎలా ఎలా ఇంకేవిధంగా వివరించి తెలుపను

మనసు నిండా ఇంకా తిరస్కారమే దాగిందని
ఎలా చెప్పినా వ్యతిరేకంగా చెప్పినట్లు ఉందని
మెల్లగా అన్నీ తెలుకునే జ్ఞానం రాలేదెందుకని
పొరలన్నీ తొలగిపోతే వెలుగు వస్తుందని ఆశ!

ఏం ఏం సాకులు వెతికి ఎన్నిసార్లు దగ్గరవను
మనసుకైన గాయాల బీటలు ఇంకా అతలేదని
అయినా అన్నిటికీ ముసుగేసి నవ్వడం కష్టమని
తెలుపలేని నిస్సహాయతను నాలో దాచిపెట్టాలని
చేసే ప్రయత్నానికి సహనాన్ని జరిమానా వేశా!

ఎన్ని ఎన్ని ఔషధాలను మ్రింగేస్తూ ఆకట్టుకోను
మనసు మదనపడితే భావాలకది అపహాస్యమని
తెలిసినా కూడా వాదనకి మౌనమేగా లేపనమని
పెదవుల నడుమ ఆవేశాన్ని అణచేసి బ్రతకాలని
చేసిన పోరాటయత్నంలో మారిపోయింది దిశ!!

తృష్ట్ణ...

రాక రాక చాన్నాళ్ళకు నీవొస్తివి
చూడగానే ఆగలేక హత్తుకుంటివి
ఆత్రంగా అదిది అన్నీ అడిగేస్తివి
చూపులతో అక్కడిక్కడ తడిమితివి
పగటిపూట సరసం వద్దురా అనేస్తి!
ఆముదాన్ని ఒంటికంతా పులిమేసి
శెనగపిండితో ఒళ్ళు నలుగుపెట్టేసి
తలని కొబ్బరినూనెతో మర్దనాచేసి
కుంకుడురసం రుద్ది తలంటుపోసి
వేడినీళ్ళ అభ్యంగస్నానమే చేయిస్తి!
ఒంటికి పట్టేసిన మురికంతా వదిలి
నాటుకోడి కూర తీర్చింది నీ ఆకలి
ప్రయాణ బడలికతీరి కుర్చీలో వాలి
సంధ్యవేళ నిన్ను నిద్రపుచ్చె చల్లగాలి
ఆపై లేవగానే వేడిగా తేనీరు నేనిస్తి!
శృంగారం తెలిసిన రసిక రాజువని
పట్టెమంచం పరుపుపై తెల్లదుప్పటిని
దానిపై పూలపరిమళ అత్తర్లు చల్లితిని
ఆవలిస్తూ అంటివి లైట్ ఆర్పేయమని
తీరనిదాహంతో నేను దిండు నలిపేస్తి!